Sunday, August 17, 2025

దక్షిణాదిలో పెరుగుతున్న అబార్షన్లు

- Advertisement -
- Advertisement -

దక్షిణాదిలో గడిచిన ఐదేళ్ల వ్యవధిలో అబార్షన్లు గణనీయంగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్ర దేశంలోనే ముందుంది. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది 2,07,019 అబార్షన్లు జరిగాయి. రెండో స్థానంలో తమిళనాడు నిలిచింది. ఇక్కడ 1,01,414 అబార్షన్లు జరిగాయని నివేదిక తెలిపింది. 3,4,5 స్థానాల్లో అసోం (76,642) , కర్ణాటక (70,241), రాజస్థాన్(53,714) ఉండడం గమనార్హం. తెలంగాణ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఐదేళ్ల క్రితం 2020 -21 లో 1,578 అబార్షన్లు నమోదవగా ఈ ఏడాది ఏకంగా 917 శాతం పెరిగి 16,059 నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. కేంద్ర ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఇటీవల పార్లమెంటుకు సమర్పించారు.కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

అక్కడ ఐదేళ్లలో అబార్షన్స్ నాలుగు రెట్లు పెరిగాయి. 2020- 21లో 2,282 ఉండగా, 2024-25 నాటికి 10,676కు పెరిగాయి. ఈ లెక్కన ఏపీలో 317శాతం అబార్షన్లు పెరిగినట్టు నివేదికలో ఉంది. గర్భా విచ్ఛిత్తులకు అనేక కారణాలున్నాయని తెలుస్తోంది. అందులో ఆర్థిక పరమైన కారణాలతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా కూడా కొందరు గర్భా విచ్ఛిత్తులు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. పోషణ భారమని భావించి కొందరు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, నగరాల విషయాన్ని పరిశీలిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నా.. ఆలస్యంగా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గర్భం వస్తే అబార్షన్లు చేయించుకుంటున్నట్టు తేలింది. దీంతో పాటు పరిమిత సంతానం అనే భావన కూడా గర్భా విచ్ఛిత్తులకు కారణమవుతోందని సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేవారు. ఇప్పుడు అధిక జీవన వ్యయాలు, ఇతర ఖర్చుల కారణంగా ఒక బిడ్డకే పరిమితమవుతున్నారని హైదరాబాద్ కు చెందిన సీనియర్ గైనకాలజిస్ట్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News