బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). గత నెల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పరిచయ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడఖ్‌లో జరుగుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌లో ఊహించని ఘటన జరిగింది. ఈ చిత్ర యూనిట్ నుంచి 100 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. లడఖ్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతున్న ధురంధర్ సినిమా షూటింగ్‌లో పని చేస్తున్న కార్మికులు ఆస్వస్థతకు గురయ్యారు.
ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అకస్మాత్తుగా సెట్‌లో చాలా మంది వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో ఇబ్బందిపడ్డారు. వెంటనే వారిని లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేసిన తర్వాత డాక్టర్లు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్‌గా గుర్తించారు. అయితే సెట్‌లో దాదాపు 600 మంది భోజనం చేస్తే.. కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని విచారిస్తున్నారు.
కాగా, ధురంధర్ (Dhurandhar) సినిమాలో పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంజత్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.