Saturday, August 23, 2025

50 గంటల జైలుకే ఉద్యోగం ఊడితే 30 రోజుల జైలుకు పదవి పోవద్దా?

- Advertisement -
- Advertisement -

బెయిల్ పై బయటకు వచ్చిన వాళ్లే
బిల్లును వ్యతిరేకిస్తున్నారు
జైలులో ఫైళ్లపై సంతకం చేసిన
సీఎంలు ఉన్నారు రాజ్యాంగ
నిర్మాతలు ఇలాంటి నాయకులు
వస్తారని ఊహించి ఉండరు
కేజ్రీవాల్, రాహుల్, తేజస్వీపై
ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు
ఈ అవినీతి వ్యతిరేక చట్టానికి
ఎవరూ అతీతులు కారని వెల్లడి
క్రిమినల్ రికార్డు ఉన్న నాయకులనూ
వదలబోమని మోడీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ : ప్రధాని, ముఖ్యమంత్రులతో సహా ఎవరైనా అరెస్ట్ అయి 30 రోజులు జైలులో ఉంటే వారిని తొలగించేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగం 130వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నాయకులపై ప్రధాని మోడీ తీవ్రంగా విమర్శలు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వారే ఈ బిల్లును ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అరెస్ట్ అయి జైలులో ఉండి అధికార ఫైళ్లపై సంతకం చేసిన ఓ సీఎం, బెయిల్ పై జైలు నుంచి బయటపడి తాను రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నానని విమర్శిస్తున్న మరో నాయకుడు, రైల్ కా ఖేల్ లో పాల్గొన్న మరో నాయకుడు… వీళ్లే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని మోడీ విమర్శిస్తూ, అరవింద్ కేజ్రీవాల్,రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లను పరోక్షంగా నిందించారు. బీహార్‌లోని గయలో శుక్రవారంనాడు నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు.

50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు నెల రోజుల పాటు జైలులో ఉండే సిఎం, పిఎం, మంత్రులు ఎందుకు పదవిని కోల్పోకుండా ఉండాలని మోడీ ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టానికి ఎవరూ అతీతులు కారని మోడీ అన్నారు. చివరకు ప్రధాని కూడా ఆ చట్టం పరిధిలోకి వస్తున్నారని గుర్తు చేశారు. కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా అధికారపదవిలో ఉండి, అరెస్ట్ అయి 30 రోజులు జైలులో ఉంటే, బెయిల్ పొందలేకపోతే , వారు 31 వ రోజున రాజీనామా చేయవలసి ఉంటుందని, లేని పక్షంలో తొలగించ బడతారని ప్రధాని వివరించారు. రాజకీయాల్లో నైతికత పెంచే ఈ చట్టం ప్రధానికి కూడా వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు.

ఆర్‌జెడిపై విమర్శలు..
ఆర్జేడీ పాలనలో… లాంతర్ యుగంలో ( లాంతర్ ఆర్జేడీ గుర్తు) గయ లాంటి గొప్ప చరిత్రాత్మక నగరాలకూ విద్యుత్ ఉండేది కాదని ప్రధాని విమర్శించారు. ఒకప్పుడు గయ, చుట్టుపక్కల ప్రాంతాలు మావోయిస్ట్ ల అడ్డాగా ఉండేందని, వారు ఇక్కడ విధ్వంసం సృష్టించారని ఆయన నిందించారు.ఆర్జేడీ హయాంలోనూ మావోయిస్ట్ లు ఇక్కడ చెలరేగిపోయారని, నితిష్ కుమార్ ఆధ్వర్యంలోని బీజేపీ- జేడీయూ డబుల్ ఇంజిన్ సర్కార్ మావోయిస్ట్ ల బెడదను అంతం చేసిందని ప్రధాని ప్రశంసలు కురిపించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు…
గంగా నదిపై 1.8 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల వంతెనను ప్రారంభించిన ప్రధాని రెండు రెళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డెమోగ్రఫీ మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News