Friday, August 22, 2025

రాహుల్ ప్రశ్నలకు సమాధానమేది?

- Advertisement -
- Advertisement -

గత కొన్నిరోజులుగా దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాహుల్ గాంధీ, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాయి. లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర వైరుధ్యం నెలకొంది. ఎన్నికల కమిషన్ బిజెపి కోసం ఓట్లచోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ ప్రతిరోజు వివిధ కోణాల్లో చేస్తోన్న ఆరోపణలతో ప్రతి చోట ఓట్ల గల్లంతు పైనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ఈనెల 7వ తేదీన ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మహాదేవపుర ఓటర్ జాబితా లొసుగులను బయటపెట్టిన విధానం సామాన్య ప్రజలను సైతం ఆలోచనలోపడేసింది. ఎన్నికల సంఘం, బిజెపి కుమ్మక్కై ఐదు రకాల అవకతవకలతో ఓట్లచోరీకి పాల్పడినట్టు నిర్దిష్టమైన ఆధారాలతో, సాక్ష్యాలతో చేసిన ఆరోపణలకు ఇసి ఇచ్చిన వివరణతో ప్రజలకు నిరాశే మిగిలింది. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని చెప్పడంలో ఎన్నికల కమిషన్ తడబాటుకు గురవుతోంది.

బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి రాహుల్ పిపిటి ద్వారా ఆసక్తికరమైన అంశాలను(Interesting stuff) వెలుగులోకి తెచ్చాడు.గురు కిరత్ సింగ్ డాంగ్ అనే వ్యక్తి 116, 124, 125, 126 పోలింగ్ బూత్ లలో ఓటరుగా నమోదైనట్లు రాహుల్ ఆధారాలు ప్రదర్శించాడు. ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి 458, 459 పోలింగ్ బూత్ లలో ఓటరుగా నమోదు కాబడి, మహారాష్ట్రలోని ముంబైలో 197, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 84వ పోలింగ్ బూత్‌లో ఓటరుగా నమోదు కాబడినట్లు సాక్ష్యాలు చూపెట్టాడు. ఇటువంటి నకిలీ ఓటర్లు 11,965 మంది ఉన్నట్లు తేల్చాడు. శకున్ రాణి అనే 70 సంవత్సరాల మహిళను నూతన ఓటర్లను నమోదు చేసే 6 ఫారం ద్వారా రెండు బూతులలో ఓటరుగా నమోదు చేశారు.

ఒకే గదిగల హౌస్ నెంబర్ 35 లో 80 మంది ఓటర్లు, హౌస్ నెంబర్ 791లో 46 మంది ఓటర్లు, ఓ కమర్షియల్ క్లబ్‌లో 68 మంది ఓటర్లు నమోదైన ఆధారాలను మీడియా ముందు ప్రదర్శించాడు. ఇంటి నెంబర్లు 0, 00, అని తండ్రి పేరు dfoigaidf, భర్త పేరు ytdtr ఓటర్ వయసు 0,00 గా నమోదులు ఉన్నాయి. స్పష్టంగా వేల కొలది తప్పులు కనిపిస్తున్నప్పటికీ విచారణ జరిపించాల్సిన బాధ్యత నుంచి ఇసి తప్పుకుంటూ తాను ఎవరికీ జవాబుదారీ కాననే రీతిలో ప్రవర్తిస్తోన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో అయిదు పద్ధతుల ద్వారా 1,00,250 తప్పుడు ఓట్లు నమోదు చేసిన వైనాన్ని రాహుల్ బయటపెట్టాడు.

దేశవ్యాప్తంగా నిర్దేశిత నియోజకవర్గాలలో బిజెపికి అనుకూల ఫలితాలు రావడానికి ఇసి సహకరించిందని రాహుల్ గాంధీ చెబుతున్నాడు. రాహుల్ గాంధీ సహేతుకమైన ఆధారాలతో, సాక్ష్యాలతో బయటపెట్టిన అంశాలకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానం విశ్లేషకులను సంతృప్తి పరచలేదు. ఎన్నికల కమిషన్ ఢిల్లీలో 17వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పేర్కొన్న నిర్దిష్టమైన అభియోగాలను దాటవేసింది. రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని సిఇసి డిమాండ్ చేశారు. పాలక, ప్రతిపక్షాలు సమానమేనని సిఇసి ఓవైపు చెబుతూనే ‘ఇండియా’ కూటమి నేతలు నకిలీ ఓట్లతోనే గెలుపొందారని ఆరోపణలు చేసిన బిజెపి నేత అనురాగ్ ఠాకూర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎందుకు చెప్పలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ గెలుపొందిన లోకసభ స్థానాలలో నకిలీ ఓటర్ల నమోదుతోనే గెలుపొందారని బిజెపి నేత చేసిన ఆరోపణలు ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఎలక్ట్రోరల్ రూల్ 23బి కింద గడిచిన ఎన్నికల అభ్యంతరాలపై ఇసి అపిడవిట్ అడగడం సరైంది కాదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల ముందు ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాపై నియోజకవర్గంలోని ఓటర్లు ఫామ్ 6, 7, 8 ద్వారా, ఇతర వ్యక్తులు రూల్ 23 బి కింద ప్రమాణ పత్రం ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. కాలాతీతమైన అంశంలో డిక్లరేషన్‌పై సంతకం చేసి ఇస్తేనే అభ్యంతరాలు పరిశీలిస్తామని ఎన్నికల కమిషన్ పదేపదే ప్రకటించడంలో ఆంతర్యమేమిటో ఎవరికి అంతుబట్టడం లేదు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. లోకసభ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అభ్యంతరాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తుంటే దానికి సరైన వివరణ ఇచ్చి ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను నిరూపించుకుంటే బాగుండేది. ఒక వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదైనంత మాత్రాన తప్పేమిటి? అతను పలుచోట్ల ఓటేసినట్టా? అది ఓటు చోరి ఎలా అవుతుంది అని ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడటం రాజకీయ విశ్లేషకులను విస్మయపరుస్తోంది. సిసి కెమెరా ఫుటేజ్‌పై సమాధానంగా అది వ్యక్తుల ప్రైవసీకి సంబంధించిన విషయమని దానిని బయట పెట్టలేమని చెబుతున్నాడు.

పలుచోట్ల ఓటరుగా నమోదైన వ్యక్తి ఒకే చోట ఓటు వేస్తున్నాడా? లేదా అనేది ఎలా తెలియాలి? కోట్ల మందికి నివాస గృహాలు ఉండవని అటువంటి వారికి ఇంటి నెంబర్లు జీరో కింద నమోదు చేశామని చెప్పిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓటర్ల తండ్రులు, భర్తల స్థానంలో ఎ, బి, సి, డిలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఓటర్ల వయసు 0, 00 ఎందుకు నమోదు చేశారు? జనాభా లెక్కలు ఇతర సర్వేలలో ఇంటి నెంబర్ లేని వారికి పక్కనున్న ఇంటి నెంబర్ ఆధారంగా బై నెంబర్లు నమోదు చేస్తారు కదా! మొదలు ప్రశ్నలకు సమాధానం లేకపోయింది. రాహుల్ గాంధీ ఆధారాలను దేశప్రజల ముందు పెట్టిన సందర్భంలో ఎన్నికల కమిషన్ స్పందించి సరైన సమాధానం ఇచ్చినట్లయితే ప్రజలకు దానిపట్ల నమ్మకం పెరిగేది.

రాహుల్ గాంధీ ఐదు అంశాలలో ఓటుచోరీ జరిగినట్లు చూపెట్టిన ఆధారాలు తప్పు అని ఇసి నిరూపించిన పక్షంలో కేసు రిజిస్టర్ చేసి న్యాయస్థానాల ద్వారా శిక్షించడానికి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి అవకాశం ఉండేది. రాహుల్ చెబుతున్న ఓట్ చోరికి సంబంధించిన మాటలపట్ల ప్రజలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కారణం గత కొన్నేళ్లుగా అనేకచోట్ల పోలింగ్ బూతులలో ఓటు వేయడానికి బారులు తీరి తీరా ఓటు వేసే సమయంలో జాబితాలో ఓటు లేదని తిరస్కరించడంతో ఆగ్రహిస్తూ వెనుదిరిగిన వయోజనులు కోకొల్లలు. గత కొద్ది రోజులుగా ఓటు చోరిపై ఎన్నికల కమిషన్ లక్ష్యంగా రాహుల్ మాట్లాడుతున్న మాటలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో పతాక శీర్షికలుగా ఉంటున్నాయి. ఎన్నికల తప్పిదాలకు పాల్పడిన ప్రతి అధికారి తాము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాడు.

డిజిటల్ మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ఓటర్ల జాబితాలను ఎందుకు ఇవ్వడం లేదు? వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? ఓటర్ల జాబితాలో ఎందుకు మోసాలకు పాల్పడుతున్నారు? లాంటి రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానాలు సామాన్య ప్రజలనే సంతృప్తి పరచలేకపోతున్నాయి. దొంగ ఓట్లకు అండగా ఇసి ఉంటోందని తెలియజేస్తూ పలు వీడియోలు విడుదల చేయటం ఆసక్తి రేపుతోంది. ఓటుచోరి ఆరోపణలపై దేశవ్యాప్త ప్రచారానికి votechori.in వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని రాహుల్ దేశప్రజలకు పిలుపునిచ్చాడు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌లో మరణించిన వారుగా పేర్కొన్న ఏడుగురు వ్యక్తులతో ఢిల్లీలో రాహుల్ టీ తాగుతూ ముచ్చటించిన వీడియో మీడియాలో సంచలనంగా మారింది. ఎస్‌ఐఆర్‌లో గల్లంతైన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఇసి విడుదల చేసే పత్రాలు సెర్చబుల్ ఫార్మాట్‌లో ఉండాలన్న సుప్రీం ఆదేశాలతో రాహుల్ గాంధీ వాదనకు బలం చేకూరినట్లయింది. ఓటుచోరిపై రాహుల్ గాంధీ ‘ఇండియా’ కూటమి పక్షాలతో కలిసి బీహార్ లో ఓట్ అధికార యాత్ర చేస్తున్నాడు. ఇది 25 జిల్లాల్లో 16 రోజులపాటు కొనసాగనుంది. 1300 కిలోమీటర్లు కొనసాగే యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ యాత్ర ఏమేరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాలి. రాహుల్ గాంధీ మహదేవపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బహిర్గతపరిచిన అంశాలను సర్వోన్నత న్యాయస్థానం సుయోమోటో కేసుగా స్వీకరించి దేశంలోని ఓటర్ జాబితాలన్నింటినీ మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టికల్ 324 పవిత్రతను న్యాయ వ్యవస్థే కాపాడాలి.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి 94409 66416
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News