అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ప్రియుడితో భర్తను భార్య చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించుకున్నారు. 15 సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పావనికి సమీప బంధువు ప్రదీప్ పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.
గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న ప్రియుడితో కలిసి లక్ష్మణ్‌ను చంపేసి బంధువులకెవరికీ చెప్పకుండా హడావుడిగా అతడి అంత్యక్రియలు చేసింది. బంధువులకు అనుమానం రావడంతో పావని వివాహేతర సంబంధం బయటపడింది. బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పావనిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.