Saturday, August 16, 2025

ఒక్క చుక్కా వదలం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

రెండు రాష్ట్రాల నీటి వాటాలపై వెనకడుగు వేసేది లేదు
ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులను చిత్తు చేస్తాం
తెలంగాణ అవసరాలన్నీ తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను దక్కించుకొని తీరుతాం
కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం
ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడేది లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఎపి సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి గోల్కొండ కోట వేదికగా కౌంటర్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల నీటి వాటాలపై వెనకడుగు వేసేది లేదంటూ సిఎం తెలిపారు. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులను చిత్తు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తామన్నారు. తెలంగాణ అవసరాలు అన్నీ తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను దక్కించుకుని తీరుతామని సిఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

25 మందికి పతకాలు అందజేత
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు అయన పోలీసు బలగాలు కవాతు నిర్వహించగా సిఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి సిఎం రేవంత్‌రెడ్డి పతకాలను ప్రదానం చేశారు.

రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల చెక్
ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు సిఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్‌ను అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరైన రాహుల్ సిప్లిగంజ్ సిఎం చేతుల మీదుగా ఈ నగదు ప్రోత్సాహాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌కు సిఎం శుభాకాంక్షలు తెలిపారు.
అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని ఆయన తెలిపారు. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామన్నారు. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సిఎం పేర్కొన్నారు. కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించామని సిఎం వెల్లడించారు.

రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం
పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యవసరాలు అందించే ఉద్దేశంతోనే రేషన్ షాపుల ద్వారా ‘సన్న బియ్యం’ పంపిణీని ప్రారంభించామన్నారు. రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక అయిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని సిఎం రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి
అన్నం పెట్టే రైతు అప్పు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదన్న ఆలోచనతో ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశామన్నారు. జూన్ 16న పథకాన్ని ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 70,11,184 మంది రైతుల ఖాతాల్లో రూ.తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించామని, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500ల బోనస్ ఇస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల తమకున్న చిత్తశుద్ధి అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసిందని, అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని సిఎం పేర్కొన్నారు.

కాంగ్రెస్ డిఎన్‌ఏలోనే సామాజిక న్యాయం
పదేళ్ల తర్వాత పేదల సొంతింటి కలలకు మళ్లీ రెక్కలు తొడిగామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నేడు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా కనిపిస్తున్నాయన్నారు. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని అందుకు గాను రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు ఐటీడిఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్‌ఏలోనే ఉంది.

డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంటరీ
ఇటీవల 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యిందని, దీంతో మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే ఇది మొదటి సారి అని, గత ఏడాది హైదరాబాద్‌లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సదస్సు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. గ్లోబల్ రైస్ సమ్మిట్ ను కూడా మనం హైదరాబాద్ లో నిర్వహించుకున్నామని ఆయన పేర్కొన్నారు. మన ప్రభుత్వం నిర్వహించిన బయోఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3,000ల మంది ప్రతినిధులు హాజరయ్యారని సిఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్- 2025ను మనం హైదరాబాద్ లో నిర్వహించామని, ఈ వేదికల నుంచి మనం తెలంగాణ విజన్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశామని, అదే తెలంగాణ రైజింగ్ -2047 అని దానిని వచ్చే డిసెంబర్‌లో ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నామని ఆయన తెలిపారు.

స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పం
మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోందని సిఎం రేవంత్ తెలిపారు. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ అందిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో చెప్పబోతున్నామని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే తమ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ నాకు రెండు కళ్లు
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీలు తనకు రెండు కళ్లు లాంటివన్నారు. తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్డడంలో ఈ వ్యవస్థలు అద్వితీయ పాత్ర పోషిస్తాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మన పిల్లల భవితకు ఇవి కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతున్నాయన్నారు. దేశ క్రీడా చరిత్రలో తెలంగాణకు ప్రత్యేక చాప్టర్ ఉందని, తెలంగాణను దేశ క్రీడా మైదానంగా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకున్నామని ఆయన అన్నారు. మేటి క్రీడా కారులను తయారు చేసి ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాల సాధనే లక్ష్యంగా ఇటీవలే నూతన క్రీడా పాలసీని ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ’ను నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. ఈ వర్సిటీ నిర్వహణ కోసం కొరియన్ నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. అదే సమయంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా స్కూళ్లు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో సర్వ హంగులతో సకల వర్గాల విద్యార్థులు చదువుకునేలా యంగ్ ఇండియా స్కూళ్లు సిద్ధం అవుతున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. ఇవి భారతదేశ విద్య రంగంలో గేమ్ ఛేంజర్లు కావడం ఖాయమన్నారు. ఇప్పటికే ఈ దిశగా రూ.15,600 కోట్ల వ్యయంతో 78 పాఠశాలల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య రంగం అభివృద్ధికి రూ.39 వేల 575 కోట్ల వ్యయం చేశామని, ఈ మొత్తాన్ని తాము ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామన్నారు.

తెలంగాణ పోలీసులు దేశంలోనే ది బెస్ట్
శాంతి భద్రతలు రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయని, దేశంలోనే ది బెస్ట్ అని తెలంగాణ పోలీసులకు పేరుందని సిఎం రేవంత్ తెలిపారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 ప్రకారం కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలవడం మనకు గర్వకారణమన్నారు. 138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమ్మిట్’ (డబ్ల్యూపిఎస్) 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకాణమన్నారు.

గత పాలకులు తమకు వారసత్వంగా రూ.8 లక్షల కోట్ల అప్పు
తాము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు తమకు వారసత్వంగా రూ.8 లక్షల 21 వేల 651 కోట్లను అప్పులు బకాయిలుగా మిగిల్చి వెళ్లారన్నారు. దీనిలో రూ.6 లక్షల 71 వేల 757 కోట్లను అప్పులు, ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.40 వేల 154 కోట్లు అని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1 లక్ష 9 వేల 740 కోట్లు అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News