రోహిత్ వర్మ కథానాయకుడిగా రియా సుమన్ నాయికగా నటిస్తోన్న నూతన చిత్రం మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. క్రేజీ కింగ్స్ (Crazy Kings) స్టూడియోస్ ఎల్.ఎల్.పి. బ్యానర్ లో నజీర్ జమాల్ నిర్మిస్తుండగా, గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి విజయ్ కనకమేడల క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు రామ్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు మల్లిఖార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, ప్రగతి, వర్మ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం చిత్రం గురించి నిర్మాత నజీర్ జమాల్ మాట్లాడుతూ “తెలుగులో నాకిది మొదటి సినిమా. కథ విన్న తర్వాత బాగా నచ్చి (like very much) సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. ఇందులో పాటలు అద్భుతంగా వుంటాయి”అని అన్నారు. కథానాయకుడు రోహిత్ వర్మ మాట్లాడుతూ “ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా వుంది. అందరూ మెచ్చే సినిమా ఇదవుతుందని నమ్మకం ఉంది”అని పేర్కొన్నారు. దర్శకుడు గోవిందరెడ్డి చంద్ర మాట్లాడుతూ ఇది పక్కా కమర్షియల్ సినిమా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రియా సుమన్, నిఖిల్ దేవేదుల, అక్షర పాల్గొన్నారు.