Friday, August 22, 2025

యూరప్‌తోనే అసలు సమస్య

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ యుద్ధంలో యథాతథంగానే అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించటం తేలిక కాదు. అటువంటి స్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం రోజులలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో చర్చలద్వారా సమస్యను నెమ్మదిగా ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించారు. కాని, మౌలికంగా ఆ యుద్ధం ప్రారంభానికీ, మూడేళ్లుగా కొనసాగుదలకూ కారణమైన యూరోపియన్ రాజ్యాలు, ఆ ప్రయత్నాలను భంగపరిచేందుకూ ఇప్పటికీ ప్రయత్నిస్తుండటం గమనించదగ్గది. ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడితో అలాస్కాలో, 18న ఉక్రెయిన్ అధ్యక్షుడితో వైట్‌హౌస్‌లో జరిపిన చర్చలద్వారా, శాంతి సాధనకు స్థూలంగా ఒక మార్గం ఏర్పడింది.

అందులో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. ఒకటి, రష్యా ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం. రెండు, నాటో సైనిక కూటమిలో (military alliance) చేరకపోవటం. మూడు, ఉక్రెయిన్ రక్షణకు అమెరికా, యూరప్‌లు కలిసి హామీగా నిలవటం. ఇవి మూడూ అమలుకు తేలికైనవి కాదు. అందులోని చిక్కులేమిటో మునుముందు వివరాలలోకి వెళ్లి ఉభయ పక్షాల మధ్య చర్చలు జరిగిన కొద్దీ తెలియవస్తుంది. విషయాలు తేలి అంతిమ ఒప్పందం కుదిరేందుకు ఎంతకాలం తీసుకునేదీ చెప్పలేము. కాని, విషయం దానికదే ఎంతో కిష్టమైనదిగా కనిపిస్తుండగా, అందులో సమస్యలు సృష్టించేందుకు యూరోపియన్ దేశాలు, వైట్‌హౌస్ చర్చలు 18న జరిగిన మరునాటి నుంచే ప్రయత్నాలు ఆరంభించాయన్నది ఇక్కడ గమనించవలసిన విషయం.

అదెట్లానో ముందు చెప్పుకుని తక్కిన చర్చలోకి తర్వాత వెళదాము. ఒప్పందం తర్వాత ఉక్రెయిన్‌కు రక్షణ కల్పించే బాధ్యతను అమెరికా, యూరప్ కలిసి తీసుకోవాలన్నది అవగాహన. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదన్నంత వరకే తమ షరతు తప్ప, ఇతరత్రా అటువంటి రక్షణలకు అభ్యంతరం లేదన్నది అలాస్కాలో ట్రంప్‌కు పుతిన్ చెప్పిన మాట. అదే సమయంలో ఆయన ఒక సంగతి స్పష్టం చేసారు. నాటో ఎటువంటి రక్షణలైనా కల్పించవచ్చు గాని, పదాతి సేనలను ఉక్రెయిన్‌కు పంపటాన్ని మాత్రం సమ్మతించబోమన్నారు. ఎందుకంటే ఒకసారి ఆ సేనలు కేవలం రక్షణ పేరిట వెళ్లినా, ఆ మాటకు నిర్వచనాలు అనేకం ఉంటాయి. ఎవరికి అనుకూలమైనవి వారు చెప్పుకోవచ్చు. అటువంటపుడు ఏదో ఒక దశలో, ఏదో ఒక రూపంలో, ఉభయ సేనలు ఎదురుపడవచ్చు. దాని పర్యవసానం రష్యా నాటోదళాల మధ్య యుద్ధంగా మారుతుంది.

అటువంటి పరిస్థితిని నివారించేందుకు ముందు చూపుతోనే పుతిన్ ఆ షరతును విధించారు. అది గ్రహించినందువల్లనే అమెరికా అధ్యక్షుడు తమ పదాతి సేనలను పంపే ప్రసక్తి లేదని వైట్‌హౌస్ సమావేశానికి ముందు, తిరిగి అదే సమావేశంలో ప్రకటించారు. రక్షణలంటే ఏ రూపంలో అన్నచర్చలు ఇంకా జరగవలసి ఉంది. ఆ ప్రశ్నకు పదిరోజులలో స్పష్టత రావచ్చునని జెలెన్‌స్కీ వైట్‌హౌస్ చర్చల రోజునే అన్నారు కూడా. కాని, బ్రిటిష్ సైనికదళాల అధిపతి టోనీ రాడ్‌కిన్ 19న మాట్లాడుతూ, తమ పదాతి సేనలను పంపగలమని ప్రకటించారు. ఈ ఒక్క మాట యూరోపియన్ల ఆలోచనా ధోరణికి అద్దంపడుతుంది. తన మాటకు ఆయన ఏవో వివరణలు ఇవ్వబూనారు. తమ సైన్యాలు యుద్ధ క్షేత్రానికి వెళ్లబోవని, అక్కడినుండి దూరంగా ఉంటాయని, ఉక్రెయిన్ సేనలకు శిక్షణలు ఇవ్వటం, ఇతర విధాలుగా సహకరించటం మాత్రమే చేస్తాయని అన్నారాయన.

సైన్యం పరిభాషలో ఇందుకు అర్థం ఏమవుతుందో తెలిసిందే. ‘సహకారం’ అనే మాటలో ఇమిడి అనేకం జరుతుతాయి. చివరికి వారు ఉక్రెయిన్ సేనల యూనిఫారాలు ధరించి యుద్ధంలోనూ పాల్గొనవచ్చు. అటువంటిది జరగటం ఇటువంటి సందర్భాలలో సర్వసాధారణమే. కనుకనే పుతిన్, ట్రంప్‌లు ముందు జాగ్రత్తలు మాట్లాడారు. ఇదంతా బ్రిటన్‌గాని, ఇతర యూరోపియన్ దేశాలు గాని గ్రహించలేనిది కాదు. అయినప్పటికీ తొలి రోజులలోనే ఆ విధంగా ఎందుకు మాట్లాడినట్లు? బ్రిటిష్ సైన్యాధిపతి తీరు యూరోపియన్ దేశాలు అన్నీ కూడా మొదటినుంచి చూపుతున్న ధోరణిలోనే ఉందన్నది తెలుసుకోవలసిన విషయం. గమనించదగినది మరొకటి ఉంది.

ఉక్రెయిన్‌కు రక్షణలు ఏవిధంగా ఉండాలో చర్చించేందుకు అన్ని యూరోపియన్ దేశాల సైన్యాధికారులు ఈ 20 21 తేదీలలో సమావేశమవుతున్నారు. తన ప్రతిపాదనను రాడ్‌కిన్ అక్కడ ముందుంచనున్నారు. అన్ని దేశాలు కలిసి 30,000 సైన్యాన్ని పంపాలనే సూచన కొద్ది కాలం క్రితం రాగా, అందుకు కొన్ని దేశాలు అప్పుడే నిరాకరించాయి. అయినప్పటికీ అటువంటి చర్చను మళ్లీ తీసుకురానున్నారు. తామందుకు సిద్ధంగా లేమని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరకు నిర్ణయం ఏమయేదీ తెలియదు గాని, ఇక్కడ గమనించవలసినవి కొన్నున్నాయి. అసలు నాటో సేనలనే తాము అంగీకరించబోమన్నది రష్యా షరతు కాగా, దళాల గురించి చర్చించటమేమిటి? రక్షణలు ఏ రూపంలోననే చర్చలు కూడా ఇంకా జరగలేదు. దళాల వద్దన్నది అమెరికా అభిప్రాయం.

అంతిమంగా రక్షణలు ఎట్లున్నా అందుకు రష్యా కూడా ఒప్పుకోవలసి ఉంటుంది. తమ ప్రమేయం లేని చర్చలను ఒప్పుకోబోమని ఇదంతా చూసే 20 నాడు రష్యా స్పష్టం చేసింది. ఎక్కడ ఏ చిక్కు తలెత్తినా వ్యవహారమంతా ఆగిపోతుంది. మరి యూరప్‌కు ఎందుకీ తొందర? మరొక విషయం చెప్పుకోవాలి. ఉక్రెయిన్ నాటోలో చేరితే, అందులోని 5వ ఆర్టికల్ ప్రకారం మొత్తం సైనిక కూటమి ఉక్రెయిన్‌కు సహాయంగా ముందుకు రాగలదన్నది ఉక్రెయిన్‌తోపాటు యూరోపియన్ దేశాల ఆలోచన. కాని ట్రంప్ అందుకు కాదనగా, అట్లా చేరకపోయినా ‘ఆ తరహా’ రక్షణలకు అభ్యంతరం లేదని ట్రంప్‌తో పుతిన్ చెప్పారు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ‘ఆ తరహా’ రక్షణలు అంటే ఏమిటి? ఆ నిర్వచనంపై అమెరికా ప్లస్ యూరప్‌ల మధ్య చర్చలు ఇంకా మొదలైనా కాలేదు. అమెరికా తాము గగనతల రక్షణలు కల్పిస్తామని మాత్రం సూచించింది.

బ్రిటన్ మరొక అడుగు ముందుకు వేసి సముద్రతలంనుంచి కూడా అన్నది. ఇక్కడ సమస్య ఉంది. ఉక్రెయిన్, రష్యాలకు పొరుగున ఉన్నది నల్ల సముద్రం మాత్రమే. రష్యా అధీనంలో గల క్రిమియా ద్వీపకల్పం అక్కడే ఉంది. ఆ సముద్రమంతటా రష్యా నౌకా బలం ఉంది. అటువంటపుడు బ్రిటన్ చేయదలచిందేమిటి? యూరోపియన్ నౌకలను సుదూరానగల మధ్య ధర సముద్రంలో మోహరించటమా? పోతే, అసలు ఆర్టికిల్ 5 చెప్తున్నది నాటో దేశాలన్నీ ఆటోమేటిక్‌గా ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగవచ్చునని కాదు. ఆ కూటమిలోని దేశాలు ఏది ఏవిధంగా సహకరించాలనేది అదే నిర్ణయించుకుంటుంది. ఒక కూటమిగా నాటో నిర్ణయించేది ఉండదు. ఇదంతా ఇట్లుండగా ఉక్రెయిన్ పక్షాన ఏ దేశం యుద్ధంలో పాల్గొన్నా తాము ఉక్రెయిన్‌తో గల ఆ దేశం సేనలపైనే గాక అసలు ఆ దేశంపైనే నేరుగా దాడి జరపగలమని రష్యా పలుమార్లు హెచ్చరించింది కూడా.

ఇంతకూ విషయం ఏమంటే, మొదట చెప్పుకున్నట్లు, యుద్ధం ఆరంభానికి కారణమైన యూరోపియన్ దేశాలు, అది పరిష్కారం కాకుండా ఇంతకాలం అడ్డుపడి, తీరా ఇపుడు అమెరికా అధ్యక్షుని చొరవతో సమస్య ఒక కొలిక్కి వస్తుండగా, తమ ధోరణిని మాత్రం మార్చుకోవటం లేదు. 24 గంటలు గడవకముందే ఇట్లా వ్యవహరిస్తున్నావారు, రాగల రోజులలో ఎట్లా ప్రవర్తించేదీ ఊహించవచ్చు. వాస్తవానికి ఈ యుద్ధం మొదలు కావటానికి కారణమే వారు. ఈ మాటను సాక్షాత్తూ ట్రంప్ పలుమార్లు అన్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరదలచుకున్నందువల్లనే రష్యా యుద్ధం మొదలుపెట్టిందన్నారు. అందుకు ఉక్రెయిన్ గాని, యూరపియన్ దేశాలు గాని ఒక్కసారైనా స్పందించకపోవటం గమనార్హం. ట్రంప్ మాటను కొంత పొడిగించి చూస్తే కనిపించేది ఈ విధంగా ఉంటుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అప్పటి సోవియెట్ యూనియన్ నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి, ఆ యూనియన్ 1991లో పతనం కావటంతో రద్దయింది.

కాని అమెరికా నాయకత్వాన ఉండిన నాటో సైనిక కూటమిని కూడా రద్దు చేయటానికి బదులు అదే విధంగా కొనసాగించారు. ఆ కూటమిని ఇక విస్తరించబోమని రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ రష్యా వైపు విస్తరిస్తూ ఇప్పటికి మరొక 12 దేశాలను కొత్తగా చేర్చుకున్నారు. రష్యా సరిహద్దున మిగిలిన చివరి దేశం ఉక్రెయిన్. ఆ విధంగా విస్తరించటంలోపాటు రష్యాను చుట్టుముట్టి బలహీనపరచి ఆధిపత్యం వహించానలన్నది వ్యూహం. ఆమేరకు ఉక్రెయిన్‌లో ఎన్నికైన రష్యా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి, తమకు అనుకూలమైన జెలెన్‌స్కీని అధికారానికి తెచ్చారు. ఆయన తాము నాటోలో చేరగలమన్నమాటను రాజ్యాంగంలో చేర్చటం, చేర్చుకోగలమని నాటో ప్రకటించటం క్రమంగా యుద్ధానికి దారితీసింది. తర్వాత విషయాలుపైన చెప్పుకున్నవే.యూరప్‌కు వందలాది సంవత్సరాల సామ్రాజ్యవాద చరిత్ర ఉంది.

ఆ పరిస్థితులు 20వ శతాబ్దపు మధ్యకాలం నుంచి క్రమంగా మారుతూ ఈ సరికి తాము గణనీయంగా బలహీనపడినా, చింతచచ్చినా పులుపు చావలేదన్నట్లు ఆ లక్షణాలను వదలుకోవటం లేదు. అనూహ్యమైన రీతిలో కొంత భిన్నమైన ఆలోచనలు గల ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనా వారి ధోరణి మారటం లేదు. అందుకే, జెలెన్‌స్కీని ఎప్పటికపుడు యుద్ధానికి రెచ్చగొడుతున్నారు. యుద్ధం 2022 ఫిబ్రవరిలో మొదలుకాగా, తొలిరోజులలోనే ఉక్రెయిన్ తన బలహీనతను గుర్తించి రాజీకి వచ్చింది. స్థూలంగా రాజీ జరిగింది. కూడా. కాని దానిని ఉక్రెయిన్ ధ్రువీకరించకుండా యూరప్‌లో పాటు అప్పటి బైడెన్ ప్రభుత్వం అడ్డుపడ్డాయి. ఇది తన యుద్ధం కాదని, బైడెన్ యుద్ధమని, తాను అధ్యక్షుడై ఉంటే జరిగే కాదని ట్రంప్ ఈ నెల 18 వరకు కూడా పలు మార్లు అనటానిన బట్టి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఆ విధంగా గత మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్ రాజీపడకుండా ఆపుతూ యుద్ధాన్ని రెచ్చగొడుతూ, ఉక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటూ వచ్చిన యూరప్‌కు ట్రంప్ విధానం సరిపడనిది అయింది. ఆయన తోడురాకున్నా ఉక్రెయిన్‌తో ‘చివరికంటా’ యుద్ధం చేయించగలమని అన్నారుగాని, రష్యా, బల సంపత్తుల ముందు నిలబడలేమని అర్థమై, ఏ విధంగానైనా సరే ట్రంప్‌ను తమ వైపు తిప్పుకో జూసారు. ఆ ప్రయత్నాలు అలాస్కా, వైట్‌హౌస్ సమావేశాల వరకు సైతం కొనసాగించి విఫలమయారు. అప్పటికీ ఆశలు వదలక, పైన పేర్కొన్న మూడు అంశాలపై చర్చల సమయంలో వీలైనన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాని అవి నెరవేరకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

  • టంకశాల అశోక్ ( దూరదృష్టి)
  • రచయిత సీనియర్ సంపాదకులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News