ఖమ్మం: ద్విచక్ర వాహనం కొనివ్వడంలేదని కన్న తండ్రిని కుమారుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో గల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళగూడెంలో బండారు నాగయ్య, నాగలక్ష్మీ అనే దంపతులు నివసిస్తున్నారు. భార్య భర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులు సతీష్ అనే కుమారుడు ఉన్నాడు. సతీష్ ఎనిమిదో తరగతి వరకు చదువుకొని అనంతరం ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడంతో వారు స్మార్ట్‌ఫోన్‌ను కొనిచ్చారు. గత రెండు నెలల నుంచి దిచక్రవాహనం కొనివ్వాలని తలిదండ్రులను బలవంతం చేస్తున్నాడు.
తమ దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు బైక్ అవసరం లేదని పలుమార్లు కుమారుడికి తండ్రి నచ్చజెప్పాడు. తన బైక్ కొనివ్వకపోతే చంపుతానని జులై 13వ తేదీ గడువు విధించాడు. 14వ తేదీ తెల్లవారుజామున తండ్రి నాగయ్యను గొడ్డలితో నరికి చంపాడు. తల్లి నాగలక్ష్మీ నిద్రలేచి వస్తుండగా ఆమెపై గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. కేకలు వినపడడంతో గ్రామస్థులు రావడంతో సతీష్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.