జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులు తాగేనీటిలో మోనోక్రోటోపాస్ పురుగుల మందు కలిపాడు. ఈ విషయం తెలియని విద్యార్థులు శుక్రవారం ఆ నీటిని తాగారు. వారిలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంఎల్ఎ సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పి కిరణ్‌ఖారే శనివారం పాఠశాలకు వెళ్లి పరిశీలించి, ఆరా తీశారు. పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు మధ్య తరుచూ విభేదాలతో ఓ ఉపాధ్యాయుడు టానిక్ సీసాలో పురుగుల మందు తీసుకొచ్చి మంచినీటి ట్యాంకులో కలిపినట్లు విద్యార్థులు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది.
పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని తమను భయపెట్టినట్టు విద్యార్థులు వివరించారు. పురుగుల మందు కలిగిన సీసాను అధికారులు గుర్తించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరిశీలించి, ఆరోగ్యం గురించి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ ఘటనపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు రాజేందర్, వేణు, సూర్యప్రకాష్, వంటమనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బలహీనవర్గాలకు చెందిన అణగారిన పేద కుటుంబాల విద్యార్థులను తల్లిదండ్రులు చదివించుకోవాలన్న ఉద్దేశంతో వసతిగృహాల్లో ఉంచుతున్నారని అన్నారు. ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులపై ఇలాంటి ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని తెలిపారు.