హైదరాబాద్: సైబర్ నేరాలపై (Cyber Fraud) ఎంత అవగాహన కల్పిస్తున్న ఎవరో ఒకరు ఆ ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్‌కి సంబంధించిన వివరాలను వెల్లడించవద్దని పదే పదే చెబుతున్నా.. ఆ మాట పెడచెవిన పెట్టి సైబర్ నేరగాళ్ల కాటుకు బలి అవుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ పురోహితుడికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. పాతబస్తీ పురానాపూల్‌కి చెందిన పురోహితుడిని పూజ పేరుతో రూ.6 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామని.. కల్నల్ సర్ ఆరోగ్యం బాగోలేదని చెప్పారు.
11 రోజుల పూజ కోసం 21 మంది పురోహితులు కావాలని నమ్మబలికారు. అడ్వాన్స్ కింద మూడు లక్షలు చెల్లిస్తామని కూడా చెప్పారు. తొలుత రూ.10 పంపి.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి మిగితా డబ్బు పంపిస్తామని కార్డు, పిన్ వివరాలు తెలుసుకున్నారు. దాంతో విడతల వారిగా రూ.5.99 లక్షలు నేరగాళ్లు (Cyber Fraud) కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు 1930కు కాల్ చేసి జరిగింది చెప్పాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.