శ్రీరాముడు రావణబ్రహ్మను సంహరించిన తదనంతరం సీతాదేవి పాతివ్రత్యం నిరూపణకోసం అగ్నిప్రవేశం చేసినట్లు, దీంతో కణకణమండే అగ్నికీలలు ఆరిపోయినట్లు త్రేతాయుగం నాటి పురాణగాథ. ఇది పుక్కిటి పురాణం కాదు. సీతను రావణుడు అపహరించినట్లు, 11 నెలలపాటు రావణుని చెరసాలలో సీత ఉన్నట్లు, అనంతరం రాముడు వారధి నిర్మించి లంకకు చేరినట్లు, రామ- రావణ యుద్ధం జరిగినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. మరో కథలో జమదగ్ని యాగం చేయ సంకల్పించి తన సతీమణి రేణుకాదేవికి సరోవరంనుంచి నీరుతేవాల్సిందిగా చెప్పడంతో ఆమె కడువ పట్టుకుని నదితీరానికి చేరింది. అక్కడ చిత్రరథుడు తన భార్యతో జలకాలాడడాన్ని ముచ్చటగా చూస్తూ కొంత సేపు అక్కడే నిలుచుండిపోయింది.
ఆ తర్వాత ఆమె తేరుకుని ఆలస్యం అయిందని భయపడుతూనే ఆశ్రమానికి చేరుకుంటుంది. రేణుక ఆలస్యానికి కారణమేమిటీ? అని జమదగ్ని తన దూరదృష్టితో (Jamadagni vision) చూసి ఆగ్రహించి, మానసిక వ్యభిచారం చేసిన మీ తల్లికి మరణశిక్ష విధించాలని తన ఐదుగురు కుమారులను ఆదేశిస్తాడు. అందుకు నలుగురు కుమారులు బెదిరిపోగా, ఐదవ కుమారుడైన పరశురాముడు తన ఖడ్గంతో తల్లి తలను మొండెంనుంచి వేరుచేశాడు. అందుకు సంతసించిన జమదగ్ని తన కుమారుడు పరశురామున్ని ఏదైనా కోర్కె కోరుకోవాలని అడగ్గా, హత్యగావింపబడ్డ తన తల్లిని బతికించాల్సిందిగా కోరినట్లు పురాణ గాథ. త్రేతాయుగంలో శ్రీరాముని చరితను, ద్వాపర యుగంలో కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరగకుండా శ్రీకృష్ణుడు కాపాడినట్లు, ధర్మంకోసం పాండవుల పక్షాన నిలబడినట్లు పురాణ గాథల్లో ఉంది.
కలియుగం ఉన్నంత వరకూ వీటిని ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పటికీ కోర్టులో భగవద్గీతపైనే ప్రమాణం చేయించడం జరుగుతుంటుంది.ఇంతగొప్ప చరిత్ర కలిగిన భారతదేశంలోకి పాశ్చాత్య విషసంస్కృతి చొరబడడం దేశప్రజలను కలవరపరుస్తున్నది. గంజాయి, డ్రగ్స్, పబ్బుల సంస్కృతి వచ్చిపడింది. మరోవైపు అత్యాచారాలు మరింత ఆందోళన కలిగిస్తుండగా కొత్తగా కో లివింగ్ స్పేస్ పేరిట వసతి గృహాలు ఆరంభమయ్యాయి. పెళ్ళి కావడానికి ముందే మహిళలు, పురుషులు కలిసి ఉండడానికే కో లివింగ్ స్పేస్ వసతి గృహాలు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ మరి కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. మహిళలకు విడిగా, పురుషులకు విడిగా వసతి గృహాలు (హాస్టల్స్) ఉన్నాయి. ఆ గృహాలకు ఏ విధంగా అయితే అనుమతి లభిస్తున్నదో వీటికీ ఆ విధంగా అనుమతి పొందుతున్నారు. కో లివింగ్‌లో ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, మంచి ఉద్యోగం చేస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటున్నారు. మహిళ, పురుషుడు కలిసి ఉండడాన్ని కో లివింగ్ అంటున్నారు.
బాజప్తా బోర్డులే పెడుతున్నారు. కో లివింగ్ రెసిడెన్స్ యజమాని ఒక్కొక్కరి దగ్గరనుంచి సుమారు ఇరవైఐదు వేల రూపాయల వరకు నెలకు అద్దె తీసుకుంటున్నారు. ఆ రెసిడెన్స్‌లో అన్ని ఆధునిక హంగులతో వసతి సౌకర్యాలు ఉంటాయి. కొన్ని రెసిడెన్స్‌లో ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో ఉంటున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వారు ఇష్టం ఉన్నంతకాలం ఉండవచ్చు. కొంతమంది విడిపోయి ఆ తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు. కో లివింగ్‌లో ఉండడం వల్ల వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని, వారికి ఇష్టమైతేనే జీవిత భాగస్వాములుగా మారేందుకు వివాహం చేసుకుంటారని, లేకపోతే అక్కడే విడిపోయేందుకు కో లివింగ్ రెసిడెన్స్ ఉపయోగపడుతుందని బ్రిటీష్ రచయిత బెట్రాండ్ రూస్సెల్ పేర్కొన్నారు. కావచ్చు, కానీ భారతదేశ సంస్కృతి అందుకు అంగీకరించదు. వివాహం జరగకుండా యువతీ-యువకులు కలిసి ఉండడాన్ని సమాజం ఒప్పుకోదు.
జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంటున్నట్లు స్వేచ్ఛ కోసమే ఉంటున్నట్లు కో లివింగ్‌లో ఉండే వారిలో కొందరి అభిప్రాయం. ఇదంతా తల్లిదండ్రులకు తెలిసే జరుగుతున్నదా? అని చెప్పలేం. తమ బిడ్డ ప్రయోజకురాలయ్యారని, హైదరాబాద్‌లో పెద్ద ఉద్యోగం చేస్తున్నారన్న సంతోషం తల్లిదండ్రులకు ఉంటుంది. ఇది అందరినీ తప్పు పట్టే విషయం కాదు. కొంత మంది ఈ విష సంస్కృతిలో చిక్కుకోవడం బాధాకరం. భారతదేశ సంస్కృతి బాగుంటుందని, భార్యా-భర్త జీవితాంతం కలిసి ఉండడం, జీవన విధానాలు బాగుంటున్నాయని పలు దేశాలు ఇప్పటికే కితాబునిచ్చాయి. ఇటువంటి తరుణంలో కో లివింగ్ పేరిట విష సంస్కృతి వలయంలో చిక్కుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల పోలీసులు కొండాపూర్‌లో గంజాయి పట్టుబడింది. మాదాపూర్‌లోని ఓ కో లివింగ్ రెసిడెన్స్పై పోలీసులు దాడి చేసి పదిమంది విదేశీ అమ్మాయిలను పట్టుకోవడంతో కో లివింగ్ రెసిడెన్స్‌లు చర్చనీయాంశమయ్యాయి. కొన్ని కో లివింగ్ రెసిడెన్స్‌ల వద్ద సరైన భద్రత లేదు.
ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో రిజిష్టర్‌లో రాసుకోవడానికి ఓ సెక్యురిటీ గార్డు కూడా లేకపోవడం దురదృష్టకరం. ఏదైనా అనుకోని సంఘటన జరిగితేనే అప్పుడు అందరూ అప్రమత్తమై లోపాలపై చర్చ మొదలు పెడతారు. చేతులు కాలాక అన్న చందంగా చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కో లివింగ్ రెసిడెన్స్ల్లో ఉండే వారి సంగతి ఎలా ఉన్నా, చుట్టు ప్రక్కల ప్రాంతాలవారు ఇబ్బందిపడుతున్నారు. ఈ రెసిడెన్స్‌ల వల్ల తమ పిల్లలపై ప్రభావం పడుతున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని, ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని, పైగా కో లివింగ్‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్ అధికారులకు శ్రీరాంనగర్ సంక్షేమ సంఘం నాయకులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది.
ఒకవైపు చట్టం.. ఇంకో వైపు సంస్కృతి ఉంది. కన్యాకుమారి నుంచి మొదలుకుని కశ్మీర్ వరకూ దేశపౌరుడు స్వేచ్ఛగా ఎక్కడైనా జీవించేందుకు రాజ్యాంగంలోని 19వ అధికరణ మరి కొన్ని అధికరణలు ఉన్నాయి. ఇలాంటి అధికరణలు సంక్రమించడమే కాకుండా కో లివింగ్ తప్పుకాదని సుప్రీం తేల్చేయడంతో చట్టం వారికి అండగా నిలబడింది. కానీ మన దేశసంస్కృతి అది కాదు. సంస్కృతి మార్గదర్శనం చేస్తుందే తప్ప చట్టంలా శాసించలేదు. కాబట్టి ఈ కో లివింగ్ సంస్కృతిపట్ల చైతన్యం రావాలి. డ్రగ్స్, పబ్బుల్లో అక్రమాలు జరగకుండా ఉక్కుపాదంతో అణచివేయాలని సిఎం ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం సంతోషించదగ్గ విషయమే. ప్రముఖ సినీనటుడు చిరంజీవి కూడా వీటికి దూరంగా ఉండాలంటూ యువతకు పిలుపునివ్వడం గొప్పవిషయం. అదే విధంగా సుదూర ప్రాంతాల్లోని వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలను (అందరినీ ఉద్దేశించి కాదు) ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంది.
- వీరన్నగారి ఈశ్వర్‌రెడ్డి
98499 98086