తెలంగాణ అస్తిత్వం- సృజన రంగం: ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. అందులో భాగంగా ఈసారి ప్రముఖ సాహితీకారుడు, తెలంగాణ సాహిత్య, చరిత్ర పరిశోధకుడు, డా.సంగిశెట్టి శ్రీనివాస్ అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో.
తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?
అస్తిత్వం బహుముఖాల్లో ఉంటుంది. ప్రతి వ్యక్తికి కులం, జెండర్, ప్రాంతం, ఆర్థికం, రాజకీయం, విద్య, ఉపాధి ఇట్లా ఏక కాలంలో పలు అస్తిత్వాలుంటాయి. దాన్ని అక్షరాల్లో నిర్వచించలేము. సకల వివక్షలను, విస్మరణలను, విద్రోహాలను ధిక్కరిస్తూ, ‘మేమూ చరిత్రకెక్కదగ్గవారమే’, మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఎదిరిస్తాం అంటూ నినదిస్తున్న 33 జిల్లాల ప్రజల ఐక్య వ్యక్తీకరణ ‘తెలంగాణ అస్తిత్వం’.
2.సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్తిత్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విసృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?అక్షరాస్యత ప్రతిఫలాలు ముందుగా బ్రాహ్మణ సామాజిక వర్గం వారు అందుకున్నారు. అంతేగాదు ఆది నుంచీ, అది మరెవ్వరికీ దక్కకుండా చేసింది కూడా వాళ్ళే. దాంతో ఇప్పటికీ సాహిత్యం, సంస్కృతి, కళా రంగాల్లో వారి ఆధిపత్యమే కొనసాగుతున్నది. వారి సంస్కృతి, కళలు, వాయిద్యాలు, రచనలు, వారు చేసే సూత్రీకరణలు, వారికి వినసొంపైన భాషే అటు పత్రికల్లోనూ, పాఠ్యపుస్తకాల్లోనూ, వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ పరుచుకు పోయి ఉన్నది.
అట్లా గాకుండా జనాభాలో ఎవరెంత ఉన్నారో వారికి సంబంధించిన సంస్కృతి, కళలు, సాహిత్య రంగాల్లో వారికంత వాటా దక్కాలి. ఉదాహరణకు పాఠ్యపుస్తకాల్లో బ్రాహ్మణులు రాసిన పాఠ్యాంశాలే గాకుండా దళితుడైన దున్న ఇద్దాసు రచనలూ ఉండాలి. జనాభాలో యాభై శాతానికి మించిన బీసీలకు సంబంధించిన జీవితాలను ఆ సామాజికవర్గాల వారు రాసినవి పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో బోధించాలి. తెలంగాణా వైతాళికుల పేరిట కొద్దిమంది ఆధిపత్య కులాల వారిని ప్రచారం చేస్తూ, వారి పేరిటే అవార్డులు ఇస్తామనడం మిగతా కులాల వారిని విస్మరించడమే! ఒక రకంగా వారిని అనర్హులుగా ప్రకటించడమే! వివిధ రంగాల్లో తెలంగాణ ఖ్యాతి గట్టిగా చాటి చెప్పిన భాగ్యరెడ్డి వర్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, సుద్దాల హనుమంతు, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్, బొమ్మగాని ధర్మభిక్షం, టి.ఎన్.సదాలక్ష్మి, సంగెం లక్ష్మీబాయమ్మ, కొత్త పల్లి జయశంకర్, బొజ్జం నర్సింలు, షోయబుల్లాఖాన్ లాంటి వైతాళికులను సైతం స్మరించుకోవాలి.
పాఠ్యాంశాల్లో వీరికీ తగినంత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కాలి. ప్రభుత్వ పరంగా చేసే వేడుకల్లో కూచిపూడి మాత్రమే గాకుండా బీరప్ప పట్నాలు, సాధనశూరుల ఆటలు, చిందు యక్షగానం, ఒగ్గు కథలు ప్రదర్శితం కావాలి. వీటిని ఎందుకు ప్రదర్శనా సమయంలో విస్మరిస్తారు? వీణకు ఉన్న గౌరవం మెట్ల కిన్నెరకు, జమిడికకు ఎందుకు లేదు? ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం బ్రాహ్మణుల సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు జరిగే ప్రయత్నాలే. అంతిమంగా బహుజన కళలు, ప్రదర్శనలు, సాహిత్యం, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారంలో పెట్టాలి. ప్రభుత్వ పరంగా ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాలి. అందుకు గానూ తగినన్ని నిధులు కేటాయించాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అనుకుంటున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో సృజన రంగంలో ఆధిపత్య కులాల వారి అజమాయిషీ నిర్నిరోధంగా కొనసాగింది. 1954 నుంచి 2014 వరకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, అవార్డులు ఏ ప్రాంతం వారు? ఎవరికి దక్కినాయో చూస్తే ఆ విషయం విధితమవుతుంది. ఇప్పటికీ ఈ విస్మరణ, వివక్ష అవార్డుల విషయంలో కొనసాగుతున్నది. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు నిర్ణేతల జ్యూరీలో సభ్యులుగా నియమిస్తున్నారు. దీంతో తెలంగాణకు ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతున్నది. గత పదేండ్లలో తెలంగాణకు రెండే అవార్డులు వచ్చినాయంటే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇది అవార్డుల గొడవ కాదు. తెలంగాణలో అవార్డులకు అర్హులైన వారు లేరూ అనే అభిప్రాయాన్ని ఇది ప్రోది చేస్తున్నది. కచ్ఛితంగా రొటేషన్ పద్ధతిలో తెలంగాణకు ఒకసారి, ఆంధ్రాకు ఒకసారి అవార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.వివిధ బీసీ కులాలు, దళితుల జీవితాలపై కథా సంపుటాలు తెలంగాణ, రాయలసీమల నుంచి మాత్రమే వెలువడుతున్నాయి. ఆంధ్రాకు చెందిన దళిత మహిళ ‘తాడి నాగమ్మ కథలు’ కూడా తెలంగాణ నుంచే ప్రచురితమయ్యాయి. గత పదేండ్లలో తెలంగాణ నుంచి పాటల సంకలనాలు కూడా విరివిగా వెలువడ్డాయి. ఈ స్థాయిలో ఈ ప్రక్రియలో మునుపెన్నడూ చోటుచేసుకోని పరిణామం. ఆంధ్రా సంకలనకర్తలను నింధించి లాభం లేదని మేమే పూనుకొని ‘తెలంగాణ కథ’ వార్షికను గత పదేండ్లుగా ప్రతీయేటా వెలువరిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నుంచి యువ కథకులు, కవులు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో రచనలు చేస్తూ ఉన్నారు. పుస్తక ప్రచురణలూ అదే స్థాయిలో ఉన్నాయి.
సినిమా పాటలు, ప్రయివేటు ఆల్బమ్స్ తెలంగాణ ప్రతిభను ‘యాభై కోట్ల’ మంది ఒక వీడియోను చూసేలా చేసిందంటే ఇక్కడి ప్రతిభకు అది నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటివి కనీసం ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉండేది. తెలంగాణ గ్రామీణ ప్రాంత అమ్మాయిలు, మహిళలు ఇప్పుడు తెలుగు జానపద రంగాన్ని శాసిస్తున్నారు.
మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సృజన రంగంలో, ఎంతో వేగవం తంగా, వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితి ఉంది. తెలంగాణా స్వీయ అస్తిత్వే తర సంస్కృతులు, సాహిత్య, కళారంగాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, తమ సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకో వడం అవసరమనుకుంటున్నారా?
కొత్త విషయాలు నేర్చుకుంటూనే తెలంగాణ కళలు, సంస్కృతి, సాహిత్యాన్ని మెరుగులు దిద్దుకోవాలి. సమ్మిళితం చేసుకోవడం అంటే బతుకమ్మ ఆటల్లో దాండియా ను జోడించినట్లయితే అభాసుపాలు కావడమే తప్ప మరోకటి కాదు. బోనం మొగోళ్లు ఎత్తుకోవడం కూడా ఇకారంగా ఉంటుంది. సంస్కృతి కలుషితం కాకుండా కాపాడుకోవాలి. గ్లోబలీకరణ పరిస్థితి అంటే స్వీయ సంస్కృతిని విస్మరించడం కాదు కదా! అందుకే ఇవాళ సిలికాన్‌వ్యాలీలో అతి పెద్ద ఇండియన్ పండుగ ‘బతుకమ్మ’. కొన్ని వేలమంది ‘డాల్లస్ పురం’లో ఆ పండుగకు కలుస్తూ ఉన్నారు. తెలంగాణ-, ఆంధ్రా అనే తేడా లేకుండా సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నరు.
అంతెందుకు ఆస్కార్ అవార్డు అందుకున్న పాట రాసింది తెలంగాణకు చెందిన చంద్రబోస్, మొన్న జాతీయ స్థాయిలో బెస్ట్ లిరిక్ అవార్డు అందుకున్నది కాసర్ల నరేశ్. ఇవి రెండూ తెలంగాణ సాహితీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాయి. సంస్కృతి కన్నతల్లి లాంటిది. గ్లోబలీకరణ జరిగినా కన్నతల్లిని కడుపుల పెట్టుకోవాలి. అట్లా గాకుండా వృద్ధాశ్రమా లో చేర్పిస్తామంటే అది కుదురదు. ఇంకా చెప్పాలంటే గ్లోబలైజేషన్ వెలుగులో నేర్చుకున్న కొత్త విషయాలు తెలంగాణ ప్రతిభను మరింత మెరుగుపెట్టుకోవడానికి వినియోగించాలి. అదే సమయంలో ఇక్కడి సంస్కృతి స్వచ్ఛతను కాపాడుకోవడానికి కంచెలు పాతాలి.
5.తెలంగాణా అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం పాఠ్యపుస్తకాల్లో భాగం కావాలి. ఆధిపత్య కులాల వారి సంస్కృతి కాకుం డా అణగారిన వర్గాల వారి జీవితం, కళలు, పండుగలు, జాతరలు అందరికీ పరిచయం కావాలి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వీరి కళా ప్రదర్శనకు చోటు దక్కాలి. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినట్టుగా ప్రతీయేటా ‘తెలంగాణ గ్లోబల్ సాంస్కృతిక వారోత్సవాలు’ నిర్వహించాలి. ఈ కళాకారుల ప్రదర్శనలకు పద్మశ్రీలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ కళలు, సంస్కృతి, సాహిత్యం ‘చరిత్రకెక్కదగినవే అని గుర్తించాలి’. అందుకు సకల ఆధిపత్యాలు అంతం కావాలి.
- డా. సంగిశెట్టి శ్రీనివాస్