బెళగావి (కర్ణాటక):దేశంలో మరో విమాన ప్రమాదం తప్పింది. శనివారం (ఆగస్టు 16) ఉదయం బెళగావి-ముంబై విమానంలోని ఒక ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉదయం 7.50 గంటలకు బెళగావి నుండి బయలుదేరి ఉదయం 8.50 గంటలకు ముంబైలో ల్యాండ్ కావాల్సి ఉన్న విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా బెళగావి విమానాశ్రయానికి తిరిగి తీసుకురావడంతో పెను విషాదం తప్పింది. విమానంలో ఉన్న 48 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై స్పందించిన స్టార్ ఎయిర్లైన్స్.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను నివారించడానికి.. ఇంజిన్ వైఫల్యానికి గల కారణాన్ని తమ సాంకేతిక బృందం పరిశీలిస్తోందని నిర్ధారించింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, అత్యవసర సమయంలో సిబ్బంది చూపిన వృత్తి నైపుణ్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది.