Thursday, August 21, 2025

ఆసియాకప్ జట్టు ఎంపికపై సర్వత్రా విమర్శలు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆసియాకప్ (Asia Cup) టి20 టోర్నమెంట్ కోసం టీమిండియాను ఎం పిక చేసిన సంగతి తెలిసిందే. అయితే టీమ్ ఎంపికలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు మాజీ క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌పై వారు విమర్శలు గుప్పించారు. జట్టు ఎంపికలో గంభీర్ పాత్ర స్పష్టంగా కనిపించిందని, తనకు కావలసిన వారికి అతను చోటు కల్పించం సరికాదని వారు విమర్శించారు. ఇక ఆసియాకప్ జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సిరాజ్‌లకు చోటు కల్పించక పోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. భారత మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, ఆకాశ్ చోప్రా, కృష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రి, గంగూలీ, సెహ్వాగ్, హర్భజన్ సింగ్ తదితరులు జట్టు ఎంపికపై విమర్శలు గుప్పించారు. గంభీర్ రాకతో ప్రతిభావంతులైన ఆటగాళ్లను తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

గంభీర్ తీరుతో అలకబూనిన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాక మరో సీనియర్ రవిచంద్రన్ (Senior Ravichandran) అశ్విన్ అయితే ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడని పేర్కొన్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నామమాత్రంగా మారిపోయాడని, జట్టు ఎంపికలో అతని మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంభీర్ అంత తానై నడిపిస్తున్నాడని, ఇది జట్టు ప్రయోజనాలకు ఏమాత్రం శ్రేయస్కారం కాదని వారు స్పష్టం చేశారు. బిసిసిఐ పెద్దలు కూడా ఈ విషయంలో చూసిచూడనట్టు వ్యవహరించడం బాధించే అంశమని పేర్కొన్నారు. ఇక టి20 ఫార్మాట్‌లో అద్భుత రికార్డులు కలిగిన శ్రేయస్ అయ్యర్, సిరాజ్, యశస్వి జైస్వాల్ తదితరులను కీలకమైన టోర్నీకి దూరంగా ఉంచడం ఏమాత్రం సమంజసం కాదని తెలిపారు.

టి20 ఫార్మాట్‌లో పెద్దగా రాణించని శుభ్‌మన్ గిల్‌కు ఏకంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. టెస్టుల్లో రాణించినంత మాత్రాన టి20 ఫార్మాట్‌లో ఏకంగా డిప్యూటీ సారథిగా ఎంపిక చేయడం సరికాదని వాపోయారు. ఇక శ్రేయస్ అయ్యర్‌పై సెలెక్టర్లు చిన్నచూపు చూశారనే విషయం మరోసారి రుజువైందన్నారు. కొంత కాలంగా శ్రేయస్‌ను సెలెక్టర్లు పలు అవమానాలకు గురి చేస్తున్నారని వారు విమర్శించారు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌లొ అత్యంత మెరుగైన ప్రదర్శన చేసిన సిరాజ్‌ను ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేయక పోవడం అతి పెద్ద పొరపాటని వారు స్పష్టం చేశారు. హర్షిత్ రాణాతో పోల్చితే టి 20 ఫార్మాట్‌లో సిరాజ్ చాలా మెరుగైన బౌలర్ అనే విషయాన్ని సెలెక్టర్లు మరచి పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదిలావుంటే భారత క్రికెటర్లే కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రి కా తదితర దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు కూడా టీమిండియా ఎంపికపై పెదవి విరిచారు. జట్టు ఎంపికలో ప్రతిభా వంతులైన ఆటగాళ్లకు సరైన న్యాయం జరగలేదని వారు ఆరోపణలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News