Saturday, August 23, 2025

‘కేదార్‌నాథ్’ నిర్మాతలు కోయరాజులే!

- Advertisement -
- Advertisement -

భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేదార్‌నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. పూర్వం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు. 8వ శతబ్దంలో ఆది శంకరాచార్యులు పునర్నిర్మించినట్టు పేర్కొంటున్నారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండీజినస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (తెలంగాణ)నుండి బుగ్గ కోటేశ్వర్ రావు, కాక నవ్య బృందం తమకు లభించిన తాళపత్రాల ఆధారంగా 2024 అక్టోబర్ నెలలో ఆలయ పూర్వమూలాలపై పరిశోధన చేయడం జరిగింది. కోయ గిరిజన సమాజంలో 3 నుండి 7 గొట్టుల సంబంధ బాంధవ్యాలుంటాయి. మూడోగట్టు వంశంలోని బంగారుకొండ కాటూరయ్య ముఖ్యమైన వ్యక్తి. అతని వంశమే ఈరోజు మూడవ గొట్టు కుటుంబంగా నిలబడింది.

కోయ రాజులు 8వ శతాబ్ద కాలంలో రాసిన పూర్వ తాళపత్రాలు ద్వారా ఆలయ విశిష్టత గురించి తమ పరిశోధన ప్రారంభించారు. తాళపత్రాల ఆధారంగా (Based palm leaves) 17 మంది గల వారి పరిశోధన బృందం ప్రయాణం హరిద్వార్ నుండి గౌరీ కుండ్‌కి సాగింది. గౌరీ కుండ్ నుండి కేదార్‌నాథ్‌కి 22 కిలోమీటర్లు దూరాన్ని హిమాలయాలలో మైనస్ 14 నుండి 5 డిగ్రీల చలిలో, అదీ రాత్రి సమయంలో దట్టమైన అడవి కొండల్లో శశిమందాకిని నది ఒడ్డునుండి కాలి నడకన తెల్లవారి 9 గంటలకు చేరుకుంది. ఈ మందాకిని 6వ గొట్టు బెరంబోయిన రాజుకు ఇష్టమైన చెల్లెలు. కాబట్టి ఈ నదికి ఆ పేరు వచ్చింది. పూజలు చేసే సందర్భంలో మందాకిని ఈ నది నుండే నీటిని కుండలో తెచ్చి శివుడికి అభిషేకం చేసిందట! కాబట్టి ఆ నదికి ఆమె పేరుతోనే స్థిరపడింది. అంటే దేశంలో నదులకు, కొండలకు పేర్లు పెట్టింది ఆదివాసీలే అనేది సుస్పష్టం.

ఎటు చూసినా ఎత్తైన కొండలు, పేరుకుపోయిన మంచు ఉన్నప్పటికీ దృఢమైన స్వెటర్లతో పరిశోధక బృందం సాహసం చేసింది. పరిశోధన కేంద్రం సేకరించిన తాళపత్రాలను పరిశీలించగా.. కేదార్‌నాథ్ ఆలయం కోయరాజులు నిర్మించినట్టు ఇక్కడున్న మూడవ గొట్టు వారు రాజ్యాలు పాలించినట్టు ఉంది. దానిని నిర్ధారించడమే కోయ పరిశోధకుల లక్ష్యం. ఇక్కడ సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యకిరణాలు హిమాలయ కొండలపై పడుతుంది. ఆలయం చూస్తే బంగారం రంగులో త్రిభుజాకారంలో కనిపిస్తుంది. అందుకే 3వ గొట్టు రాజు రాజ్యం కూడా బంగారుకొండ రూపంలోఉంది. కాబట్టి బంగారుకొండ కాటూరయ్య అనే పేరు వచ్చింది. ‘సూర్యోదయం వేళ ఆ కొండపై బంగారం రంగులో కొండ కన్పించడం ప్రత్యక్షంగా చూశాం.

ఒక పక్క మంచు పైన కూడా బంగారం రంగు కన్పించడంతో కోయల మూలం నిర్ధారణ చేసాం’ అని పేర్కొంటున్నారు పరిశోధకులు. ఈ గుడి మూడవ గొట్టు వారిది. దీని నిర్ధారణ కోసం గుడిలో పరిశీలించగా.. శివలింగం ఎద్దు మూపురం ఆకారంలో ఉంది. దానిపై కూడా స్పష్టంగా లిపి ఉంది. ఈ గుడి 3వ గొట్టు వారి రాజ్యపాలనలో కట్టించింది. తన తండ్రి కాటురుడికి గుర్తుగా రెండవ కొడుకు పిడగరాజు మూగలముయ్య భార్య కట్టించారు. బేరంబోయిన రాజు భార్య వరాందేవి (కట్టుపిడియ). ఈమెని కూడా ఇక్కడ పూజిస్తున్నారు. ఎందుకంటే, మూడవ గొట్టుకి మొదటి బిడ్డను ఇచ్చివారు కాబట్టి 6వ గొట్టు వారి బొట్టు నెలవంక అయింది. అందుకనే వరాందేవి ఉన్న దగ్గర నెలవంక కన్పిస్తోంది.

గుడిలో ఎక్కడ చూసినా కోయ పూర్వ లిపి ఉంది. గుడిపైన చూసినప్పుడు ఐదవ గొట్టుని తెలియజేసే గొబ్బేను పోలిన 5 గుర్తులు, అంటే బండాని గోత్రం బొట్టు త్రిశూలం ఉంది. అంటే అయిదవ గొట్టు వారి బొట్టు త్రిశూలం ఆకారం. ఈ గుడిలో సమ్మక్క తల్లి కూడా పూజలు అందుకుంటోంది. గుడి నిర్మాణం చూసినప్పుడు మూడవ గొట్టు వారి గుర్తులతో నిర్మించబడి ఉంది. గుడి నిర్మాణంలో పేర్చిన రాయి- భిమ్ శిల 3 వరుసలుగా ఉంది. గుడి కూడా రాజ్యం గుర్తు త్రిభుజాకారంలో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోయ గోండు రాజ్య సంకేతంగా పేర్కొనే ఏనుగుపై సింహం కూడా అమర్చి ఉంది. అంటే ఇది కోయ రాజులు ఏర్పాటు చేసింది అని చెప్పవచ్చు. దానిపైన ఇంకొక చిన్న గుడి ఉంది.

ఆ గుడిలో తుల్ మూతి, నాగులమ్మ, కాలభైరవుడు, వరాందేవి ప్రతిమలు ఉన్నాయి. పర్వతాల మీద కూడా లిపి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా తాళపత్రాలలో ఉన్నవన్నీ యథాతథంగా కన్పించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అదే విధంగా ఇక్కడ చిత్ర లిపి రూపంలో ఆరవ గట్టు వంశం బెరంబోయిన రాజు వరాందేవి కొడుకులు పెదరాము(కొమరం), చినరాము (మొసం), ఈదెల్ పురల్ (సోలం), మైసయ్యా (ఎట్టి), దారెల్ రాజ్ (కారం), బంగారు పాపల్(పోడెం) స్పష్టంగా ఉన్నాయి. ఈ విధంగా కేదార్‌నాథ్ మూడవ గొట్టు వారి సొంతం అని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ఆదివాసీలు కోయతెగ వారే. కోటియ, బుక్ష జన్సరిస్, రాజిస్, తారస్, రంగ్ కాస్‌గా వంటి పేర్లతో ఉన్నారు. కోయ తెగకు, కోయ భాష పుట్టుకకు మూలం ఉత్తరాంచల్ అని చెప్పవచ్చు. ఆదివాసీలు అనాగరికులు కారు. నవీన నాగరికతకు నిర్మాతలు అని చెప్పడానికి.. ఈ దేశ భూభాగాన్ని 18 దిక్కులుగా విభజన చేసి పకృతి ఆధారంగా పరిపాలన నడిపారు.

101 రాజ్యాలను ఈ దేశంలో కోయ గోండు రాజులు పూర్వం పరిపాలించారు. అందులో 18 శక్తిపీఠాలు కూడా ప్రకృతిని అంచనా వేయటానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుత దేశంలోని చాలా పురాతన కోటలు కోయ రాజుల ఏర్పాటు చేసినవే. మగధ సామ్రాజ్యం నుండి మొదలుకొని గుప్తులు, మౌర్యులు, చోళులు, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు పాలించిన రాజ్యాలన్నీ పూర్వం కోయ రాజులు ఏర్పాటు చేసినవే. కాలక్రమంలో ఆర్యుల చేతిలో కోయ రాజ్యాలు కోల్పోయాక, తమ మూలాలను వెతికి పట్టుకొని దట్టమైన గోదావరి లోయ అడవి ప్రాంతంలోకి వలస వచ్చి ఆదివాసీలుగా మారారు. అందుకే నేడు వేల్పు జాతరలలో పడిగె గుడ్డలో కోయరాజుల చరిత్ర డోలీవాయిద్యం ద్వారా మౌఖిక సాహిత్య రూపంలో చెప్పబడుతోంది. అది పుక్కిటి పురాణం కాదు, అది ఈదేశ మూలవాసుల చెరగని చరిత్ర. ఆవైపుగా పరిశోధనలు జరిగిన రోజు దేశంలో వాస్తవ ఆదివాసీల ఘన చరిత్ర తెలుస్తుంది.

– గుమ్మడి లక్ష్మీ నారాయణ, 91822 96576

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News