Monday, August 25, 2025

తెలంగాణ శిల్పాలు పరిణామం

- Advertisement -
- Advertisement -

కొండగుహల్లో, బండరాళ్ళమీద గీసిన రాతిచిత్రాలలో (Rock paintings), తొక్కుడు బొమ్మల్లో (Rock Bruisings) చెక్కుడు బొమ్మల్లో (Petroglyphs), సమాధుల మీద పరిచిన మూత రాళ్ళల్లో ప్రాథమిక శిల్పం ప్రారంభమైంది. అజంతా చిత్రాలు, ప్రెస్కోలు పెద్ద శిల్పాలకు బాటవేసాయి. భాషకు వ్యాకరణం తర్వాత సిద్ధించినట్టు, శిల్పాలకు శిల్పశాస్త్రాలు పరిణామక్రమంలో ఆవిర్భవించినవే. భిన్నమైన అభిప్రాయాలు, ధోరణులను కలిగి ఉన్నాయవి. అవి దేవాలయాల ప్రతిమలు లేదా మూర్తులు పూర్తిగా ఆధ్యాత్మికతను ప్రతిబింబిం చే కళారూపాలని స్పష్టంగా చెప్పాయి. మతభావనలకు మూర్తిమత్వాన్నిచ్చిన వస్తు రూపాలు శిల్పాలు. శిల్పాలు శిల్పులు, స్థపతుల చేత వారి నైపుణ్యంతో ప్రతిభావంతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు. తొలికాలంలో శిల్ప కళాకారుడే పూజారిగా ఉండేవాడు. స్థపతులు మతసంబంధమైన విషయాలలో, తత్వశాస్త్రంలో ప్రజ్ఞావంతులై ఉండేవారు.

శిల్పాతీతుడైన దేవుణ్ణి నమ్మేవారు. వారికున్న మతైక, ధార్మిక, తాత్వికతలను రంగరించి శిల్పరూపంలో దైవాన్ని నేలకు దింపిన వారు శిల్పులు. దైవ భావన మానవారోప (ఆంత్రోపోమార్ఫిక్) శిల్పమూర్తిగా చేయబడ్డాక, మనిషికి వలెనె ఆ విగ్రహానికి షోడశోపచార సేవలు, ఆగమాలను రచించిన మతాల గురువులు, పీఠాధిపతుల నిర్దేశాలతో హిందూ దేవాలయాలలో అర్చనాది సమస్త కార్యక్రమాలు దిన, వార, సంవత్సర, పుష్కరాది రూపాలలో తీర్చిదిద్దబడ్డాయి. నియమించుకున్న శైవ, వైష్ణ వ ఆగమాలు జ్ఞాన, క్రియ, చర్య, యోగాల గురించి నిర్వచనాలనిస్తాయి. శైవం లోని వివిధ శాఖలు, వైష్ణవంలోని భేదాలు, గాణపత్యం, శాక్తేయాలు, అర్ధదేవతలు (యుద్ధ దేవతలు) భైరవుడు, యోగినులు (నవ, అష్ట, సప్త మాతృకలు), పాత అమ్మ దేవతలకిపుడు కొత్తగా తెస్తున్న ప్రతిమలు, వీటన్నింటికీ పురాణేతిహాసాలు, స్థానిక ఆచారాలు, కులాచారాల వంటివి ఎన్నో కారణాలు అవుతుంటాయి.

బౌద్ధ, జైనాలకు వాటి, వాటి ప్రత్యేక ఆరాధనా పద్ధతులున్నాయి. శిల్పశాస్త్రంలో మయుని శిల్పమతమే మయమతం. విశ్వకర్మ శాస్త్రం, అగస్త్య, కశ్యపుల రచనలు దేవాలయ ఆర్కిటెక్చర్‌కు విలువైన గ్రంథాలు. అగస్త్యుని సకలాధికారమనే గ్రంథం ద్రవిడ కళా వికాసానికి ఆధారం. దేవాలయ వాస్తుకర్తలు వశిష్ట, విశ్వకర్మ, నాగ్నజిత్, గర్గ, బృహస్పతులని పురాణాల వ్యాఖ్య. ప్రతిమలు లేదా మూర్తులు వివిధ దేవతల విగ్రహాలుగా చెక్కడానికి, తయారు చేయడానికి వివిధ సూత్రబద్ధ నియమాలను వరాహమిహిరుని బృహత్సంహిత, శుక్రుని శుక్రనీతి సారం వంటి పురాతన గ్రంథాలు వివరిస్తున్నాయి. ఉత్తరాది ఆర్య ప్రభావం దక్షిణాది దేవాలయ వాస్తు మీద ప్రభావాన్ని చూపింది. దక్షిణాది శిల్పశైలులు ఉత్తరాది దేవాలయాల్లో కూడా కనిపిస్తుంటాయి. స్థపతి (ఆర్కిటెక్ట్), సూత్రగ్రాహి (డిజైనర్), వర్ధకి (వడ్రంగి, నిర్మాణ నిష్పత్తులెరిగిన వాడు), తక్షక (రాయిని చెక్కేవాడు). వీరు విశ్వకర్మ నుంచి వచ్చిన వారు. విష్ణుధర్మోత్తర, మానసోల్లాస, అభిలషితార్థ చింతామణి, రూపమండన, దేవతామూర్తి ప్రకర ణం ప్రతిమా లక్షణ, వాస్తు శాస్త్రాలకు మౌలిక గ్రంథాలు. ఇవి కూడా ఉత్తరాది, దక్షిణాది భేదాలతో కనిపిస్తాయి.

దేవతామూర్తుల తయారీకి దారువు, డంగుసున్నం, ఇటుక, రాయి, దంతం, పెంకు, మట్టి, లోహం వంటి పదార్థాలు వాడబడ్డాయి. మట్టితో, కర్రతో చేసిన దేవతామూర్తులు కొంత కాలానికి శిథిలమైపోతాయి. కాల్చిన మట్టిబొమ్మలు (తప్త మృత్తిక, టెర్రకోట) ఎక్కువ కాలం మన్నిక కలిగినవి. ఎక్కువ మట్టుకు దేవతా శిల్పాలు రాయి, లోహంతో చేస్తుంటారు. శిల్పాగమాలు మూర్తులను దారువు, రాయి, విలువైన మణులు, లోహాలు, మట్టితో లేదా మిశ్రిత పదార్థాలతో కాని చేయవచ్చంటాయి. తొలుత మట్టి, దారువులతో విగ్రహాలు చేసేవారు. క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి శిల్పాలన్నీ శిలలతోనే చేయబడ్డాయి. ఏ శిల్పం కూడా స్వయంభువు కాదు. ఎవరో ఒక శిల్పి ఉలి, సుత్తెదెబ్బలు తాకకుండా ఏ దేవుడు గుడిలో అవతారమెత్తలేడు. తాత్విక విచారాలను, వివిధ ఆచార, సంప్రదాయాలను సాకల్యంగా తెలిసిన శిల్పుల చేతిలోనే అద్భుత దేవాలయాలు వెలసాయి. హరప్పా, మొహంజెదారో తవ్వకాలలో బయటపడిన ముద్రలు, శిల్పాల దగ్గర నుంచి నేటి అత్యంత పెద్ద శిల్పాల వరకు శిల్పులు తీర్చిదిద్దినవే.

దేవతామూ మానవుల వలెనే ఉన్న తలలు, చేతులు, ఆయుధాలు, వివిధ జంతు, పక్షుల వాహనాలు వేర్వేరుగా ఉంటాయి. తొలుత క్రీ.పూ. 5వ శతాబ్దం నుంచి బౌద్ధ, జైనాలున్నా ఆయా ధర్మాల్లో ప్రతిమలు కనిపించలేదు. జైన సరస్వతి ప్రతిమ శాసనంతో మధుర ‘కంకాళతిల’ తవ్వకాలలో ఇతర జైన శిల్పాలు, స్తూపాలతో పాటు లభించింది. సాంచీ, బార్హుత్ వంటి బౌద్ధస్తూపాలు నిర్మాణమైనవి, అపుడు బుద్ధుని శిల్పాలు ప్రత్యేకంగా లేవు. కుషాణుల కాలం నుంచి గాంధారశైలిలో ధ్యాన బుద్ధుడు, స్థానక బుద్ధుని శిల్పాలు చెక్కడం మొదలైంది.

తెలంగాణాలో క్రీస్తు శకానికి తర్వాత ఫణిగిరిలో, నేలకొండపల్లి, చాడ, వర్ధమానుకోట వంటి బౌద్ధ క్షేత్రాలలో బోధిసత్వుని, బుద్ధుని శిల్పాలు, స్తూపాలంకరణ శిల్పాలు అగుపించాయి. అవి తొలి చారిత్రక దశకు చెందినవి. తెలంగాణాలో జైన శిల్పాలు 6వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. తెలంగాణాలో దేశంలోనే తొలి దేవాలయాల అవశేషాలు మహబూబునగర్ జిల్లా రంగాపూర్, గుమ్మడాలలో బయటపడ్డాయి. అవి ఇటికెల నిర్మాణాలు. గుమ్మడం గుడి సర్వతోభద్రదేవాలయ నమూనా. అపూర్వమైంది. ఇక్ష్వాకుల కాలంలో విజయపురిలో నిర్మాణమైన సర్వదేవాలయం, అష్ఠభుజనారాయణుని శిల్పం వంటివి శైవ, వైష్ణవ మతాల ప్రతినిధులు.

  • శ్రీరామోజు హరగోపాల్
    (కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News