Friday, August 15, 2025

ఏ భాష నేర్చినా.. మాతృభాషను మరవద్దు

- Advertisement -
- Advertisement -

బతకడం కోసం మాతృభాష నేర్చుకోవాలి. బతుకుదెరువు కోసం ఇతర భాషలు నేర్చుకోవాలన్నది పెద్దల మాట. దాని అర్థం మాతృభాషని మరవమని కాదు, మాతృభాషను జీవితాంతం తలవమని. ప్రాంతాలవారీగా భాషలు వేరైనా భావం ఒక్కటే. మన మనసులోని భావాలను ఇతరులకు తెలియజేయడానికి భాష తప్పనిసరి. అందుకే ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ మాతృభాషను మరవకూడదు. విదేశాలకు వెళ్లాలన్నా కూడా ఆయా దేశాలలో వాడుక భాష నేర్చుకోవడం తప్పనిసరి. విదేశంలో ఆ దేశ వాడుక భాష రాకపోతే మాటలు రాని మూగవాడిలా మారాల్సిందే. భాష ఎంత విచిత్రమైనదంటే కష్టపడి నేర్చుకుంటే వచ్చేది కాదు, ఇష్టపడి నేర్చుకుంటే వచ్చేది. అందుకే చాలామంది ఇతర భాషలను నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుంది కానీ వారు సరైన మార్గాన్ని అనుసరించరు. అనుకోవటమే తప్ప ఆచరించరు.

ఏ పనిలోనైనా మన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, నిరంతర సాధన అవసరం. అందుకే నిరంతర సాధన చేసేవారే ఏదైనా నేర్చుకోగలుగుతారు. నేర్చుకోవాలనే తపన, (Eager learn) సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే ఎన్ని భాషాలైనా నేర్చుకోవచ్చు. అందుకు చక్కటి దృష్టాంతమే చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్ అద్భుత కథ! మహమూద్ అక్రమ్ కేవలం 19 ఏళ్ల వయసులోనే 400 భాషల్లో చదవడం, రాయడం, టైప్ చేయడం, 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం అతని ప్రతిభకు నిదర్శనం. అతి పిన్న వయస్కుడైన అక్రమ్ బహుభాషావేత్తగా ప్రపంచ రికార్డులు, ఎన్నో అవార్డులు సాధించారు. 400 భాషలు రాయడమేంటని ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజం.

ఇన్ని భాషలు ఎలా నేర్చుకోగలిగాడన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలగక మానదు! అక్రమ్ తండ్రి షిల్బీ మోజిప్రియన్ ఉద్యోగం కారణంగా ఇజ్రాయెల్, స్పెయిన్ వంటి విదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మొదట్లో ఆయనకు భాష సరిగ్గా రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.అంతేకాకుండా కాగ్నిటివ్ సైకాలజీలో డాక్టరేట్ కలిగి ఉన్న షిల్బీ భాష లోపం కారణంగా ఎన్నో ఉద్యోగావకాశాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత షిల్బీ ఎలాగైనా భాష నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో, పక్కా ప్రణాళికతో ఒకటి రెండు కాదు ఏకంగా 16 భాషలు నేర్చుకోవడమే కాదు అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం సాధించాడు. 16 భాషలు మాట్లాడే తన తండ్రి షిల్బీ మోజిప్రియన్ పర్యవేక్షణలో అక్రమ్‌కు నాలుగేళ్ల వయసులోనే భాషలపై అనురక్తి కలిగింది. అక్రమ్ తల్లిదండ్రులు తమ పుత్రునికి తమిళం, ఇంగ్లీషు అక్షరాలు నేర్పిస్తున్న సమయంలో అతని ప్రతిభను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అతను కేవలం ఆరు రోజుల్లో ఇంగ్లీష్ అక్షరాలపై పట్టు సాధించాడు.

అంతేకాదు, సాధారణంగా తమిళ అక్షరాలు నేర్చుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది కానీ అక్రమ్ మూడు వారాల్లో 299 తమిళ అక్షరాలను నేర్చుకోగలిగాడు. తన తండ్రి 16 భాషలు మాట్లాడుతుండగా తాను మాత్రం అంతకంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యత సంపాదించాలనే దృఢ సంకల్పంతో ఆరేళ్ల వయసు వచ్చేసరికి తన తండ్రి పరిజ్ఞానాన్ని అధిగమించాడు. ఎవరికీ సాధ్యంకాని పురాతన తమిళ లిపిలను అవలీలగా నేర్చుకోగలిగాడు. అతిచిన్న వయసులోనే తమిళ భాషపై ప్రావీణ్యత సంపాదించాడు. ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయసులోనే అక్రమ్ భాషా ప్రావీణ్యం కోసం చేసిన తపన 50 భాషలు నేర్చుకునేలా చేసింది. రెండేళ్లలో 50 భాషలు ఎలా నేర్చుకోవడం ఎలా సాధ్యం అనే సందేహం రాక తప్పదు. కానీ నేర్చుకోవడం సాధ్యమే. వివిధ భాషలలో కమ్యూనికేట్ చేసే ఓమ్నిగ్లోట్ లాంగ్వేజ్‌పై ఆధారపడి పట్టుదలతో పలు భాషలు నేర్చుకున్నాడు. అతని దృఢ సంకల్పం కారణంగా కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే అతి పిన్న వయస్కుడైన బహుభాషా టైపిస్ట్‌గా తొలి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

భాషా ప్రావీణ్యం కోసం మరింత పట్టుదలతో ప్రయత్నించి, 10 ఏళ్ల వయసులో అక్రమ్ గంట వ్యవధిలోనే 20 భాషల్లో భారత జాతీయ గీతాన్ని రచించి రెండో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. అయినా సరే, అతడు మరిన్ని భాషలు నేర్చుకోవాలనే పట్టుదలతో ప్రయత్నించి 12 సంవత్సరాల నాటికి, 400 భాషలలో చదవడం, రాయడం, టైప్ చేయడం మొదలు పెట్టాడు. 70 మంది భాషా నిపుణులతో పోటీపడి జర్మనీలో మూడవ ప్రపంచ రికార్డును సాధించాడు. అక్రమ్‌కి పాఠం నేర్పిన గురువు ఆయన మాటల వేగానికి భాష నిపుణులు ఆశ్చర్యపోయారంటే అతని భాష ప్రావీణ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక వాక్యాన్ని మూడు నిమిషాల్లో వీలైనన్ని భాషల్లోకి అనువదించి మాట్లాడినందుకు జర్మనీ ఆయనను యంగ్ టాలెంట్ అవార్డుతో సత్కరించింది.

అక్రమ్ భాష గురించి మాట్లాడుతూ ‘ఎవరైనా మీతో మాతృభాషలో మాట్లాడితే, మీరు మీ హృదయంతో ప్రతిస్పందిస్తారు.. కానీ వారు ఇతర భాషల్లో మాట్లాడితే మీ మెదడుతో స్పందిస్తారు’ అని అంటారు.అవును నిజమే కదా! అందుకే కొమర్రాజు లక్ష్మణరావు అన్నమాట గుర్తుకువస్తుంది మాతృభాష తల్లిపాల వంటిది.. పరభాష పోతపాల వంటిదని. అందుకే అక్రమ్ మాతృభాష అంటే ‘అమ్మ’తో సమానం అని అంటాడు. అతను ఇన్ని భాషలు నేర్చుకోవడం వెనుక ప్రేరణ ఇదే. అక్రమ్ వివిధ భాషలు నేర్చుకోవడానికి ఒక సరైన ప్రణాళికను రూపొందించుకుని తప్పకుండా దాన్ని అనుసరిస్తాడు.

ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి రెండు గంటలు భాషలను ప్రాక్టీస్ చేస్తూ, కామిక్ పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం ద్వారా భాషలను పునశ్చరణ చేసుకుంటాడు. ప్రతిరోజూ భాషాపరమైన పుస్తకాలు చదువుతూ భాషలో ప్రావీణ్యతను పెంపొందించుకుంటాడు.అలా నిరంతర సాధన చేయడం వల్లే ఎవరికీ సాధ్యపడనిది అక్రమ్‌కి మాత్రమే సాధ్యపడింది. అక్రమ్ ప్రావీణ్యం సాధించిన భాషల్లో తమిళం ఆయనకు ఇష్టమైన భాష. అది ఆయన మాతృభాష. 400 భాషలు నేర్చుకున్నా సరే అతనికి నచ్చిన భాష మాతృభాష. జీవితంలో అన్యభాషల అవసరం ఎంతో ఉన్నప్పటికీ, మాతృభాష మాధుర్యాన్ని మరిచిపోలేను అంటాడు అక్రమ్. తమిళనాడు రాష్ట్రంలో అక్రమ్ లాంటి భాషా ప్రేమికులు ఉండబట్టే తమిళ భాష మాట్లాడేవారి సంఖ్య నేటికీ ఏమాత్రం తగ్గలేదు. బతుకుదెరువు కోసం భాష నేర్చుకోవాలి.. కానీ మాతృభాషను మరవద్దు అంటాడు అక్రమ్.

  • కోట దామోదర్, 93914 80475
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News