హీరో నితిన్ (Hero Nithiin) కృష్ణాష్టమి పర్వదినాన శుభవార్త చెప్పాడు. అయితే అది సినిమాల గురించి కాదు. తన వ్యక్తిగత జీవితం గురించి. గత ఏడాది సెప్టెంబర్‌లో నితిన్ తండ్రైన విషయం తెలిసిందే. అయితే కొడుకు గురించి మాత్రం ఫోటోలు, వీడియోలు బయటపెట్టలేదు. ఇప్పుడు కృష్ణాష్టమి రోజున తన కుమారుడి గురించి ఆ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన కుమారుడి పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
2020లో నితిన్ (Hero Nithiin) తను ప్రేమించిన షాలినీ అనే అమ్మాయిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన వీరిద్దరికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. తాజాగా 11 నెలల తర్వాత తన కొడుకుకు ఏ పేరు పెట్టారో బయటపెట్టాడు నితిన్. కృష్ణాష్టమి సందర్భంగా ఓ ప్రత్యేక ఫోటోని పోస్ట్ చేస్తూ.. తన కొడుకుకు ‘అవ్యుక్త్’ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. దీంతో నితిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నితిన్ పరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది మార్చిలో భారీ అంచనాలతో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఆ సినిమా ఫ్లాప్ అయింది. గత నెలలో ‘తమ్ముడు’ అనే చిత్రం రిలీజ్ కాగా అది కూడా డిజాస్టర్‌గా నిలిచింది. నితిన్ త్వరలో ‘బలగం’ ఫేమ్ వేణుతో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తోంది.