హైదరాబాద్: గూగుల్ లాంటి ప్రముఖ సంస్థల్లో తెలుగువారు పెద్దపదవుల్లో ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని అన్నారు. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని పలు సంస్థలు నిర్మించారని, రాజీవ్ గాంధీ వల్లే ఇండియాలో ఐటి రంగం అభివృద్ధి చెందిందని తెలియజేశారు. మన ఐటి నిపుణులు పనిచేయడం ఆపేస్తే అమెరికా స్తంభించిపోతుందని, హైదరాబాద్ ను విశ్వనగరంగా నిర్మించుకోవాలని అన్నారు.
హైటెక్ సిటి కట్టినప్పుడు అవహేళన చేశారని, హైదరాబాద్ దాహార్తి కోసం కృష్ణానదీ నుంచి నీటిని తరలించారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యోతో పోటిపడుతోందని కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన (Peaceful) ఉద్యోగ భద్రత ఇచ్చామని, రాబోయే పదేళ్లలో బిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారని మూసీ నది మురికిలో బతకాలని పేదలు ఎందుకు అనుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రైజింగ్ 2047 తో అభివృద్ధి చేసుకుందామని, మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీ రావాలని ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలని అధికారులకు సూచించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవు అని అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే అడ్డుకట్ట వేయాలని, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటి నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని మండిపడ్డారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, హైదరాబాద్ పాతబస్తీ.. ఓల్డ్ సిటి కాదని.. ఒరిజనల్ సిటి అని ప్రశంసించారు. మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని హామి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని, అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించబోతున్నామని చెప్పారు.
ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా కార్యాలయాలు నిర్మిస్తున్నామని, నగర అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువేనని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.