Friday, August 15, 2025

డొనాల్డ్ ట్రంప్‌కు గాజా నోబెల్!

- Advertisement -
- Advertisement -

నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతగానో తపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ బహుమతి గాజా పేరుపై ప్రదానం చేయటం సముచితంగా ఉంటుంది. గత జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ సమస్యను త్వరలోనే పరిష్కరించగలనంటూ ప్రకటించిన ఆయన, ఆ దిశగా ఈ ఏడు మాసాలనుంచి చేస్తున్న కృషికి అటువంటి గౌరవ పురస్కారాలు తప్పక లభించాలి. ఆయనకే కాదు. తనతో పాటు, ఇజ్రాయెల్ శాశ్వత శాంతి సౌఖ్యాల కోసం పాటుపడుతున్న ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను సహ విజేతగా ప్రకటించినట్లయితే ఆ బహుమతికే గౌరవం ఇనుమడిస్తుంది.
గాజా మారణహోమానికి సంబంధించి ఈ వారం రోజుల పరిణామాలను, వాటిపై ట్రంప్ వైఖరిని గమనించండి.

అక్కడ ఇజ్రాయెల్ సైనిక దాడులలో చనిపోయిన పౌరుల సంఖ్య తాజాగా సుమారు 62,000కు చేరింది. అందులో అధికుల స్త్రీలు, పిల్లలు, వృద్ధులు. 242 మంది జర్నలిస్టులు కాగా, వారిలో ఆరుగురిని ఈ 11వ తేదీ ఒక్కరోజే, వారి గుడారంపై బాంబులు వేసి మరీ ప్రాణాలు తీసింది. అంతకు ముందు 7వ తేదీన రక్షణ వ్యవహారాల మంత్రి మండలి సమావేశమై, మొత్తం గాజా నగరాన్ని (Gaza City) సైనికంగా ఆక్రమించాలని తీర్మానించింది. దానితో పాటు 5 తీర్మానాలు చేసింది. 1) హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరించటం, 2) వారి వద్ద బందీగా ఉన్న 50 మందిని విడిపించటం, 3) మొత్తం గాజాలో ఎటువంటి ఆయుధాలు ఎవరి వద్దా లేకుండా చేయటం, 4) గాజాను పూర్తిగా తమ రక్షణ పరిధిలోకి తీసుకోవటం, 5) హమాస్‌కుగాని, వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ ప్రభుత్వానికి గాని ఎటువంటి పాత్ర లేకుండా ప్రత్యామ్నాయ అరబ్ వర్గాలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.

ఈ నిర్ణయాలు జరిగిన తర్వాత జర్నలిస్టులు నెతన్యాహూను, గాజా నగరాన్నే గాక ఆ తర్వాత మొత్తం గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలరా అని ప్రశ్నించగా లేదన్నారు. అదే ప్రశ్నను తర్వాత ఆయన అధికారులకు వేయగా అవునన్నారు.
వాస్తవానికి ఈ ప్రశ్నలు అర్థం లేనివి. ఎందుకంటే మొత్తం గాజాను, వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించి ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ను ఏర్పాటు చేయగలమని నెతన్యాహూ గతంలో పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఆ దిశలో ఎదురులేకుండా ముందుకుపోతున్నారు. అదంతా కనిపిస్తూనే ఉన్నపుడు ఇటువంటి ప్రశ్నలు వేయటం వృధా. ఆ చర్చలోకి వెళ్లే ముందు, పైన పేర్కొన్న ఇటీవలి పరిణామాలపై నోబెల్ శాంతి బహుమతి ఆశావహులైన ట్రంప్ మహాశయుని వైఖరి ఏమిటో చూద్దాము. గాజా మానవ హననాన్ని తన నాటో కూటమి భాగస్వాములతో సహా ప్రపంచమంతా ఖండిస్తుండగా, అది మానవ హననం కానే కాదన్నారు.

హమాస్‌ను నిర్మూలించటం మాత్రమేనని వాదించారు. ఇజ్రాయెల్‌కు తమ ఆయుధాలు, నిధుల సహాయం కొనసాగుతుందని స్పష్టం చేసారు. గాజాను ఆక్రమించగలమన్న నెతన్యాహూ కేబినెట్ తీర్మానం గురించి ప్రశ్నించగా, వారు ఏం చేసేదీ వారి ఇష్టమని, తమకు సంబంధం లేదని ప్రకటించారు. మరొక వైపు ఆయన ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (మన భారత దేశపు ప్రియమైన అల్లుడు) మాట్లాడుతూ, హమాస్ మిగిలి ఉండకపోవటం, బందీల విడుదల మినహా మిగిలిన విషయాల పట్ల తమకు ఆసక్తి లేదన్నారు. అంతేకాదు, స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు తమ విధానం కాదని సైతం ప్రకటించారు. తాము రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటుకు అనుకూలమని, త్వరలో ఆ మేరకు ప్రకటన చేసి పాలస్తీనాను గుర్తించగలమని యూరోపియన్ దేశాలు నిర్ణయించటాన్ని దృష్టికి తేగా, తమ విధానం వేరే అన్నారు.

ఇంత వరకు చెప్పుకున్నవన్నీ గత వారం రోజుల పరిణామాలు. ఇంకా వెనుకటివి మునుముందు గుర్తు చేసుకుందాము. ఇజ్రాయెల్, నెతన్యాహూ సరేసరి. కాని, ట్రంప్‌తో సహా అమెరికా అధ్యక్షులంతా దశాబ్దాలుగా పాలస్తీనా పట్ల కపట నీతిని అనుసరిస్తున్నవారే. ఇప్పటి విషయం, ప్రస్తుత అధ్యక్షునికి నోబెల్ శాంతి బహుమతి పట్ల మోజు కలగటం. ఆయనను ఇప్పటికే పాకిస్థాన్, ఇజ్రాయెల్, కాంబోడియా, ఆర్మీనియా, అజర్ బైజాన్ నామినేట్ చేసాయి. ఇక థాయ్‌లాండ్, ర్వాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అర్జెంటీనా కూడా నామినేట్ చేయగలవని వార్తలు వస్తున్నాయి. తనను నామినేట్ చేయ వలసిందిగా అమెరికన్ ప్రభుత్వం పలు దేశాలతో లాబీయింగ్ చాలానే చేస్తున్నదంటున్నారు. ట్రంప్ ఆ బహుమతికి అర్హులనీ వైట్‌హౌస్ సైతం ప్రకటించింది.

చివరకు, అనూహ్యంగా అటువంటిదేమైనా జరగవచ్చునా? సాధ్యాసాధ్యాల మాట అట్లుంచితే, ఒకవేళ అది జరగకపోతే ట్రంప్ ఆ స్వీడిష్ నోబెల్ కమిటీపైన, తనను నామినేట్ చేయని దేశాలపైన ఆగ్రహించగలరని చెప్పవచ్చు. ఆ కమిటీకి తన నిధులతో పని లేదు గనుక దాని నేమీ చేయలేరు గాని, అటువంటి దేశాలపై టారిఫ్ రేట్లను అదనంగా ప్రకటిస్తే, ఆశ్చర్యపడనక్కర లేదు. ఇది హాస్యానికంటున్న మాట కాదు. ఆయన స్వభావం అటువంటిది. బ్రెజిల్ విషయమై తను ఇటీవల అదే పని చేసారు. అక్కడ అధ్యక్ష ఎన్నికలలో ఓడిన బోల్సొనారో ట్రంప్ మిత్రుడు. ఎన్నికలలో ఓడిన ఆయన లూలా డసిల్వా ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటును రెచ్చగొట్టినందుకు సుప్రీం కోర్టు విచారణలో ఉన్నారు. అది నచ్చని ట్రంప్ తన మిత్రుడిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అందుకు లూలా అంగీకరించకపోవటంతో బ్రెజిల్‌పై ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించారు. వాణిజ్యానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన అంతటితో ఆగక అక్కడి సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ఆంక్షలు ప్రకటించారు. అందువల్ల, ఇపుడు తనను నోబెల్‌కు నామినేట్ చేయని దేశాలు అదనపు సుంకాలకు సిద్ధపడటం మంచిదేమో.

అట్లా చేయని వాటిలో ఇండియా ఒకటి. యుద్ధాన్ని ఆపినందుకంటూ పాకిస్థాన్ ఆయనను నామినేట్ చేసింది. ఆపారా లేదా అన్నది అట్లుంచితే, ఆ మాట పదే పదే అంటూ తనను అవమానిస్తున్న ట్రంప్‌ను భారతదేశం నామినేట్ చేసే ప్రసక్తి ఉండదు. గాజా తతంగం కారణంగా అనేకులు ఆ పని చేయరు. పైగా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దేశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా గల శాంతి సంస్థలు, పౌరహక్కుల సంస్థలు వ్యతిరేకిస్తాయి. స్వయంగా స్వీడన్ సహా యూరోపియన్ దేశాలు గాజా పట్ల అమెరికా వైఖరిని ఆక్షేపిస్తున్నపుడు నోబెల్ శాంతి కమిటీ అందుకు సాహసించగలదని భావించలేము. కాంగో ర్వాండా, కాంబోడియా థాయ్‌లాండ్, ఆర్మీనియా అజర్‌బైజాన్ ఘర్షణలను ఆపిన తర్వాత, గాజా మాట ఎట్లున్నా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి నోబెల్‌కు అర్హతను పెంచుకునేందుకు ఈ 15వ తేదీ శుక్రవారం నాడు రష్యా అధ్యక్షడు పుతిన్‌తో అలాస్కాలో సమావేశమవుతున్న ట్రంప్, ఆ ఇద్దరు అధ్యక్షులతోనూ పేరు ప్రతిపాదనను ఆశిస్తుండవచ్చు కూడా.

అంతిమంగా ఇవన్నీ ఎట్లా పరిణమించినా, ఒక్క గాజా కారణంగా అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి బహుమతితో సత్కరించటం సముచితమవుతుంది. ఆ విషయంలో మొదటి నుండి అమెరికా రికార్డు ఒకటి కాగా, స్వయంగా ట్రంప్ రికార్డు అందుకు సరితూగేదిగా కనిపిస్తుంది. తను అధ్యక్షుడైన కొత్తలో తక్కిన యుద్ధాలతో పాటు పాలస్తీనా సమస్యను కూడా పరిష్కరించగలనంటూ ఆరంభించి, ఆ పని చేయకపోగా, నెతన్యాహూ ప్రభుత్వానికి ఆయుధ విక్రయాలు, నిధుల సహాయం యథావిధిగా కొనసాగించారు. గాజాలో మారణకాండ, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణలను వ్యతిరేకించ లేదు. పైగా ఇజ్రాయెల్ సైన్యం చర్యలను బాహాటంగా సమర్థించారు. నేరమంతా హమాస్ దేనన్నారు. రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటు ద్వారా సమస్య పరిష్కారమంటూ స్వయంగా అమెరికా చొరవతో జరిగిన ఓస్లో ఒప్పందాల గురించిన ప్రస్తావన అయినా చేయలేదు. ఇవన్నీ చాలవన్నట్లు అకస్మాత్తుగా, మొత్తంగా గాజాను స్వాధీనపరచుకుని ‘అందమైన రిసార్ట్‌గా మార్చ గలనన్నారు.

తీవ్రమైన విమర్శలు రావటంతో వెనుకకు తగ్గి, స్వాధీనం పని ఇజ్రాయెల్ చేసి తమకు అప్పగిస్తే రిసార్ట్‌ను అభివృద్ధి పరచగలమన్నారు. మరొక వైపు ఇజ్రాయెల్ పై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె), అంతర్జాతీయ నేర న్యాయస్థానా (ఐసిసి)లలో కేసులు రాగా, ఆ న్యాయమూర్తులపైనే దాడి సాగించారు. కేసు వేసిన దక్షిణాఫ్రికాను బెదిరించారు. పాలస్తీనాను బలవరచకుండా అరబ్ దేశాలపై ఒత్తిడిని కొనసాగించారు. ఒత్తిడిని లెక్క చేయని ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి సైనిక దాడులు జరిపారు. స్థూలంగా ఇదీ ట్రంప్ వ్యక్తిగత రికార్డు. దీనిని బట్టి ఆయనకు శాంతి బహుమతి మాట అట్లుంచి, నెతన్యా హూతో కలిపి యుద్ధ నేరస్థునిగా పరిగణించి నూరెంబర్గ్ తరహా విచారణలు జరిపి శిక్షలు విధించాలి. ఆయన ఘర్షణలు నివారించారంటూ పైన పేర్కొన్న సందర్భాలు కూడా అమెరికా ప్రయోజనాల కోసం చేసినవే తప్ప సద్బుద్ధితో కాదు.

శాంతిని కోరుకుని కాదు. కొన్నింటిలో కనిపించేవి భౌగోళిక రాజకీయ వ్యూహాత్మకమైనవి కాగా, కొన్నింటిలో ఇమిడి ఉన్నవి ఆర్థిక ప్రయోజనాలు. పాలస్తీనా విషయమై చూపుతున్న వైఖరి కూడా భౌగోళిక రాజకీయ వ్యూహాంతోపాటు ఆర్థిక ప్రయోజనాలతో ముడిబడినటు వంటిదే. మధ్య ఆసియా విషయంలో 1948లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ బలవంతపు సృష్టినుంచి మొదలుకొని గత 75 సుదీర్ఘ సంవత్సరాలుగా అమెరికాతో పాటు యూరప్‌ది అదే వైఖరి. ఇపుడు యూరప్ శాంతి అంటున్న మాటలను విశ్లేషించినా కనిపించేది, ఆ ప్రాంతాన్నంతా మరొక రూపంలో తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ఒక కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ఉనికిలోకి తేవాలన్న కుయుక్తులు తప్ప మరొకటి కాదు. అందువల్ల శాంతి బహుమతిలో యూరప్‌ను కూడా కలిపితే మరింత గొప్పగా ఉంటుంది.

  • టంకశాల అశోక్ ( దూరదృష్టి)
  •  రచయిత సీనియర్ సంపాదకులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News