ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో జరిగిన మంత్రుల బృందం సమావేశానికి హాజరయ్యారు. జీవిత , ఆరోగ్య బీమా సేవలను జిఎస్‌టి నుండి తగ్గించడం లేదా మినహాయింపుపై పరిశీలించడానికి, సిఫార్సులు చేయడానికి మంత్రుల బృందం సమావేశాన్ని జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటు చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలు, అన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలను, వాటి పునఃభీమాతో పాటు మినహాయించడం గురించి వివరంగా చర్చించారు.
ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ ఉప ముఖ్యమంత్రి ఈ చర్య ఖచ్చితంగా భీమా యొక్క వ్యాప్తి, సాంద్రతను పెంచుతుందని పేర్కొన్నారు. అయితే జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై పన్ను మినహాయింపు ప్రయోజనం బీమా కంపెనీలను సుసంపన్నం చేయకుండా అంతిమ వినియోగదారులకు, బీమాదారులకు చేరేలా చూసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని సూచించారు. అటువంటి పరిస్థితిలో మాత్రమే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అయితే రాష్ట్రాలు ఆదాయంలో కొంత భాగాన్ని కోల్పోతాయని, లేకపోతే అది ఇతర సంక్షేమ పథకాలకు ఉపయోగించబడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 95 లక్షల కుటుంబాలకు బీమా సేవలను అందించడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.