న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ధోరణిపై, సుంకాల మోతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌తో ఏదైనా విషయంలో సమస్య ఉంటే ఏ దేశం అయినా భారతదేశ ఉత్పత్తులు లేదా సరుకులు తెప్పించుకోకుండా ఉంటే మంచిది. వారి మార్గాలు వారికి ఉన్నట్లు మాకూ మా దారులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇక్కడ ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ప్రసంగించారు. భారత్ చెప్పిన మాట వినడం లేదని, రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోళ్లకు దిగుతోందని ట్రంప్ ఆగ్రహిస్తున్నారు. ఇందుకు ప్రతిగా భారత్‌పై అదనపు సుంకాలు, పెనాల్టీలకు దిగుతున్నారు.ఈ విషయంపై జై శంకర్ స్పందించారు. ఏ దేశంలో అయినా స్వీయ ప్రయోజనాల కోణంలోనే నిర్ణయాలు ఉంటాయి.
అంతేకానీ ఇతర దేశాల ఆలోచనలకు అనుగుణంగా స్పందించడం కుదరదు. దీనిని అన్ని దేశాలూ అర్థం చేసుకోవల్సి ఉంటుంది. మాకంటూ పలు నిర్థిష్ట ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడి రైతులు , చిన్న వ్యాపారుల విషయాలను నిశితంగా పరిశీలించుకుని తీరాలి. ఈ క్రమంలోనే ఏ నిర్ణయం అయినా తీసుకోవల్సి ఉంటుంది. దీనిని అంతా గ్రహించాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికాకు ఆయన చురకలు పెట్టారు. అమెరికాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందం అయినా దేశ ప్రయోజనాల పరిధిలోనే ఉంటుందన్నారు. సుంకాల విషయంలో ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలకు దిగుతున్నారని విమర్శించారు. చైనా, ఇయూలపై వేరే విధంగా వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ రెండూ రష్యా క్రూడాయిల్‌ను, సిఎన్‌జిని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి కదా అని ప్రశ్నించారు.
అన్నీ ఆలోచించే రష్యా చమురు కొనుగోలు
2022లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ విషయం అమెరికాకు ఇతర దేశాలకూ తెలుసు. దేశ ప్రయోజనాలు, ప్రపంచ దేశాల పరిస్థితికి అనుగుణంగానే రష్యా చమురు తీసుకుంటూ వస్తున్నామని, ఇందులో వేరే ఉద్ధేశాలు వెతుక్కుంటే అది తప్పిదమే అవుతుందని జైశంకర్ చెప్పారు. రష్యా చమురు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ధరలు స్థిరీకరణ ఉంటుందని ప్రపంచ ప్రముఖ దేశాలు భావించాయి. ఈ క్రమంలోనే రష్యా నుం చి చమురు దిగుమతులను పరస్పర వాణిజ్య ఒప్పందం క్రమంలోనే అనుమతించామని వివరించారు. రష్యా నుంచి చమురు విషయానికి , ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని, వేర్వేరు విషయాలు అని, పైగా ప్రధాని మోడీ ఘర్షణ పరస్పర చర్చలతో ముగియాలని పదేపదే అందులోనూ తొలుత ఉద్బోధించారని గుర్తు చేశారు. ఉద్రిక్తతలు చల్లారనేదే భారతదేశ ఆకాంక్ష అని తేల్చిచెప్పారు.