Thursday, August 21, 2025

ఢిల్లీ సిఎంపై దాడి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ప్రజల ఇబ్బందులను ఆలకించేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం ఉదయం తన నివాసంలో బహిరంగ విచారణ నిర్వహిస్తుండగా ఓ దుండగుడు దాడికి తలపడ్డాడు.ఈ దాడిలో ముఖ్యమంత్రి చేతికి, తలకు గాయాలయ్యారు. జన్ సున్వాయ్ పేరుతో సీఎం సామాన్య ప్రజల సమస్యలను ఆలకించే కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి హఠాత్ గా ఆమెపై
దాడి చేశాడు. వెంటనే సీఎం భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, ఆ ఉద్యోగిని అడ్డుకోవడం వంటి అభియోగాలు నమోదు చేశారు.దాడికి పాల్పడిన వ్యక్తిని గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన 40 ఏళ్ల రాజేష్ సక్రియా గా గుర్తించారు. అతడు కుక్కల ప్రేమికుడు. ఢిల్లీ దేశరాజధానిలో వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఆ వ్యక్తి కలత చెందాడని అతడి తల్లి భాను తెలిపింది.

కొన్ని కాగితాలు చేతపట్టుకుని, ముఖ్యమంత్రికి ఏదో మహజరు సమర్పించేందుకు వచ్చినట్లు కన్పించిన ఆ వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఆమె చెంపపై పెద్దగా కొట్టి, ఆమెను నెట్టివేశాడు. అది చూసిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని నిరోధించేలోగా ఆ వ్యక్తి రేఖా గుప్తా జుట్టును పట్టుకుని లాగాడని సీఎం కార్యాలయం వర్గాలవారు తెలిపారు. ఈ దాడికి రాజేష్స క్రియా ముందే ప్లాన్ చేసుకుని పకడ్బందీగా సీఎంపై దాడికి పాల్పడినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది. దాడి చేయడానికి 24 గంటల ముందు ఆ వ్యక్తి దాడికి సన్నాహాలు చేసుకున్నాడని, ఆమె నివాసాన్ని తనిఖీ చేసు్తూ, రెక్కీ కూడా నిర్వహించాడని అక్కడ రికార్డు అయిన సిసిటీవి ఫుటేజ్ లో వెల్లడైంది. ఆ వీడియోను కూడా పోలీసులకు అప్పగించారు. సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతివారం జన్ సునావే కార్యక్రమాని నిర్వహిస్తారు. బీజేపీ సీనియర్ నాయకుడు హరీష్ ఖురానా సీఎంపై ఒక వ్యక్తి దాడి చేయడాన్ని ఖండించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రిని డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ పరమైన ప్రేరేపణ ఏమైనా ఉందా అన్న విషయాన్ని దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు బిజెపి పేర్కొంది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో చేస్తున్న పనిని ప్రత్యర్థులు సహించలేకపోతున్నారని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీపార్టీ నాయకురాలు అతిషి కూడా ఈ దాడని ఖండించారు.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. ముఖ్యమంత్రి పై దాడి అతి పెద్ద భద్రతా ఉల్లంఘనగా భావిస్తున్నారు. ఉన్నత స్థాయిలో విచారణ నిర్వహిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ
పోలీసు కమిషనర్ ఎస్ బికె సింగ్ స్వయంగా ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News