శ్రీలంగ మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ను శుక్రవారం నాడు శ్రీలంక సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణపై ఆయనను అరెస్ట్ చేసినట్లు స్థానిక టెలివిజన్ తెలిపింది. 76 ఏళ్ల విక్రమసింఘే రాజధాని కొలంబోలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. తన భార్య స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు లండన్ కు వెళ్లిన విషయంపై దర్యాప్తులో భాగంగా స్టేట్ మెంట్ ఇచ్చేందుకు ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లారని టెలివిజన్ రిపోర్ట్ లో తెలిపారు. ఈ అరెస్ట్ పై శ్రీలంక పోలీసులు వెంటనే ధ్రువీకరించలేదు. మీడియా ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు వెళ్లినా విక్రమ సింఘే కార్యాలయం స్పందించలేదు.
రణిల్ విక్రమసింఘే ఓ న్యాయవాది. రికార్డు స్థాయిలో ఆరు సార్లు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు.2022లో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీలంకలో ఆర్థికమాంద్యం కారణంగా పెద్దఎత్తున నిరసనలు, అల్లర్లు చెలరేగినప్పుడు మాజీ అధ్యక్షుడు కోటబయ రాజపక్ష రాజీనామాచేసి, శ్రీలంక నుంచి పారిపోయిన తరుణంలో అప్పటి యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడైన రణిల్ విక్రమసింఘే ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు.