బ్రిస్బేన్: భారత్ ఎ మహిళల జట్టు (India A) ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుతో జరిగిన టి-20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో ఆసీస్ ఆ సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. అయితే అందుకు భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ని ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదికగా ఈ రోజు (ఆగస్టు 15) జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందే జరిగిన తొలి వన్డేలోనూ ఇదే తరహాలో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్‌లో అలైసా హీలీ 91, కిమ్ గార్త్ 41 పరుగులతో మెరిశారు. భారత బౌలింగ్‌లో మిన్ను మణి 3, సైమా ఠాకోర్ 2 వికెట్లు తీయగా.. రాధా యాదవ్, టైటాస్ సాధు, ప్రేమా రావత్, తనుజా కన్వర్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ (India A) ఇన్నింగ్స్‌లో ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. యస్తికా భాటియా (66), కెప్టెన్ రాధా యాదవ్ (60) అర్థ శతకాలతో రాణించారు. అయితే 193 పరుగుల వద్దే భారత్ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తనూజా కన్వర్ (50), ప్రేమా రావత్ (32 నాటౌట్) పోరాడి భారత్‌కు విజయం అందించారు. దీంతో భారత్ సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే ఇదే వేదికగా ఆగస్టు 17న జరగనుంది.