కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బిఆర్‌ఎస్ బాటలోనే నడుస్తున్నదని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బిజెపి అంటే అంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును మొయినాబాద్‌లో ఎందుకు అరెస్టు చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గు చేటు అని ఆయన విమర్శించారు. అరెస్టు చేసిన తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా పార్టీ కార్యకర్తలందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.