కెటిఆర్ రాజకీయ అజ్ఞానీ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు. యూరియా ఇచ్చిన వాళ్లకు కెటిఆర్ సపోర్ట్ చేస్తానంటున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవమైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని గెలిపించాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే బిజెపితో కుమ్మక్కై కెటిఆర్ అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే అనర్హులను చేసే బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. ఓట్ చోరీని కప్పి పుచ్చుకోవడానికి బిజెపి ఆ బిల్లును తెచ్చిందని, వారి దొంగ నాటకాలను బయట పెట్టడానికి రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ హక్కులను కాపాడడానికి యువ నేత రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నారని రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈడీ, సిబిఐలను మోడీ అడ్డం పెట్టుకొని దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా కోసం ఎంపిలు పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకొని ప్రజలకు చిప్ప చేతుల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు జోడెద్దుల్లాగా పాలన సాగిస్తున్నారన్నారు. నా నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై 20 దరఖాస్తులు వచ్చాయని, ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చాయని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తోందని, త్వరలో వాటిని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.