జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా 2025 జులై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పదవికి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ మేరకు ఫలితాలు ముందుగానే ఊహించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ ఇది చెప్పుకోదగిన సైద్ధాంతిక యుద్ధం. రెండు వైపులా ఆ విధంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఎన్‌డిఎ అభ్యర్థి సి.పి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత ఆర్‌ఎస్‌ఎస్ ఉద్యమనేత. 1998 నుంచి 2004 వరకు రెండుసార్లు కోయంబత్తూరు నియోజక పార్లమెంట్ అభ్యర్థిగా పదవులు సాధించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉంటున్నారు. మరోవైపు ‘ఇండియా’ కూటమి పార్టీలు జస్టిస్ బి. సుదర్శన రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉంచాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి, న్యాయవాద వృత్తిలో రాణించిన సుదర్శన రెడ్డి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి. ఎన్‌డిఎ కూటమికి మెజారిటీ (alliance majority) ఉంది. అదనంగా ఎలాంటి సంబంధం లేని ఓటర్లను బిజెడి, బిఆర్‌ఎస్ వంటి పార్టీలను ఆకట్టుకోడానికి ప్రచారం ముమ్మరంగా చేపట్టింది. ఆంధ్రలో ఎన్‌డిఎ భాగస్వామ్యం అయిన తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే వైఎస్‌ఆర్‌సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. జస్టిస్ రెడ్డి అభ్యర్థిత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయానికి ప్రతీకగా నిలిచింది. తమిళనాడులో రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం కూడా ఇదే విధంగా ఉంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా డిఎంకెను ఆత్మరక్షణలో పడేయడానికి ఎన్‌డిఎ రూపొందిస్తున్న పన్నాగాలను సాగనీయకుండా ‘ఇండియా’ కూటమి గట్టిగా పనిచేస్తోంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ తాను 2021 లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి కాషాయ వర్గాలతో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తన తక్షణ రాజకీయ ప్రత్యర్థి ఎఐఎడిఎంకె అయినప్పటికీ ద్రవిడ ఛాంపియన్‌గా తనకు తాను స్థానం సంపాదించుకున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినందున స్టాలిన్ మద్దతు ఇస్తారన్న ఊహాగానాలను స్టాలిన్ కొట్టిపారేశారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికే తన మద్దతు అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేం.ఈ పరిస్థితుల్లో రాధాకృష్ణన్‌ను రంగంలోకి దించడం వల్ల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు తమకు ప్రయోజనం కలుగుతుందని బిజెపి ఆశిస్తోంది. అయితే ఈ రాజకీయ సందేశం స్పష్టంగా లేదు.
జీవితాంతం హిందుత్వకు అంకితమైన రాధాకృష్ణన్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడానికి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌తో బిజెపి సంబంధాలను విస్తృతం చేసుకుంటోంది. ధన్‌ఖడ్ జీవిత విశేషాలకు, రాధాకృష్ణన్ నేపథ్యానికి చాలా భేదం ఉంది. సంఘ్ పరివార్‌లో ధన్‌ఖడ్ ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. దానికి అనుగుణంగా ఉండడంలో విఫలమయ్యారు. ప్రస్తుత భాగస్వాములను రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చేలా బిజెపి పట్టుసాధించడమే కాకుండా వైఎస్‌ఆర్‌సిపిని కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం పరివార్‌ను ఎదిరించడం, సామాజిక న్యాయాన్ని విస్తరణకు ప్రయత్నించడం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులాల 2024 సర్వేకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వం వహించారు.
ఈ పోటీని బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలను కూడదీయడానికి ఒక అవకాశంగా ‘ఇండియా’ కూటమి భావిస్తోంది. ద్రవిడ భూమిలో బిజెపి చెప్పుకోదగిన రాజకీయ ప్రభావాన్ని చూపించలేకపోయినప్పటికీ సమర్ధవంతమైన నాయకునిగా రాధాకృష్ణన్‌ను బిజెపి ఏరికోరి ఎంచుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె నేత ఎడప్పాడి పళని విధంగానే రాధాకృష్ణన్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన ఒబిసి నాయకుడు. ఈ సామాజికవర్గానికి తమిళనాడులో చెప్పుకోదగిన బలం ఉంది. అంతేకాకుండా రాధాకృష్ణన్‌కు అన్ని వర్గాల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. డిఎంకె దివంగత ప్రముఖ నేత కరుణానిధి నుంచి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వరకు అందరికీ ఆయన మిత్రుడే. చాపకింద నీరులా నిశ్శబ్ద ప్రభావవంతమైన నెట్‌వర్క్ ఉంది. తమ నాయకుడే ఢిల్లీ పీఠంపై ముఖ్య అధినేతగా, అత్యంత ప్రతిష్ఠాత్మక పదవిని పొందుతున్నాడన్న ఆనందం తమిళనాడు యువ ఓటర్లలో ఉందని బిజెపి అంచనా వేస్తోంది.
గత కొన్నేళ్లుగా తమిళనాడులో నిలదొక్కుకోడానికి బిజెపి అనేక ఎత్తుగడలు వేస్తోంది. కొత్తవారు, పార్టీ ఫిరాయింపుదార్లు, రాష్ట్ర బిజెపి విభాగంలోకి వచ్చే అవకాశం ఉందని ఊహిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగపరమైనది, రాజకీయ పక్షపాతాలతో సంబంధం లేనిదన్న వాదన ఉన్నా ఈ సంభావ్య నియామకం ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారన్న తీవ్రవిమర్శలు ఇప్పటికే ఉంటున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్ కేంద్రానికి కళ్లు, చెవులుగా పనిచేస్తారో లేదా అలాంటి విమర్శలకు తావు లేకుండా రాజ్యాంగ ప్రతిష్ఠకు ప్రతిబింబంగా ఉంటారో తరువాత తెలుస్తుంది. ఈసారి ఉపరాష్ట్ర పదవికి పోటీపడుతున్న ఇద్దరు అభ్యర్థులు దక్షిణ రాష్ట్రాల వారు కావడం విశేషం. ఇప్పటివరకు జరిగిన 16 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, గోపాల్ స్వరూప్ పాఠక్, జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాయి.