మనతెలంగాణ/పెద్దపల్లిప్రతినిధి: పోలీసులు దాఖలు చేసిన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జి కె.సునీత తీర్పు వెలువరించారు. గురువారం పోలీసుఉల వెల్లడించిన వివరాల ప్రకారం.. 2020జులై 4న పెద్దపల్లి జిల్లాలోని బొంపల్లి గ్రామంలో నిజామాబాద్ నుంచి 10వేలకు రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమైన బసంత్‌నగర్ పోలీసులు పెద్దప్లికి చెందిన సయ్యద్ సలీం, బిహార్‌కు చెందిన అమరదీప్‌కుమార్‌ను పట్టుకున్నారు. నాటి బసంత్‌నగర్ ఎస్సై జానీపాషా, పెద్దపల్లి సీఐ ఎ.ప్రదీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేష్ సమర్పించిన సాక్ష్యాలు, వాదనల ఆధారంగా నేరం రుజువు కావడంతో పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జి కె.సునీత నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన డీసీపీ పి.కరుణాకర్, ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె. ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేష్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు, సీఎంఎస్ పి.కోటేశ్వరరావులను రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా అభినందించారు.