నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. గతంలో చాలాసార్లు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, అవి నిజం కాలేదు. దీంతో అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా హీరో నారా రోహిత్ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చిన్న హింట్ ఇచ్చారు.
టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) చాలా ఆసక్తిగా ఉన్నాడని రోహిత్ తెలిపారు. ‘‘మోక్షజ్ఞతో ఇటీవల మాట్లాడినప్పుడు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది చివర్లో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అతని ఎంట్రీ ఉండొచ్చు. ఇండస్ట్రీకి రావడానికి అతడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సినిమా కోసమే లుక్ మార్చాడు. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నట్లు ఈ మధ్య కలిసినప్పుడు చెప్పాడు. అలాంటి కథ దొరికితే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండే అవకాశం ఉంది’’ అని రోహిత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇక రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.