- Advertisement -
ఆసుపత్రి మంచాన
దేహం- శిలలా నిశ్చలం
భావాలూ, తలపులూ
తమ గమ్యాల వైపు గమిస్తూ
ఆశల ఇంద్రధనస్సు
రంగుల బొమ్మలు ఇంకా
గీస్తూనే ఉంది
కిటికీ ద్వారం నుండి శ్వాస
తన కుడి చేతిని బయటికి చాచి
ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది
వాసంతపు సమీరాన్ని
దేహం నిశ్శబ్దంగా
మనసు పాడుతున్న
మధుర సంగీతాన్ని వింటోంది
గాయాల వెనుక
గానంగా మారాలనే స్వప్నం
నన్ను బతుకు గడియారంలో
మేల్కొలుపుతోంది పదే పదే
మనోబలమే అక్షర కవచమై
ఊపిరితో నిండిన పదాలు
ఊహలుగా రూపు దిద్దుకొని
తడితడిగా మారిన గుండె
ఇప్పుడు నవ్వుల వర్షంలో
తడిచి ముద్దవుతున్నాను
బతుకు పరచిన
రహదారిలో పూల నావలా
- విల్సన్రావు కొమ్మవరపు
- Advertisement -