అమరావతి: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను సిఐ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య గొడవలు రావడంతో ఆమె మదనపల్లి డిఎస్‌పి కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో సిఐ సురేష్ కుమార్ పరిచయం కావడంతో ప్రేమగా మారింది. దీంతో ఆమెను సిఐ రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరికి వివాహం జరిగిన విషయం భర్తకు 2021లో తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో 2023లో ఆమెకు పాప కూడా జన్మించింది. దీంతో పవన్ పిఎంఒకు ఫిర్యాదు చేయడంతో డిజిపి కార్యాలయానికి సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిఐ సురేష్ కుమార్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారు. సురేష్ తన తల్లి కులం పేరు మీద క్యాస్ట్ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో చేరినట్లు పిఎంఒకు పవన్ ఫిర్యాదు చేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సిఐ సురేష్ సెలవుల్లో ఉన్నారు.