లేని కరవును సృష్టించి గాజాను నాశనం చేస్తున్న ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు గట్టిగా ప్రయత్నించక తప్పదు. కొన్ని నెలలుగా గాజాలో సహాయ కార్యక్రమాలు సాగిస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, సహాయ సంస్థలు, డాక్టర్లు గాజా తీవ్ర దుర్భిక్షం అంచుల్లో ఉందని హెచ్చరిస్తున్నాయి. గాజాలో తిండిలేక ప్రతిరోజూ అనేక వందలాది మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నా, గాజాలో తాండవిస్తున్న తీవ్రకరవు, కాటకాలకు సంబంధించిన హృదయ విదారక కథనాలను పదేపదే ప్రపంచ దేశాలకు గాజా పౌర రక్షణ బృందాలు చాటి చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం గత 22 నెలలుగా జాతి విధ్వంసక యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది.
ఈ కథనాలన్నీ కేవలం కట్టుకథలుగా తోసిపుచ్చుతోంది. ఇజ్రాయెల్ మిత్ర దేశాలు నామమాత్రపు ఆందోళన వ్యక్తం చేయడం తప్ప మరేమీ చేయడం లేదు. గతవారం ఐక్యరాజ్యసమితి(United Nations)మద్దతు గల ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేస్ క్లాసిఫికేషన్(ఐపిసి) గాజా నగరంలోను, పరిసర ప్రాంతాల్లోనూ మానవ కల్పిత క్షామం తాండవిస్తోందని అధికారికంగా నిర్ధారించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ 5 లక్షల మందికి పైగా ఘోరమైన ఆకలితో అలమటిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి నిపుణులు చెప్పారు. ప్రతి ఐదు కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబమైనా తీవ్ర ఆహార కొరతలను ఎదుర్కొంటోందని, అలాగే పిల్లల్లో ప్రతి మూడో పిల్లవాడు లేదా అంతకన్న ఎక్కువ మంది తిండిలేక అలమటిస్తున్నారని ఐపిసి వెల్లడించింది.
రోజూ ప్రతి పదివేల మందిలో కనీసం ఇద్దరైనా తిండిలేక దాపురించే రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించింది. ఇజ్రాయెల్ ఒక పద్ధతి ప్రకారం అడ్డంకులు సృష్టిస్తున్నందువల్లే పాలస్తీనా భూభాగంలోకి ఆహారం వెళ్లడం లేదని యుఎన్ ఎయిడ్ చీఫ్ ఫ్లెచర్ స్పష్టం చేయడం గమనార్హం. ప్రఖ్యాత సంస్థ ఏదైనా అలాంటి విధ్వంసక నివేదికను వెల్లడిస్తే రణదాహంతో అల్లాడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ప్రభావం చూపిస్తుందని, అతని హృదయాన్ని ద్రవింప చేస్తుందని భావించడం పొరపాటే అవుతుంది. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ గాజా సిటీలో ఎలాంటి కరవు లేదని వాదిస్తోంది. యుఎన్ నివేదిక హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పిన అబద్ధాల ఆధారంగా తయారు చేసిందని మండిపడింది. 2007 నుంచి ఇజ్రాయెల్ ముట్టడిలో ఉన్న గాజాలో నిత్యావసరాలు, మరే వస్తువులు ప్రవేశించకుండా ఇజ్రాయెల్ సుదీర్ఘకాలంగా ఆంక్షలు విధించింది.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తరువాత ఆ ఆంక్షలను మరీ కఠినతరం చేసింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు ఉల్లంఘించిన తరువాత 2025 మార్చి 25 న గాజాలో ఎలాంటి నిత్యావసరాలు లేదా వస్తువులు ప్రవేశించకుండా మూడు నెలల పాటు ఇజ్రాయెల్ దిగ్బంధించింది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఇదివరకు నిర్వహించిన ఆహార పంపిణీ వ్యవస్థకు బదులుగా అమెరికా ఇజ్రాయెల్ సాయంతో ఏర్పాటైన గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ (జిహెచ్‌ఎఫ్) అనే కొత్త సంస్థ ఏర్పాటైన తరువాత పరిమితంగా ఆహారాన్ని అందించడం జరుగుతోంది. దిగ్బంధంతోపాటు ఆహార పంపిణీపై ఇజ్రాయెల్ నియంత్రణ ఉండడంతో వేలాది మంది ఆకలి మంటలకు బలైపోతున్నారు.
జిహెచ్‌ఎఫ్ కొద్దిగా ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలకు అన్నార్తులైన పాలస్తీనియన్లు పరుగులు తీస్తుండడం, రద్దీని అదుపు చేయడానికి అన్న సాకున వారిపై ఇజ్రాయెల్ దళాలు, జిహెచ్‌ఎఫ్ వాలంటీర్లు కాల్పులు జరపడం నిత్యకృత్యమైపోతోంది. గత మే నెల నుంచి 1300 కన్నా ఎక్కువమంది పాలస్తీనియన్లు ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా, తాజాగా కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించిందని ఖతార్, ఈజిప్టు దేశాలు ముందుకు తీసుకు వచ్చినా, కొత్తగా మళ్లీ నేరాలకు పాల్పడడానికి సిద్ధమవుతున్న రీతిలో గాజా సిటీని పూర్తిగా ఆక్రమించుకోడానికే ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేస్తోంది.
గాజా నగరానికి ఉత్తరాన ఉన్న జబాలియాలోని శరణార్ధుల శిబిరాలపై ఆదివారం రాత్రంతా దాడులు కొనసాగాయి. వైమానిక దాడులతోపాటు, ట్యాంకులతోనూ విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 64 మంది మృతి చెందగా, 300 మంది గాయపడ్డారు. గాజా సిటీలోని నాజర్ ఆస్పత్రిపై సోమవారం జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులతోపాటు కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023 అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 62 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. లక్షలాది మంది గాయపడ్డారు. 200 మందికిపైగా మీడియా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
గాజా సిటీ లక్షంగా చేపట్టిన ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ 60 వేల మందితో రిజర్వు దళాలను రంగం లోకి దింపింది. మొత్తం గాజా స్ట్రిప్‌ను తన ఆధీనం లోకి తెచ్చుకోవాలన్న రణకాంక్షతో ఇజ్రాయెల్ పేట్రేగిపోతోంది. హమాస్‌ను ఓడించి, బందీలను విడిపించేవరకు తాము నిద్రపోయేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో పాలస్తీనియన్ల జీవితాలను, సమాజాన్ని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలన్నదే తన ఏకైక లక్షం. రణకాంక్షతో ఇజ్రాయెల్ పేట్రేగిపోతోంది. ప్రపంచ దేశాల సాక్షిగా 2.3 మిలియన్ ప్రజలకు వ్యతిరేకంగా అత్యంత క్రూరమైన నేరాలు సాగుతున్నాయి. ఇకనైనా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ దురాగతాలను కొనసాగనీయకుండా నివారించే ప్రయత్రం చేయక తప్పదు.