Saturday, August 16, 2025

సింగిల్ బెడ్ రూం ఇంట్లో 45 మంది ఓటర్లా?: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః సింగిల్ బెడ్ రూం ఉన్న ఇంట్లో 45 మంది ఓటర్లా? అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ విస్మయం వ్యక్తం చేశారు. ఓట్ల దొంగతనం జరిగిందని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసిందన్నారు. మహారాష్ట్ర పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దొంగ ఓట్లపై రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు.

పేదలకు సన్న బియ్యం ఇవ్వడం చారిత్రాత్మకమైన నిర్ణయం అని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, దీంతో వారి కళ్ళలో కనిపిస్తున్న ఆనందం చూస్తే ఇందిరమ్మ పాలన గుర్తు వస్తున్నదని ఆయన తెలిపారు. కులగణన చేసి బిసి బిల్లు తీసుకుని రావడంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బిసిల పట్ల ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం లేకపోతే దేశానికి స్వాతంత్య్రం రావడం అంత తేలికైన పనేమి కాదన్నారు. బ్రిటిష్ పాలకుల అడుగులకు మడుగులు వత్తారని, స్వాతంత్య్రం వద్దు అని అన్నారని ఆయన బిజెపి నాయకులనుద్ధేశించి విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News