దేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) గృహరుణ దాతలకు పిడుగు లాంటి వార్త చెప్పింది. గృహరుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిసి పాయింట్లు మేర పెంచింది. తక్కువ సిబిల్ స్కోరు ఉండేవారికి ఇకపై అధిక వడ్డీరేట్లకు హోమ్ లోన్‌ను ఎస్‌బిఐ అందించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సిబిల్ స్కోరు, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ఆధారంగా విధించే వడ్డీరేట్లలో ఎస్‌బీఐ మార్పులు చేసింది. గృహ రుణాలపై మార్జిన్ పెంచుకునేందుకే వడ్డీరేట్లను పెంచామని, అయితే, ఈ పెంపు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమేనని, ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలకు ఇది వర్తించదని విశ్వసనీయ సమాచారా వర్గాలు వెల్లడించగా, దీనిపై ఎస్‌బిఐ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే గృహరుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిసి పాయింట్లు మేర పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో నూతన వడ్డీరేట్లు కొత్త రుణ గ్రహీతలకు వర్తిస్తుందని, ఈ వడ్డీరేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బిఐ ప్రకటించింది.
అయితే కాల వ్యవధి ఆధారంగా ఈ గృహ రుణాల వడ్డీరేట్లలో వ్యత్యాసం ఉండగా, ఈ రేట్ల గరిష్ఠ పరిమితిని ఇప్పుడు ఎస్‌బిఐ పెంచేసింది. ఇప్పటివరకు ఈ బ్యాంకులో గృహ రుణల రేట్లు 7.50 శాతం నుంచి 8.45 శాతంగా ఉండగా తాజా నిర్ణయంతో ఇది 7.50 శాతం నుంచి 8.70 శాతానికి చేరుకుంది. మరోవైపు ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలు మించి ఎస్‌బీఐ సత్తాచాటింది. 2025-, 26 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి మూడు నెలలకు గానూ రూ.19,160 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. గతేడాది నమోదైన రూ.17,035 కోట్ల నికర లాభంతో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.1,35,342 కోట్లుగా నమోదు కాగా, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,22,688 కోట్లుగా ఉంది. తాజాగా ఎస్‌బిఐ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారికి సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఎస్‌బిఐ మరింత లాభపడనుందని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ గృహరుణాలపై వడ్డీరేట్లను సవరించింది. గతంలో 7.35 శాతం ఉండగా తాజాగా దాన్ని 10 బేసిస్ పాయింట్లు పెంచి 7.45 శాతానికి చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుగా తక్కువ వడ్డీరేట్లకే గృహ రుణాలు ఇస్తున్న ఎస్‌బిఐ వడ్డీరేట్ల సవరింపు నిర్ణయంతో మిగతా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది.