Wednesday, August 20, 2025

అహింస, ప్రేమతో జగతికి శాశ్వతశక్తి

- Advertisement -
- Advertisement -

మనిషి పుట్టుకతోనే ఆశలు, ఆలోచనలు, అనుభూతులు అనే వరాలు పొందాడు. ఇతర ప్రాణులతో పోల్చితే తనలోని మానసిక శక్తి అతడిని ప్రత్యేకుడిగా నిలబెట్టింది. పరస్పరం సహాయం చేసుకోవడమే తన నిజమైన బలం అని గ్రహించిన క్షణమే మానవతా మార్గం మొదలవుతుంది. కానీ ఈ బలాన్ని తప్పుదోవ పట్టిస్తే హింస, విధ్వంసం, స్వార్థం అనే అంధకారాలు పుట్టుకొస్తాయి. ప్రకృతిని రక్షించే స్థానంలో దాన్ని దోపిడీ చేయడం, మనిషిని ఆదుకోవలసిన చోట నరహత్యలు చేయడం-ఇవన్నీ మానవ విలువలు మసకబారినప్పుడు జరిగే దుర్విపరిణామాలు. నరుడిని నరుడు ఆదుకుంటే అది దైవత్వానికి ప్రతిరూపం. ఆపదలో ఉన్న మనిషికి చేయి అందించడం జీవనానికి వెలుగునిస్తుంది. ఆకలి తీర్చడం, రోగికి ఔషధం అందించడం, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడం-ఇవే మానవత్వపు నిజమైన పుష్పాలు.

ఆ పుష్పాల పరిమళం సమాజమంతా నింపుతుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆకలి, విపత్తులు మనుష్యులను అణచివేస్తున్నా, మానవతా మూర్తులు (Humanity icons) ముందుకు వచ్చి కాపాడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి సహాయం అందించే వారిని మనసారా వందనం చేయాలి. ఒకరి ప్రాణం కోసం త్యాగం చేయడం మానవత్వానికి ఉన్నత శిఖరం. ప్రతి మనిషి తన వంతు సహానుభూతి చూపగలిగితే సమాజం శాంతి బాటలో నడుస్తుంది. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది, సేవా సంస్థల కార్యకర్తలు- తమదైన విధంగా మానవత్వపు జ్యోతిని వెలిగిస్తున్నారు.

వీరిని ఆదర్శంగా తీసుకొని మనమూ చేయూతనిచ్చే అలవాటు పెంపొందించుకోవాలి. హింస, ద్వేషం, రాక్షసత్వం అన్నీ తాత్కాలిక చీకట్లు మాత్రమే. మానవత్వం అనే దీపం వెలిగితే అవన్నీ చెదిరిపోతాయి. చెట్టు వలె పెరిగి చెట్టు వలె నీడనిచ్చే గుణం మనిషి స్వభావమవ్వాలి. లోకమంతా మానవత పరిమళంతో నిండిపోయినప్పుడే నిజమైన శాంతి యుగం సాకారం అవుతుంది. ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా అనేక దేశాలలో విభిన్న కార్యక్రమాలు జరుగుతాయి. ఇండోనేషియాలో మానవతా రాత్రి కార్యక్రమం ( Humanitarian Night) పేరిట యువతకు అవగాహన పెంచే సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, చర్చా వేదికలు, సేవా సంస్థల ప్రదర్శనలు నిర్వహిస్తారు. అదే దేశంలో విపత్తు నిర్వహణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ముం దస్తు జాగ్రత్తలపై అవగాహన కలిగిస్తూ ప్రజలకు ప్రత్యక్ష ప్రదర్శనలు చూపిస్తారు.

స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ స్థాయి సభలు జరుగుతాయి. ఈ సందర్భంగా మానవతా సేవకుల త్యాగాలను గుర్తుచేసి గౌరవిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి, రెడ్క్రాస్, ఇతర సేవా సంస్థలు మనిషి కోసం మానవత్వం అనే భావజాలంతో ప్రచార యాత్రలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, స్థానిక సంఘాల శక్తివంతరణ వంటి కార్యక్రమాలను చేపడతాయి. ఐరోపా దేశాలు కూడా ఈ రోజు మానవతా సేవకులను రక్షించేందుకు, సహాయక నిధులను సమకూర్చేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటాయి. అమెరికాలోని కొన్ని సేవా సంస్థలు మానవతా వీరుల కథలను విన్నవిస్తూ సంగీత కార్యక్రమాలు, వర్చువల్ సమావేశాలు నిర్వహించి సేవకులను గౌరవిస్తాయి.

ఈ అన్ని కార్యక్రమాల ద్వారా మానవతా విలువల పట్ల గౌరవం పెరుగుతుంది, సహాయానికి సిద్ధపడే మనసు బలపడుతుంది, సమాజం శాంతి బాటలో నడవడానికి ప్రేరణ లభిస్తుంది. భారతదేశంలో మానవత్వం అనే విలువ ప్రాచీన సంస్కృతిలోనే ప్రతిబింబించబడింది. వసుధైక కుటుంబకం అనే మ హోన్నత సూత్రం మన భూభాగపు మానసిక ధనాన్ని ప్రతిబింబిస్తుంది. అన్నింటినీ కుటుంబ సభ్యుల్లా భావించే మన దృక్పథమే మానవత్వానికి అసలు మూలం. ఇక్కడి తత్వం లో దయ, కరుణ, దానం, పరమార్థం వంటి విలువలు ప్రధానంగా నిలిచాయి. ప్రతి కాలంలోనూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దుస్తులు లేని వారికి వస్త్రం అందించడం, అనారోగ్యంతో ఉన్నవారికి ఔషధం ఇవ్వడం, వృద్ధులు, అనాథలు, వికలాంగులకు చేయూతనివ్వడం వంటి సేవా భావం కొనసాగుతూ వచ్చింది.

నేడు దేశవ్యాప్తంగా అనేక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు, ఆశ్రమాలు, మతపరమైన సేవా కేంద్రాలు మానవతా దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, అనాథాశ్రమాలలో సేవా కార్యక్రమాలు, పాఠశాలలలో విద్యా సామగ్రి పంపిణీ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్క్రాస్ సంఘం, రోటరీ, లయన్స్ వంటి సంస్థలు మాత్రమే కాకుండా, అనేక స్థానిక స్వచ్ఛంద సంఘాలు విపత్తు పరిస్థితుల్లో ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా యువత రక్తదానం, అవయవదానం, పర్యావరణ పరిరక్షణ వంటి ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా మానవత్వానికి కొత్త శక్తిని ఇస్తున్నారు. ఈ విధంగా భారతదేశం తన ప్రాచీన తాత్విక విలువలను నేటి సమాజంలోను ప్రతిఫలింపజేస్తూ, మానవీయ సహకారానికి మార్గదర్శిగా నిలుస్తోంది.

మనిషి స్వార్థం కోసం యుద్ధాలు చేస్తే వినాశనం తప్పదు పరహితం కోసం చేయి అందిస్తే శాంతి పుష్పాలు విరియుతాయి మానవత్వం అనేది సరిహద్దులకు పరిమితం కాని సర్వలోక గుణం ప్రతి అన్యాయం ముందు మౌనం కాపాడటం కన్నా చిన్న సహాయం చేయడమే మహత్తరమైన కర్తవ్యము ఒకరి కడుపు నింపడం ఒకరి కన్నీరు తుడవడం ఒకరి ప్రాణం రక్షించడం భూమ్మీద నిజమైన పుణ్యకార్యాలు ఐక్యరాజ్యసమితి చూపుతున్న మార్గం మనందరినీ మానవీయ విలువల వైపు నడిపించాలి ప్రతి దేశం ప్రతి సమాజం ప్రతి మనిషి తన వంతు చేయూతనివ్వగలిగితే భూమి స్వర్గధామంగా మారుతుంది మనసులోని ద్వేషాన్ని తుడిచిపెట్టి స్నేహాన్ని పంచితేనే శాంతి సాధ్యం అవుతుంది పుట్టుక మానవుడిగా అయితే బతుకులో దయ కరుణ పరహితం ఆచరించగలిగినవాడే నిజమైన మనిషి అవుతాడు ఈ లోకాన్ని నిలబెట్టే అసలు శక్తి ఆయుధాలది కాదు ప్రేమ కరుణలే ఆ ధ్రువ దీపాలు.

  • డా. చిటికెన కిరణ్ కుమార్
    9490 841284
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News