Thursday, August 21, 2025

విడివిడిగా ఉంటే అది పెళ్లి ఎలా అవుతుంది?: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

వైవాహిక బంధం విషయంలో సుప్రీంకోర్టు గురువారం అత్యంత కీలకమైన రూలింగ్ వెలువరించింది. పెళ్లి ద్వారా భార్య భర్తలయిన వారిలో ఎవరు కూడా ఈ బంధం ఉండగా ఇతరులపై ఆధారపడి ఉండరాదని ఈ తీర్పులో తెలిపారు. న్యాయమూర్తులు బివి నాగరత్న, ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. భార్య కానీ భర్త కానీ ఈ జీవిత బంధంలో ఉన్నప్పుడు తమకు తాము స్వతంత్రంగా ఉంటామని చెప్పడానికి వీల్లేదని బెంచ్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ విషయంపై స్పష్టత నిచ్చింది. ఎవరైనా తాము తమకు తాము స్వతంత్రంగా ఉండాలని భావిస్తే అటువంటివారు అసలు వైవాహిక బంధంలోకి రావడం ఎందుకు? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అసలు వివాహం అంటే ఉమ్మడి జీవిత భాగస్వామ్య పక్షాల అనుబంధ విషయం, రెండు ఆత్మలు , వ్యక్తుల కలయికకు సంబంధించిన బంధం. ఈ పరిధిని దాటడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పిల్లలు ఉండి విడిపోయి ఉంటున్న దంపతుల వ్యాజ్యం విచారణ దశలో సుప్రీంకోర్టు ఈ సామాజిక ప్రాధాన్యత అంశపు తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరు కలిసి జీవిస్తే బాగుంటుంది. పుట్టిన సంతానం గురించి ఆలోచించాల్సి ఉందని తెలిపారు. వారు చిన్న పిల్లలు. పెద్దలు తలోదారిన ఉంటే వీరి భవిష్యత్తు ఏమవుతుంది? ఆలోచించాల్సి ఉంటుందని ధర్మాసనం మందలించింది. భార్యాభర్తలు అన్నాక అందరికీ ఏదో తగాదా ఉంటుంది. దీనితోనే విడిపోయి ఉండటం అనేది భావ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ కేసులో సదరు భర్త సింగపూర్‌లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పిల్లలతో భార్య హైదరాబాద్‌లో ఉంటోంది. సింగపూర్‌లో ఆయన చేష్టలు సరిగ్గా లేవని, తాను పిల్లలతో అక్కడికి వెళ్లేది లేదని, ఆయనపై ఆధారపడి బతికేది లేదని తెలిపింది. ఈ దశలో కోర్టు కలుగ చేసుకుని అంతా సానుకూలత ఉన్నప్పుడు , కలిసి జీవించడానికి, అందులోనూ పిల్లలతో కుటుంబ జీవనం గడపడానికి అభ్యంతరం ఏముంటుందని ప్రశ్నించింది. భర్త నుంచి సరైన హామీ భరోసా వచ్చేలా చూస్తామని, పెళ్లి అయిన తరువాత, పిల్లలు కూడా ఉన్నప్పుడు ఎవరికి వారుగా ఉండటానికి కుదరదని స్పష్టం చేశారు. దీనిపై ఆమె తాను అన్ని విషయాలు పరిశీలించి స్పందిస్తానని న్యాయస్థానానికి తెలిపింది. కాగా వీరి చిన్న కుమారుడి పుట్టిన రోజు శనివారం ఉంది. ఈ సందర్భంగా తండ్రి వద్దకు కొడుకును పంపించాలని, వీలయితే అంతా కలిసి వెళ్లాలని కోర్టు సూచించింది. పిటిషనర్ అయిన భర్త ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చాడు. సెప్టెంబర్ 1న వెళ్లుతాడు. తాను భార్య పిల్లలను తీసకుని సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News