Thursday, August 21, 2025

పాత్రికేయులు దేశద్రోహులా!

- Advertisement -
- Advertisement -

ఎలాంటి విమర్శలు, వ్యాఖ్యలను సహించలేని కక్షపూరిత రాజకీయ నాయకుల పాలనలోని రాష్ట్రాల్లో పత్రికలపైన, జర్నలిస్టులపైన ప్రతీకార చర్యలు నిరాఘాటంగా సాగుతున్నాయి. పాలకవర్గాల లోపాలను, అవకతవకలను ఎత్తిచూపిస్తూ పాత్రికేయులు ప్రచురించిన సమీక్షల ఆధారాలపై సరైన దర్యాప్తు, పరిశీలన చేయకుండా పనికిమాలిన కేసులు బనాయించడం ఆయా రాష్ట్రాల్లోని పోలీస్ యంత్రాంగం దినచర్యగా మారింది. ఇదే తరహాలో అసోం లోని ‘ది వైర్’ మీడియా సంస్థకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్‌పై దేశద్రోహం కేసు నమోదు కావడం దేశంలోని పత్రికా రంగంలో చర్చనీయాంశమైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ జర్నలిస్టులపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆగస్టు 12న ఈ సమన్లు జారీ అయ్యాయి.

ఇది పోలీసుల ప్రతీకార చర్యగా విమర్శలు వస్తున్నాయి. కొత్త దేశద్రోహ చట్టం (సెక్షన్ 152) రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ ‘ది వైర్’ (The Wire) మీడియా సంస్థ సుప్రీం కోర్టుకు పిటిషన్ దాఖలు చేసింది. అసోం పోలీసులు బలవంతంగా ఎలాంటి నిర్బంధ చర్యలు జర్నలిస్టులపై తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరింది. దీనిపై సుప్రీం కోర్టు ఆగస్టు 12న నోటీస్ జారీ చేసింది. అదే రోజున అసోం క్రైమ్ బ్రాంచి సమన్లు జారీ కావడం గమనార్హం. మోరిగావ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో సంబంధ లేకుండా ఆపరేషన్ సిందూర్ గురించి ‘ది వైర్’లో వెలువడిన కథనంపై ఈ సమన్లు జారీ అయ్యాయి. దీన్ని బట్టి సుప్రీం నోటీసును కూడా పట్టించుకోకుండా పోలీసులు సమన్లు జారీ చేయడంలో ఎంత నిర్లక్షంగా వ్యవహరించారో స్పష్టమవుతోంది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ ఆ సమన్లలో లేదు సరికదా ఎటువంటి నేరానికి పాల్పడ్డారో, ఏ కారణంతో సమన్లు ఇస్తున్నారో ఎలాంటి వివరాలు లేకపోవడాన్ని ‘ది వైర్’ ఎత్తి చూపించింది. ఎఫ్‌ఐఆర్‌లను రహస్యంగా ఉంచడం పోలీసుల బెదిరింపులకు సాక్షంగా ‘ది వైర్’ ఆరోపించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 బ్రిటిష్ వలసవాద పాలన నాటి భయపెట్టే దేశద్రోహ చట్టం వంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల విచారణ 2022 లో కోర్టు ఎటూతేల్చకుండా ఆపేసింది. ఇది వరకటి దేశద్రోహ చట్టం కన్నా ఇప్పుడు సెక్షన్ 152 చట్టం అత్యంత ప్రమాదకరమైన నిబంధనలతో మరింత భయంకరంగా తయారైంది. అధిక ప్రమాణాలను నిర్దేశించడాన్ని తక్కువ చేస్తుంది.

సెక్షన్ 124 ఎ ప్రకారం అసంతృప్తిని ప్రేరేపించారనడానికి స్పష్టమైన ఉద్దేశాన్ని నిరూపించాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానికి భిన్నంగా సెక్షన్ 152 ప్రకారం హాని కలిగించే ఉద్దేశం లేనప్పటికీ ‘తెలిసింది’ వంటి పదాలు ప్రాసిక్యూషన్‌కు వీలు కల్పిస్తాయి. ‘సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత’ ఈ పదాల చుట్టూ ఉన్న అస్పష్టమైన భాష చట్టపరమైన దర్యాప్తు సంస్థలకు ప్రమాదకరమైన అక్షాంశాన్ని అందిస్తుంది. ప్రభుత్వ పాలనా విధానపరమైన విమర్శలు వంటి చట్టబద్ధమైన చర్యలు కూడా ఐక్యతకు హాని కలిగించేవిగా భావించవచ్చు. స్పష్టమైన నిర్వచనాలు లేదా రక్షణలు లేకుండా కేవలం ఉత్తినే అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులను కూడా సెక్షన్ 152తో టార్గెట్ చేయవచ్చు. దీనిని సాకుగా తీసుకుని పాలకవర్గాలు బెదిరించవచ్చు.

ఈ 152 సెక్షన్ దేశసమగ్రతకు భంగం కలిగిస్తున్నారన్న అనుమానంతో ఎవరినైనా ప్రాసిక్యూట్ చేసి జీవిత ఖైదు లేదా ఏడేళ్ల జైలు శిక్ష విధించే ప్రమాదం ఉంటుంది. దీనికి బెయిల్ కూడా మంజూరు కాదు. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులపై ఈచట్టం నేరం మోపుతుంది. పత్రికా స్వాతంత్య్రాన్ని అణగ దొక్కుతుంది. పోలీస్‌ల బలవంతపు నిర్బంధాల నుంచి జర్నలిస్టులను రక్షించేటప్పుడు ‘ది వైర్’ కేసులో కోర్టు జోక్యం చేసుకుని సెక్షన్ 152 రాజ్యాంగ చెల్లుబాటును సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. దీని దుర్వినియోగాన్ని కూడా గమనించక తప్పదు. పటిష్టమైన న్యాయ పర్యవేక్షణ లేకుండా, స్పష్టమైన ఆదేశాలు లేకుండా అసోం పోలీసుల ధిక్కార ధోరణిని చూస్తుంటే సెక్షన్ 152ని ఆయుధంగా చేసుకుని అసమ్మతి వర్గాలపై ప్రయోగించే విపరీత విధానం కొనసాగుతుందని తెలుస్తోంది.

ప్రజాస్వామ్య సమాజంలో ఇదివరకు లేదా ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన దేశద్రోహ చట్టాలకు చోటు లేదు. అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాల ప్రమాదాన్ని గుర్తించవలసిన బాధ్యత కోర్టుపై ఉంది. మనదేశం ప్రజాస్వామ్యమే అయినప్పటికీ రానురాను పాలకుల్లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయి. పత్రికా స్వేచ్ఛకు అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. పత్రికా స్వేచ్ఛ అంటే భావప్రకటన స్వాతంత్య్రం.దేశంలో జరుగుతున్న పరిణామాలపై నిర్భయంగా అభిప్రాయాన్ని ప్రకటించే స్వేచ్ఛ. అలా ఎవరైనా పాత్రికేయులు తమ విధులను నిర్వర్తిస్తే వారికి రక్షణ కరవై ప్రాణాలతో చెలగాటమాడే దుస్థితి ఎదురైతే పత్రికా స్వేచ్ఛ అన్నది శూన్యమైనట్టే.

ప్రజాస్వామ్య భవనానికి ఉన్న నాలుగు స్తంభాల్లో పాత్రికేయం కూడా ఒకటి. అవినీతిని, అక్రమాలను బయటపెట్టే పరిశోధనాత్మక కథనాలకు, ప్రమాదం పొంచి ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని దైనిక్ జాగరణ్ దినపత్రిక విలేఖరి రాఘవేంద్ర వాజ్‌పాయ్‌ని పట్టపగలే కొందరు దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేయడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. చైనా నుంచి నిధులు అందుతున్నాయన్న కారణంపై 2023లో ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ కార్యాలయాలపై కేంద్ర ప్రభుత్వమే దాడులు జరిపించడం మరిచిపోలేని విషాద ఘట్టం. మణిపూర్‌లో జర్నలిస్టుల కలాలు, గళాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో మనదేశం 11 ర్యాంకులు కోల్పోయి, 150 నుంచి 161 స్థాయికి పడిపోయిన వాస్తవాన్ని మనం తెలుసుకోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News