కూకట్‌పల్లి, సంగీత్‌నగర్‌లో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 18వ తేదీన సహస్ర(11) ఇంట్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు ఐదేళ్ల నుంచి కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో కుమార్తె సహస్ర(11), కుమారుడి(7)తో కలిసి ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా ఉన్న మెకానిక్ షెడ్‌లో పనిచేస్తుండగా, రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరోతరగతి చదువుతోంది. కుమారుడు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నాడు.
భార్యభర్తలు ఈ నెల 18వ తేదీన విధులకు వెళ్లగా పాఠశాలకు సెలవు కావడంతో సహస్ర ఇంటి వద్ద ఉంది. తమ్ముడికి లంచ్ బాక్స్ తానే పాఠశాలకు వెళ్లి ఇచ్చి వస్తానని సహస్ర చెప్పడంతో తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ బాక్స్ తీసుకుని రాలేదని బాలుడి పాఠశాల నుంచి కృష్ణకు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చి చూసేసరికి సహస్ర రక్తం మడుగులో పడిఉంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సిసి టివిలను పరిశీలించగా ఎలాంటి క్లూ లభించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఇంటి పక్కన ఉన్న వారిని విచారించగా, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య జరిగిన రోజు బాలుడు తన ఇంటి పక్కన 15నిమిషాలు దాక్కుని ఉన్నాడని చెప్పాడు. వెంటనే పోలీసులు బాలుడు ఉంటున్న పాఠశాలకు వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించాగా ముందుగా ఎదురుతిరిగినట్లు తెలిసింది.
తర్వాత పోలీసులు నువ్వు హత్య చేసినట్లు తెలిసిందని, గట్టిగా అడగడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. వెంటనే బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా మొత్తం చెప్పాడు. బాలుడు ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు రక్తం మరకలు అంటిన దుస్తులు, లెటర్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పదోతరగతి చదువుతున్న బాలుడు సహస్ర ఇంటి పక్కనే ఉంటున్నాడు. బాలిక ఇంట్లో చోరీ చేయాలని ముందుగానే ప్లాన్ వేసుకున్న బాలుడు దానికి సంబంధించిన ప్లాన్‌ను పేపర్‌పై రాసుకున్నాడు. చోరీ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా అడ్డు వస్తే ఎలా చంపివేయాలనే విషయాలు రాశాడు. చివరికి దీనికి మొత్తంగా ఆపరేషన్ డాన్ అనే పేరు పెట్టుకున్నాడు. ఓటిటిలో క్రైం వెబ్ సిరీస్‌ను చూసి చోరీకి ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం సంగీత్‌నగర్‌కు వచ్చి స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. బాలిక పుట్టిన రోజుకు కూడా నిందితుడు హాజరైనట్లు గుర్తించారు.
తల్లిదండ్రులకు చెబుతుందని…
బాలిక ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు, దాని గురించి ఓ పేపర్‌పై రాసుకున్నాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు ప్రవేశించాడు. దేవుడి పటాల వద్ద ఉన్న హుండీని పగలగొట్టాడు. ఇంట్లో నుంచి శబ్ధం రావడంతో అమ్మాయి వచ్చింది. నిందితుడిని చూసి చోరీ గురించి తన తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు సహప్రపై దాడి చేశాడు. దాంతో ఆమె కింద పడిపోయింది, గొంతు పిసికి చంపివేశాడు. తర్వాత కత్తితో మెడ , పొట్టలో కొత్తితో విచక్షణారహితంగా పొడవడంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది.
బాలిక చనిపోగానే.. బాలుడు ఆ ఇంటి నుంచి పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి దూకాడు. అక్కడ 15 నిమిషాలు దాక్కున్నాడు, దీనిని చూసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. పిల్లలు ఆడుకుంటున్నారని భావించాడు, తర్వాత బాలిక హత్య గురించి పోలీసులు దర్యాప్తు చేస్తుండా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కూడా విచారించారు. ఈ సమయంలో బాలుడు దాక్కున్న విషయం పోలీసులకు చెప్పాడు. దీంతో హత్య కేసు కీలక మలుపు తిరిగింది, బాలుడు హత్య చేసినట్లు ముందుగా పోలీసుల కూడా ఊహించలేదు. విచారణలో భాగంగా పోలీసులు బాలుడిని కూడా విచారించారు, ఆ సమయంలో ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
లేఖలో సంచలన విషయాలు…
‘మిషన్ డాన్’ పేరుతో నిందితుడు తన చోరీ ప్లాన్‌ను పేపర్‌పై రాసుకున్నాడు. ‘ముందుగా ఇంట్లోకి ప్రవేశించాలి. ఇంట్లో ఉన్న గ్యాస్, టేబుల్‌ని డోర్ వద్ద పెట్టాలి. ఇంటికి వేసిన లాక్‌ను గ్యాస్‌పై మండించాలి. తర్వాత లాక్‌ను కట్ చేయాలి, లాక్‌ను కట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఇంటికి లాక్ వేసి తర్వాత గ్యాస్‌ను మునుపటి స్థానంలో పెట్టి లీక్ చేయాలని, ఇంటి నుంచి బటయకు వచ్చి లాక్ వేయాలని పేపర్‌పై రాసుకున్నాడు. గ్యాస్ లీక్ చేస్తే ఇల్లు ధ్వంసం అవుతుందని, దీంతో తనపై అనుమానం రాదని భావించాడు.