మన తెలంగాణ/హైదరాబాద్: జిఎస్‌టి కౌ న్సిల్ సమావేశం బుధవారం(ఆగస్టు 20) జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కెటిఆర్ మంగళవారం బహిరంగ లేఖ రాశా రు. జిఎస్‌టి స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులు గా ప్రచారం చేసుకుంటుందని చెప్పారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తోందని విమర్శించారు. జిఎస్‌టిలో 12 శాతం శ్లాబ్‌ను రద్దు చేసి, పేద,మధ్యతరగతి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజలను మభ్యపెట్టే మరో ‘జుమ్లా’ తప్ప మరొకటి కాదు అని, మొత్తం జిఎస్‌టి పరిధిలోని 22 లక్షల కోట్లకు పైగా వచ్చే ఆదాయంలో ఈ 12 శా తం స్లాబ్ వాటా కేవలం 5 శాతం మాత్రమే అని పేర్కొన్నారు. ఇంత నామమాత్రపు వాటా ఉన్న స్లాబ్‌ను రద్దు చేసి,అందులోని వస్తువులను వేరే స్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలందరినీ ఉద్ధరించినట్లు మోడీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ధరలు తగ్గించి,
దేశ ప్రజలకు ‘అసలైన దీపావళి’ని అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ధరల మంటకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. గత దశాబ్దకాలంగా పా లు, పెరుగు, పప్పు, ఉప్పు లాంటి నిత్యావసరాలపై కూడా జిఎస్‌టి విధించి బిజెపి ప్రభు త్వం సామాన్యుడి నడ్డి విరిచిందని అన్నారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు. ఈ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. గత పుష్కరకాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి రేట్ల రూపంలో దోచుకుందని ధ్వజమెత్తారు. వేలాది రూపా యలు పెట్రోల్, ఎల్‌పిజి, డీజిల్ రూపంలో భారం మోపుతూ జిఎస్‌టి స్లాబ్ మార్పుతో కేవలం పదుల రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.