భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జారీ
ఛత్తీస్‌గఢ్, ఎపి, ఒడిశాలకు నిలిచిపోయిన
రాకపోకలు దుమ్ముగూడెం మండలంలో
పలు గ్రామాల్లోకి చేరిన నీరు
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
మంత్రులు తుమ్మల, పొంగులేటి ఆదేశం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బుధవారం రాత్రి 10 గంటలకు 48 అడుగులకు నీరి చేరడంతో అధికారులు రెండో హెచ్చరికను జారీ చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి నుంచి గోదావరి క్రమేపీ పెరుగుతున్న విష యం తెలిసిందే. బుధవారం ఉదయం 8.15 గంటలకు నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో తొలి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. అది గంట గంటకు పెరుగుతూ వస్తోంది. గురువారం ఉదయం గోదావరి నిలకడగా ఉండి ఉదయం 10 తరువాత గోదావరి క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాత్రి 9గంటలకు 1128400 క్యూసెక్కుల నీటి ప్రవాహం వద్ద కన్పించింది. భద్రాచలం దేవస్థానం కళ్యాణకట్ట వరకు వరద చేరుకుంది. దుమ్ముగూడెం మండలం, తురుబాక రోడ్డుపైకి నీళ్ళు వచ్చాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.
కూనవరం రోడ్డుపైకి నీళ్లు రావడంతో ఆంధప్రదేశ్ రాష్ట్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. ఎపితో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఎస్‌పి దుమ్ముగూడెం మండలం, తూరుబాక వద్ద రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పాయింట్‌ను తనిఖీ చేసి, ఒకవేళ గోదావరి ఉద్ధృతి మరింతగా పెరిగినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రాచలం పట్టణవాసులతో పాటు పరిసర లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో అధికార యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని, గ్రామ స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎగువ నుంచి వరద ఉద్ధృతితో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ప్రవాహం ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం రామాలయం వద్ద కరకట్ట స్లూయిస్ లీకేజీలు లేకుండా సుభాస్‌నగర్ కాలనీ వైపు వరద నీరు భద్రాచలం పట్టణంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గత వరదల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. ఈమేరకు ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్‌పి రోహిత్ రాజుతో ఫోన్‌లో మాట్లాడారు.