Saturday, August 23, 2025

సఫారీలకు సిరీస్

- Advertisement -
- Advertisement -

రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా చిత్తు

మాక్‌కే(ఆస్ట్రేలియా): వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికా పెను ప్రకంపనలు సృష్టించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సఫారీ టీమ్ జయకేతనం ఎగుర వేసింది. శుక్రవారం జరిగిన రెండో వనడేలో సౌతాఫ్రికా 84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో కేవలం 193 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (6) మరోసారి నిరాశ పరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ (1) కూడా విఫలమయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ మిఛెల్ మార్ష్ కూడా నిరాశే మిగిల్చాడు. మార్ష్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కామెరూన్ గ్రీన్, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించారు. గ్రీన్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, ఇంగ్లిస్ దూకుడును ప్రదర్శించాడు. ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసిన గ్రీన్ 54 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇక ధాటిగా ఆడిన ఇంగ్లిస్ 74 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 10 ఫోర్లతో 87 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 193 పరుగుల వద్దే ముగిసింది.

సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 42 పరుగులు మాత్రమే ఇచ్చిన ఐదు వికెట్లు పడగొట్టాడు. బర్గర్, ముత్తుస్వామీలు రెండేసి వికెట్లు తీసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను మాథ్యూ బ్రిట్జ్‌కె, ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీలు సాధించారు. దూకుడుగా ఆడిన బ్రిట్జ్‌కె 18 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. ఇక సమన్వయంతో ఆడిన స్టబ్స్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు సాధించాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (38), ముల్డర్ (26), మహారాజ్ 22 (నాటౌట్) కాస్త రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News