కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ ప్రాంతంలో (West Bengal Bardhaman) ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో బిహార్‌కు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్ని ఈ ప్రమాదంతో 10 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 7.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 35 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతులు బిహార్‌లోని చంపారన్ జిల్లా మోతీహారికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది యాత్రికులు ఉన్నారు.
ఆగస్టు 8న యాత్ర ప్రారంభించిన యాత్రికులు మొదట ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌ను దర్శించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్‌ను దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. (West Bengal Bardhaman) డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో 8 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.