Tuesday, August 26, 2025

ఆధునిక బానిసత్వం అమానవీయం

- Advertisement -
- Advertisement -

‘నేను వెయ్యి మంది బానిసలకు విముక్తి కల్పించాను. వారు బానిసలని తెలిస్తే నేను ఇంకా ఎక్కువమందిని విడిపించగలిగే వాడిని’ అని బానిసత్వం నిర్మూలనవాది హ్యారియెట్ టబ్ మాన్ అన్నారు. ఆమె మాటలు ఓ చేదు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. బానిసత్వం చట్టం చేసినంత మాత్రాన అంతరించిపోదు. అజ్ఞానం, భయం, బలహీనత ఉన్న చోట అది కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు చట్టబద్ధంగా రద్దు చేసినప్పటికీ, బానిసత్వం మరో రూపంలో వృద్ధి పొందుతూనే ఉంది. వెట్టి చాకీరీ, మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, వలస కార్మికుల నిర్బంధ పని, దుర్వినియోగం రూపంలో సాగుతోంది. ఈ సంకెళ్లు ఇనుప సంకెళ్లు కాకపోవచ్చు. కానీ లక్షలాదిమందిని అలాగే కఠినంగా బంధిస్తున్నాయి. బానిసత్వం గత చరిత్ర అని నమ్మడంలో ప్రమాదకరమైన ఆత్మసంతృప్తి ఉంటుంది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్లమంది ఆధునిక బానిసత్వంలో బలవంతపు శ్రమలోనో, బలవంతపు (labor forced) వివాహ వ్యవస్థలోనో చిక్కుకున్నారు. ఈ సంఖ్యే మన భ్రమలను కూప్పకూలుస్తోంది. బానిసత్వం కేవలం పేరు మారింది. కాంట్రాక్టర్లు దీనిని ఉపాధి అంటారు. అక్రమ రవాణాదారులు దీనిని వలస అవకాశాలు అని వ్యవహరిస్తారు. ప్రభుత్వాలు దీనిని అక్రమ చొరబాటుదారులుగా ముద్ర వేస్తాయి. అయినా ప్రాథమికంగా అదే పాత పద్ధతి. గౌరవం ఉండదు, ఎన్నుకునే వీలు ఉండదు, బలవంతంగా సేవ చేయక తప్పదు. ‘జ్ఞానం మనిషిని బానిసగా ఉండడానికి అనర్హుడిని చేస్తుంది’ అని బానిసత్వం నిర్మూలనవాది ఫ్రెడరిక్ డగ్లస్ హెచ్చరించాడు.

అయినా నేడు లక్షలాదిమంది కార్మికులకు తమ బానిసత్వాన్ని ప్రశ్నించే జ్ఞానం కానీ, ధైర్యం కానీ లేదు. ముఖ్యంగా వలస కార్మికులు సులక్షంగా చిక్కుతారు. వారికి స్థానిక భాష మాట్లాడడం రాదు. చట్టాలు తెలియవు, మనుగడ సాగించాలంటే పని చేయాల్సిందే. యజమానులు, దళారులు ఈ బలహీనతను ఉపయోగించుకుని వారి జీవితాలను చీప్ లేబర్‌గా ఉపయోగించుకుంటున్నారు. మరో దారుణం ఏమిటం ప్రజాస్వామ్యం, మానవహక్కులు, ప్రపంచ పాలన గురించి గొప్పలు చెప్పుకునే ప్రపంచంలో బానిసత్వం సజీవంగా ఉంది. స్పష్టంగా కన్పించకపోయినా మరుగున దాగి ఉంది. భారతదేశం ఈ హిపోక్రసీకి అతీతం కాదు. బెంగాలీ మాట్లాడే వలస కార్మికుల దుస్థితి ఇందుకు ఉదాహరణ.

వారు పశ్చిమబెంగాల్, అసోం పౌరులైనా, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులైనా దాదాపు బంగ్లాదేశ్ చొరబాటుదారులనే ముద్ర వేసేస్తున్నారు. ఈ కార్మికులు వివక్షకు గురవుతున్నారు. వారిని బయటి వ్యక్తులు అని పిలుస్తూ, సమాజం వారి దోపిడీని సమర్థిస్తోంది. ఆ ముద్రపడిన తర్వాత ఈ కార్మికులు, మురికి పనులు, అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాల్లో బలవంతంగా నెట్టివేయబడతారు. భద్రతా పరికరాలు ఉండవు, మురుగునీరు శుభ్రపరచడం, కాంట్రాక్టులు లేకుండానే నిర్మాణ కార్మికులుగా, పెద్దగా వేతనాలు, గౌరవం లేని పని మనుషులుగా పని చేస్తున్నారు. చాలా మందిని ముందే అప్పురూపంలో డబ్బు చెల్లించి బలవంతంగా పనుల్లో చేర్చుకుంటారు. అప్పులు తీరవు, తిరిగి చెల్లించలేరు.

అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. నిర్మొహమాటంగా మాట్లాడితే ఇది బానిసత్వం. కార్మికులకు గౌరవం లేకుండా, బలవంతంగా పని చేయించడం, చట్టపరమైన రక్షణ నిరాకరించడం, దీనిని వలసదోపిడీ అని తోసిపుచ్చడం దారుణం. భారతదేశంలో రోహింగ్యాలు, బంగ్లా శరణార్థుల పట్ల వ్యవహిస్తున్న తీరు ఇంకా దారుణం. వారికి దేశం లేదు. ఎదురించే సత్తా, నోరు లేదు. చెత్త ఎరుకోవడం వంటి దిగజారుడు పనులలోకి వారిని నెట్టివేస్తున్నారు. వారి విలువను, వారు ఆర్థిక వ్యవస్థకు చేసే ప్రయోజనంతోనే బేరీజు వేస్తారు. ప్రజాస్వామ్య విలువల గురించి గొప్పగా చెప్పుకునే భారతదేశం ఈ వైరుధ్యాన్ని తప్పించుకోలేదు. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది.

ప్రపంచంలో ఇతర దేశాలను వేలెత్తి చూపించే ముందు యూరప్ తన మనస్సాక్షిని స్వయంగా పరీక్షించుకోవాలి. సిరియా, లెబనాన్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి యుద్ధ సమయంలో పారిపోయిన శరణార్థులు భద్రతకోసం యూరప్ చేరుతున్నారు. కానీ, కొత్త సంకెళ్లలో చిక్కుకుంటున్నారు. ఇటలీలో సిరియనా వలసదారులు తక్కువ జీతాలకు పంటలు పండిస్తారు. జర్మనీలో శరణార్థులు కనీస జీతం కూడా లేకుండా ఇళ్లలో పని మనుషులుగా పని చేస్తారు. ఫ్రాన్స్ లో శరణార్థులు ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణాలలో వెట్టి చేస్తున్నారు. యురోపియన్ దేశాలు ప్రపంచానికి మానవ హక్కుల గురించి పెద్దగా ఉపన్యాసాలు ఇస్తూనే, శరణార్థుల దోపిడీ ద్వారా నిశ్శబ్దంగా ప్రయోజనం పొందుతున్నాయి. ఇదో హైలెవెల్ హిపోక్రసీ, శరణార్థులను యుద్ధ బాధితులుగా కాక చవకగా, వాడుకుని పారేసే కార్మికులుగా పరిగణిస్తున్నారు.

పెట్టుబడిదారీ విధానంలో ఆధునిక పద్ధతుల్లో సాగుతున్న బానిసత్వం కాక ఇది ఏమిటి? 19వ శతాబ్దపు బానిసత్వ నిర్మూలన చట్టాలతో బానిసత్వం అంతమైందని ప్రకటించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. నిజం చాలా కఠినంగా ఉంటుంది. బానిసత్వాన్ని ఔట్‌సోర్స్ చేసి రీబ్రాండ్ చేశారు. తోటలు, పొలాలకు బదులు చెమట దుకాణాలు ఉన్నాయి. గతంలోని వేలం బ్లాక్‌లకు పదులు నియామకసంస్థలు ఉన్నాయి. గొలుసులకు బదులు రుణాల ఉచ్చులు, పాస్ పోర్ట్ జప్తుచేసే యజమానులు ఉన్నారు. బానిసత్వం ఉన్నదా లేదా అన్నది ప్రశ్నేకాదు. అది ఉంది. ప్రభుత్వాలు, సమాజాలు వీటిని ఎందుకు అనుమతిస్తున్నాయన్నదే ప్రశ్న. ఆగస్టు 23 నేడు అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం. ప్రతి సంవత్సరం దీనిని సింబాలిక్‌గా తప్పక జరుపుకుంటాం. సింబాలిక్‌గా జరుపుకుంటే బానిసలకు ముక్తి లభించదు. పోస్టర్లు, సెమినార్లు, హ్యాష్ ట్యాగ్‌లు దోపిడీ వ్యవస్థను విచ్ఛిన్నం చేయవు. రాజకీయ చిత్తశుద్ధి, ధైర్యం, చట్టాలను కఠినంగా అమలు చేయడం అవసరం.

అయినా ప్రభుత్వాలు పదేపదే విఫలమవుతున్నాయి ఎందుకు? ఎందుకంటే ఆధునిక బానిసత్వం శక్తివంతులకు ప్రయోజనం కలిగిస్తుంది. నిర్మాణ సంస్థలకు ఖర్చు తగ్గుతుంది. ఇళ్లలో చవకగా పనివారు దొరుకుతారు. కార్పొరేషన్లు తక్కువ జీతంతో పనిచేయించుకుని ప్రయోజనం పొందుతాయి. రాజకీయ నాయకులు వలస జనాభాలో సులక్షంగా బలిపశువులను కనుగొంటారు. దోపిడీ లాభదాయకం. అందుకే కొనసాగుతోంది. ఈ ఆర్థిక ప్రయోజనాలను తొలగించకపోతే బానిసత్వం అంతంకాదు. తగిన చర్యలు లేకుండా కేవలం అవగాహన కల్పన అన్నది హిపోక్రసీ మాత్రమే. సమాజంలో అన్నిరకాల ప్రజలను, కార్మికులను, శరణార్థులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయినా చాలా ప్రభుత్వాలు సాకులు వెతుక్కుంటున్నాయి. భారతదేశంలో వలసదారులను మనుషుల కంటే నీచంగా చూడడాన్ని సమర్థించుకునేందుకు భద్రతా ఆందోళనలను బూచిగా చూపుతున్నారు. యూరప్‌లో చవకగా శరణార్థుల శ్రమను దోచుకోవడాన్ని ఆర్థిక అవసరం అని చెబుతున్నారు. రెండు వాదనలూ అనైతికమైనవే.

ఓ ప్రభుత్వం తమ దేశంలోని కార్మికుల గౌరవం, భద్రత నిర్ధారించని పక్షంలో అది తన ప్రాథమిక విధిలో విఫలమై బానిసత్వాన్ని నిర్మూలించడం దాతృత్వం కాదు న్యాయం. ప్రభుత్వాలను నిందించడం సులభం. కానీ, సమాజాలూ దోషులే. తక్కువ జీతంతో ఇళ్లలో పని వాళ్లను నియమించుకునే మధ్య తరగతి కుటుంబాలు, చవకగా వలసకార్మికులను వాడుకునే కాంట్రాక్టర్లు, శ్రమజీవులతో తయారైన ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులు మనం అందరం ఈ ఆధునిక బానిసత్వం గొలుసులో పాల్పంచుకుంటున్నాం. సత్యాన్ని అంగీకరించడం కష్టంగానే ఉంటుంది. కానీ, బానిసత్వం కొనసాగుతోంది అంటే మనం దానిని అనుమతించడం వల్లనే. నిర్మాణ రంగంలో బాల కార్మికులను చూస్తాం, మురుగునీటిని ఒట్టిచేతులతో శుభ్రం చేస్తున్న కార్మికులను పట్టించుకోము. వలసదారులను చట్ట విరుద్ధమైన వ్యక్తులు అని ముద్ర వేసినప్పుడు మాట్లాడం, మౌనంగా వారికి సహకరిస్తాం.

బానిసత్వం నిర్మూలనను కంటితుడుపు చర్యగా వదిలివేయకూడదు. దాని నిర్మూలనకు కఠినమైన చర్య అవసరం. చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ప్రభుత్వాలు అన్నిరకాల బలవంతపు వెట్టి చాకిరీలను, కార్మికుల అక్రమ రవాణాను నేరంగా పరిగణించి కఠినంగా శిక్షలు అమలు చేయాలి. వలసదారులకు రక్షణ కల్పించాలి. కార్మికుల జాతీయతతో సంబంధం లేకుండా చట్టపరమైన హోదా, సామాజిక రక్షణ, యూనియన్ హక్కులు కల్పించాలి. ప్రపంచ దేశాలన్నీ సహకరించాలి. అంతర్జాతీయ నెట్‌వర్క్ ద్వారా అక్రమ రవాణా మాఫియాను కఠినంగా నిర్మూలించాలి. కార్మికులను నియమించుకునే సంస్థలను నియంత్రించాలి. ఆర్థికపరమైన జవాబుదారీతనం అవసరం. దోపిడీ సరఫరా గొలుసులకు కార్పొరేషన్లు బాధ్యత వహించాలి. చవకగా శ్రమ వాడుకునేందుకు మానవపరమైన గౌరవాన్ని పణంగా పెట్టకూడదు.

సామాజిక మేలుకొలుపు అవసరం. వలసదారులు, శరణార్థులపట్ల పౌరులు తప్పుడు ఆలోచనలు, పక్షపాత ధోరణులు మానుకోవాలి. బానిసత్వ నిర్మూలనవాది హ్యారియెట్ టబ్ మాన్ బానిసలను స్వేచ్ఛా ప్రపంచంవైపు నడిపించడం ద్వారా వారిని విడిపించారు. కానీ, ఇప్పుడు ఆ సంకెళ్లు స్పష్టంగా కనిపించవు. అందువల్ల వాటిని విచ్ఛిన్నం చేయడం కష్టం. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఇంకా ముగియలేదు. దాని యుద్ధభూమి మారింది. బెంగాలీ మాట్లాడే వలసదారులను చొరబాటుదారులుగా ముద్రవేసి, అమానవీయ శ్రమలోకి నెట్టినప్పుడు భారతదేశంలో ఇంకా బానిసత్వం కొనసాగుతూనే ఉంది. యూరప్‌లో శరణార్థులను వాడు కుని పారవేసే కార్మికులుగా ఉపయోగించుకున్నప్పుడు కూడా ఇది కొనసాగుతోంది.

ఆర్థికపరమైన దురాశ.. మానవ గౌరవంపై, విజయం పైచేయి సాధించినప్పుడు అది ప్రతిచోటా కొనసాగుతోంది. ఎవరినీ బానిసత్వంలో లేదా దాస్యంలో బంధించకూడదనే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన చెబుతోంది. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, సమాజాలు చిత్తశుద్ధితో ధైర్యంగా వ్యవహరించే వరకూ ఈ వాక్యాలు అమలులోకి రావు. ఆధునిక బానిసత్వం గతానికి సంబంధించినది కాదు. ఇది వర్తమానంలో సాగుతున్న నేరం. దానిని సహించడం మానవాళి అత్యంత ప్రాథమిక హామీని మోసం చేయడమే. ప్రతి మనిషికీ గౌరవంగా జీవించే హక్కు ఉంది. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చరిత్ర చెప్పే కథ కాదు. అది అసంపూర్ణంగా సాగుతున్న పోరాటం. ఇప్పుడు అది కఠినమైన. చిత్తశుద్ధితో కూడిన చర్యలను కోరుతోంది.

  • గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
  • రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News