Sunday, August 24, 2025

నికార్సయిన కమ్యూనిజానికి నిలువుటద్దం

- Advertisement -
- Advertisement -

దేశంలో 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన కొద్ది మాసాలకు ఒక తెలుగు దినపత్రికలో నిరవధిక సమ్మె జరిగింది. అది కార్మికుల హక్కులు, న్యాయమైన వేతనాలు, సరైన పని పరిస్థితులకు సంబంధించి జరిగిన సమ్మె. కమ్యూనిస్టు పార్టీలు ఆ సమ్మెను వ్యతిరేకించకపోయినా మద్దతుగా మాత్రం నిలబడలేదు. అప్పుడప్పుడే జర్నలిజం వృత్తిలోకి వచ్చి కమ్యూనిజం గురించి కూడా తెలుసుకుంటున్న నాలాంటి యువకులకు కమ్యూనిస్టుల వైఖరి బాధ కలిగించింది. మేము శిక్షణలో ఉండగా మాకు ప్రిన్సిపల్ గా వ్యవహరించిన ఒక ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మాకు పదే పదే బోధిస్తూ ఉండేవాడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు, మహిళలకు అన్యాయం జరిగే విధంగా మనం వ్యవహరించకూడదని. అలాంటి ఆయన ఈ సమ్మెలో యాజమాన్యం వైపు నిలబడి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన పనులన్నీ చేశారు. ఆ తరువాత చాలా ఏళ్ళకు ఆయన రాసుకున్న తన ఆత్మకథలో ఆ విషయం తానే రాసుకున్నారు కూడా.. సమ్మె కాలంలో యజమాని ఇంటి నుండి వచ్చిన భోజనం ఆరగించి, అక్కడినుండి వచ్చిన పరుపులు వేసుకుని పడుకుని, ఆఫీసులోనే ఉంటూ పని చేసి ఎలా సమ్మెను విచ్ఛిన్నం చెయ్యడానికి ప్రయత్నించిందీ. అప్పట్లో ఆయనకు భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం కూడా ఉండేది.

సమ్మె చేస్తున్నవాళ్ళం హిమాయత్‌నగర్ కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ మక్దూం భవన్‌కు వెళ్లి అక్కడి నాయకులకు ఆయన కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్య పక్షం వహించిన విషయంపై ఫిర్యాదు కూడా చేశాం. కమ్యూనిస్టు భావాలు గల మరొక సంపాదకుడు కూడా సమ్మెకు వ్యతిరేకంగా యజమానిని సమర్ధించడంతో ఆయనే అనువదించి ప్రచురించిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కమ్యూనిస్టు నాయకుల కొటేషన్ల పుస్తకంలో నుండి రోజూ కొన్ని కొటేషన్లు లోపల సమ్మె విచ్ఛిన్నకారులందరికీ వినిపించే విధంగా సమ్మె శిబిరంనుంచి గట్టిగా అరిచి చదువుతూ ఉండేవాళ్లం.న్యాయమయిన ఈ సమ్మెను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారనే ఒక ప్రచారం మొదలైంది. కమ్యూనిస్టు నాయకులు ఎవరూ శిబిరం దగ్గరికి రాకపోవడం, సంఘీభావం తెలపకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ఆ దినపత్రిక యజమాని పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉండటం కూడా కారణం అనే ప్రచారం కూడా జరిగింది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ యువజన విభాగం నడుపుతున్న ‘యువజన’ మాసపత్రిక సంపాదకవర్గంలో సభ్యుడైన మిత్రుడు ఎస్. నర్సింగ్ రావు విజయవాడనుంచి నాకు లేఖ రాశాడు..

కమ్యూనిస్టు నాయకులు ఎవరూ ఇంత చరిత్రాత్మకమయిన సమ్మెను సమర్థించకపోవడం ఏమిటని. దానికి నేను బయటినుంచి కమ్యూనిస్టుల మద్దతు లేకపోగా ఆ పత్రికలో పనిచేస్తున్న కమ్యూనిస్టు నాయకులు కూడా యాజమాన్యానికి ఎలా కొమ్ముకాస్తున్నారో తెలియజేస్తూ వివరంగా జవాబు రాసాను. రోజులు గడుస్తున్నాయి, సమ్మె కొనసాగుతూనే ఉంది. అటు ప్రభుత్వం నుండి కానీ, ఇటు ప్రతిపక్ష రాజకీయ నాయకుల నుండి కానీ ఎటువంటి మద్దతు, కనీస స్పందన లేదు. పత్రిక ప్రచురణ ఆగిపోయింది. మధ్యలో ఒకరోజు ఉదయం మిత్రుడు నర్సింగ్ ఇద్దరు ముగ్గురు మిత్రులను తీసుకుని సమ్మె శిబిరం వద్దకు వచ్చారు. వారిలో ఒకాయన.. వయసు 30 సంవత్సరాలు ఉండొచ్చు, చాలా స్నేహంగా మాతో కలిసిపోయారు. మాతో కలిసి నినాదాలు చేసారు, శిబిరంలో చాలాసేపు కూర్చుని మాకందరికీ ధైర్యం చెప్పి, సంఘీభావం తెలిపి, ‘కమ్యూనిస్టు పార్టీ మీతో ఉంటుంది. మీ సమ్మె వెనక నక్సలైట్లు ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. కార్మికుల డిమాండ్లు సహేతుకమైనప్పుడు ఆ సమ్మెను ఎవరు సమర్థించినా తప్పులేదు. మేము మీతో ఉన్నాం’ అని ఆర్థిక సహాయంగా యువజన సమాఖ్య పేరిట వెయ్యి రూపాయల చెక్ అందజేశారు. చాలాసేపు మా శిబిరంలో గడిపి మాలో ధైర్యం నింపి వెళ్లారు. 70లలో వెయ్యి రూపాయల సహాయం చిన్నదేమీ కాదు.

అప్పటిదాకా ‘మన న్యాయమయిన పోరాటాన్ని ఎవరూ ఎందుకు సమర్ధించడం లేదు, మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా?’ అని మధనపడుతున్న మాలో ఆయన కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయనే ఆ తర్వాత కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి. జీవితమంతా కమ్యూనిస్టుగానే గడిపిన సుధాకర్ రెడ్డి తన సిద్ధాంతాలను వ్యతిరేకించే వారితో కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు.2021లో కరోన మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన రోజుల్లో ఒకనాడు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయగారి దగ్గరి నుండి ఫోన్ వచ్చింది. ‘సుధాకర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదట. నేను రేపు ఉదయం చండీగఢ్ నుండి వస్తున్నా, నేరుగా ఆయన ఇంటికే వస్తా. అక్కడ కలుసుకుందాం’ అని. రాజకీయంగా, సిద్ధాంతపరంగా వారిద్దరూ పూర్తి విరోధులు. దత్తాత్రేయగారిది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం. సుధాకర్ రెడ్డి నిఖార్సయిన కమ్యూనిస్ట్. అయినా వారిద్దరూ మంచి మిత్రులు. ఒక్క దత్తాత్రేయ గారినే కాదు, సుధాకర్ రెడ్డి మనుషులందరినీ ప్రేమించారు. తను నమ్మిన సిద్ధాంతానికి ఎంత బలంగా కట్టుబడి ఉన్నారో, ఎంత దృఢంగా దానిని ఆచరించారో మానవ సంబంధాలను కూడా అంతే గౌరవించారు.

ఆ సమ్మె కాలంనుంచి దాదాపు ఈ 50 ఏళ్లలో సుధాకర్ రెడ్డి నాలాంటి వారందరికీ ప్రేరణగా నిలిచారు. కమ్యూనిస్టులమని చెప్పుకునే కొందరు, ప్రభుత్వ బలగాల సాయంతో 24 రోజుల తరువాత సమ్మెను విచ్ఛిన్నం చేసి యాజమాన్యం తాత్కాలిక విజయం పొందినా న్యాయ పోరాటం జరిగిన దాదాపు 20 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. అప్పటికే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద నాయకుడి స్థాయికి ఎదిగారు. ఆయన చూసిన, స్వయంగా పాల్గొన్న అనేక పోరాటాల ముందు మా విజయం చాలా చిన్నది.
సుధాకర్ రెడ్డి చాలా సున్నితమయిన మనిషి. ఎవరినీ నొప్పించే వారు కాదు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కాలంలోనే అనుకుంటా మరో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. నేను ఇదే ‘డేట్ లైన్ హైదరాబాద్’ కాలమ్‌లో ప్రజాతంత్ర వారపత్రికలో ఆ వారం రాసిన వ్యాసం కొంచెం పరుషంగా ముగిసింది. పొద్దున్నే సుధాకర్ రెడ్డిగారి నుండి ఫోన్. ‘రాజేశ్వర్ రావు చాలా సీనియర్ నాయకుడు. ఆయనకి ఏవో వ్యక్తిగత కారణాలు ఉండి వెళ్ళిపోయారు. మా పార్టీ కూడా ఆయనపట్ల అంత కఠినంగా వ్యవహరించలేదే. ఇంత పరుషంగా రాసావేమిటి?’ అని నొచ్చుకున్నారు.

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అన్నకుమారుడు సుధాకర్ రెడ్డికి విద్యార్థిదశ నుండే జర్నలిజంపట్ల చాలా ఆసక్తి ఉండేది. డిగ్రీ పూర్తి చేయగానే పార్టీ పత్రిక ‘విశాలాంధ్ర’లో సబ్ ఎడిటర్ గా చేరేందుకు పార్టీ నాయకుడు నీలం రాజశేఖర్ రెడ్డిగారి సలహా మేరకు విజయవాడ వెళ్లి ఆనాటి సంపాదకులు ఏటుకూరి బలరామమూర్తిగారిని కలిశారు. మరునాడే అక్కడ సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరాల్సింది. ఈలోగా చక్రవర్తుల రాఘవాచారి ఆయనను న్యాయశాస్త్రం చదివేందుకు ఉస్మానియా యూనివర్శిటీలో చేరడానికి హైదరాబాదు రమ్మని పిలిపించారు. జర్నలిస్ట్ కావాలనుకున్న సుధాకర్ రెడ్డి పూర్తి కాలం కమ్యూనిస్టు రాజకీయాలకు అంకితం కావడం, ఆయనను జర్నలిజంలోనుండి బయటకు తెచ్చిన రాఘావాచారిగారు దేశం గర్వించే సంపాదకుడి స్థాయికి చేరడం ఆసక్తి కలిగించే విషయం.జర్నలిస్టు కావాలన్న కోరికకు తెరపడినా సుధాకర్ రెడ్డికి జర్నలిజంపట్ల, సాహిత్యంపట్ల ఆసక్తి తగ్గలేదు. ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమంలో వివిధ స్థాయుల్లో క్రియాశీలకంగా పాల్గొంటూనే, రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలు అవుతూనే రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించారు. ఆయన కర్నూలు కళాశాలలో చదువుకున్న రోజుల్లోనే విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు ఒక గోడ పత్రిక నడిపారు. ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీలో యువజన సమాఖ్య నడిపిన ‘యూత్ లైఫ్’ అనే ఆంగ్ల పక్షపత్రికలో పని చేశారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా, ఆ తర్వాత అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేస్తున్న కాలంలో తెలుగు మాసపత్రిక ‘యువజన’ సంపాదకత్వ బాధ్యతల్ని కూడా నిర్వహించారు. ‘యువజన’లో పరోక్షంగానే అయినా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక వ్యాసం రాసినందుకు పత్రిక నిషేధానికి కూడా గురైంది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆయన పార్లమెంట్లో సమర్పించిన ఒక శ్వేతపత్రంలో తాను సంపాదకత్వం వహించిన ‘యువజన’ నిషేధానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ‘కొత్త బాట’ వారపత్రికలో వారం వారం ఆయన రాజకీయ వ్యాఖ్యానాలు చేసేవారు. ‘విశాలాంధ్ర’ దినపత్రికలో సుధాకర్ రెడ్డి వివిధ అంశాల మీద రాసిన వ్యాసాల సంఖ్యకు లెక్కేలేదు.
బాగా సీనియర్ల చేతుల్లోనే ఉంటూ వచ్చిన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం యువత చేతుల్లోకి వచ్చింది సుధాకర్ రెడ్డి కాలంనుండే. ఉమ్మడి రాష్ట్రంలో రాజమండ్రిలో జరిగిన పార్టీ మహాసభల్లో యూత్ లీడర్ గా అప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్న ఆయనను పక్కన పెట్టలేక కొత్తగా సహాయ కార్యదర్శి పదవి సృష్టించి ఆయనను నియమించారు. ప్రవచనాలకు పరిమితం కాకుండా ఆచరణ యోధుడు కాబట్టే దేశంలో సురవరం తొక్కని జైలు గడపలేదు. విద్యార్ధి, యువజన, పార్టీ నాయకుడిగా ఆయన ముందుండి నడిపిన ఉద్యమాలు అనేకం. వాటి ఫలితంగా గడిపిన జైలు జీవితం తక్కువేమీ కాదు. చిరస్మరణీయమైన ఆయన జీవితం గ్రంథస్థం అయితే ఎంతో బాగుండును. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అమర్ హై.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News