మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులకు 2 లక్షల టన్నుల యూ రియాను ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చే శారు. తెలంగాణలో రెండు నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురిచిందని విమర్శించారు. ఈ మేరకు ఆ యన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు కూటమి పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయని వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ సర్వ స్వతంత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు. తమకు ఢిల్లీలో బాస్‌లో లేరని, ఏ పార్టీ కూడా తమకు బాస్‌లు కారని,
మాకు తెలంగాణ ప్రజలే బాస్‌లో తప్ప…ఢిల్లీలో పెద్దలు, ఆదేశించే వారు ఎవరూ లేరని కేటీఆర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయం లో మాకు ఏ పార్టీ, అభ్యర్థులు కానీ మమ్మల్ని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోందని కేవలం మీడియాలో చూసేదాకా తెలియదన్నారు. ఎన్నికపై తమను ఎవరూ కూడా సంప్రదించలేదని, ఎన్నికకు ఇంకా సమయం ఉన్నందున బీఆర్‌ఎస్ నేతలు కలిసి ఆలోచించుకుని ఎన్నికల సమయానికి తమ వైఖరి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తాము ఎన్డీఏ కూటమీలో లేము..ఇండియా కూటమిలో లేమని కేటీఆర్ అన్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై కూడా తమకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తమకు బాస్‌లు కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
రెండు పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయి :
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష చేయలేదని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖతో ఇతర శాఖలకు సమన్వయం లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాకం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక రైతు 3 బస్తాల యూరియా తీసుకుంటే నాన్-బెయిలబుల్ కేసు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్‌లో యూరియా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి 51 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక్క బస్తా యూరియా కూడా తీసుకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా :
రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని విమర్శించారు. కాంగ్రెస్ అనేది ఒక చిల్లర పార్టీ అని..అలాంటి ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థిని మేము సమర్ధిస్తామని ఎలా అనుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా జరుగుతోందన్నారు. బీసీల విషయంలో పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్పి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక్క బీసీ అభ్యర్ధి దొరకలేదా? అని నిలదీశారు. సామాజిక వేత్త కంచె ఐలయ్యను అభ్యర్థిగా పెట్టి మీ చిత్తశుద్ధి నిరుపించుకోవాల్సిందని సూచించారు. బీసీ అభ్యర్ధులను పెట్టరు..కానీ మీ మాటలు మేము నమ్మాలా? అని ప్రశ్నించారు. రెండు పార్టీలు దొందూ..దొందే.. వారు తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. కాబట్టి సెప్టెంబర్ 9 లోపు రెండు లక్షల టన్నుల ఎరువులు ఎవరు తీసుకొచ్చి పెడితే ఆ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థికే బీఆర్‌ఎస్ సానుకూలంగా ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.