హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో ఒయు జెఎసి తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. మార్వాడీలు స్థానికుల ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని, తిరిగి స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలపై ఆధారపడి బతుకుతూ, వారిపైనే పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలతో మార్వాడీ–గుజరాతీలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో షాపులు బంద్ చేశారు.
ఒయు జెఎసి పిలుపుతో షాపులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్వాడీ గో బ్యాక్ అంటూ వ్యాపారులు నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ నుంచో వచ్చి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్న పృథ్విరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మార్వాడీలకు బిజెపి నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు, రాజాసింగ్ మద్దతుగా నిలిచారు.