ఆసియాకప్-2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. యుఎఇ వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఈ జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) చోటు దక్కకపోవడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించి.. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ఆసియాకప్‌లో అతన్ని సెలెక్ట్ చేయకపోవడంపై అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు పలువురు సీనియర్లు కూడా ఈ విషయంపై మండిపడుతున్నారు. మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై బిసిసిఐ తీరును విమర్శించారు.
ఆసియాకప్ కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) లేకపోవడం కచ్చితంగా చర్చనీయాంశం అని ఆకాశ్ అన్నారు. ఒక ఆటగాడిగా శ్రేయస్ తనని తాను నిరూపించుకున్నాడని.. ఐపిఎల్‌లోనూ అద్భుతంగా రాణించాడని అన్నారు. ‘‘ఐపిఎల్‌లో శ్రేయస్ తన జట్టు పంజాబ్‌ని ఫైనల్స్‌కి తీసుకువెళ్లాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మంచిగా ఆడాడు. ఒక మనిషిగా తనకు సాధ్యమైనవన్నీ చేశాడు. కానీ, అతని జట్టులో చోటు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు’’ అని ఆకాశ్ అన్నారు.
అయితే త్వరలోనే టి-20 ప్రపంచకప్ కూడా జరగబోతుంది. ఆసియా కప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టు సభ్యులే టి-20 ప్రపంచకప్ కూడా ఆడుతారనే నమ్మకం లేదని ఆకాశ్ తెలిపారు. ‘‘ఆసియా కప్, టి-20 ప్రపంచకప్‌కి మధ్యలో 15 అంతర్జాతీయ టి-20లు ఉన్నాయి. దీంతో జట్టు తారుమారయ్యే అవకాశం ఉన్నట్లే కదా. వన్డేల్లో నిలకడగా పరుగులు సాధిస్తే.. అతడు టి-20ల్లో రీ-ఎంట్రీ ఇవ్వొచ్చు. శ్రేయస్ అయ్యర్ ఈసారి టి-20 ప్రపంచకప్ జట్టులో కచ్చితంగా ఉంటాడని నా నమ్మకం’’ అని ఆకాశ్ ధీమా వ్యక్తం చేశారు.