దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బర్ట్స్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రెండు రోజుల్లో ఈ జల ప్రళయం కారణంగా 321 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోనే 307 మంది చనిపోయారని అక్కడి విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్, జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.
పాక్‌లో (Pakistan) భారీ వరదల కారణంగా కారణంగా పదుల సంఖ్యలో భవనాలు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోగా.. కొన్ని రహదారులు జలమయమయ్యాయి. వరదల్లో కొందరు గల్లంతయ్యారు. వీరికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 2 వేల మందితో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. పాక్‌లో మరికొన్ని ప్రాంతాలకు కూడా వర్షం ముప్పు ఉండటంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.